raikod mandal
-
నీటమునిగిన పంటలు
చెరువులకు జలకళ పొంగిపొర్లుతున్న వాగులు వంకలు రాయికోడ్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. మండలంలోని రాయిపల్లి, కర్చల్, మోరట్గా, మామిడిపల్లి, ఇందూర్ సిరూర్, దౌల్తాబాద్ తదితర గ్రామాల శివార్లలో సాగు చేసిన కంది, పత్తి, జొన్న, సోయాబీన్ తదితర పంటలు నీట మునిగాయి. వారం రోజుల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నీటి వనరుల పరిసరాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరింది. నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నా పంటలు చేతికందే పరిస్థితులు లేవని సాగు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మండలంలోని ఆయా గ్రామాల్లో నిట మునిగిన పంటల వివరాలను సేకరించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున మంజీర నదిలోకి చేరింది. మండలంలోని 18 గ్రామాల శివార్ల నుంచి మంజీర నది ప్రవహిస్తోంది. నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో ఆయా గ్రామాల శివార్లలోని పంట భూముల్లో సాగు చేస్తున్న పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. మంజీర నదికి సమీపంలోని పంట పొలాల్లోని పంటలు అసలే చేతికందేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా మండలంలోని ఇందూర్, హస్నాబాద్, సింగితం, జంమ్గి, కుసునూర్, ఔరంగానగర్ తదితర గ్రామాల్లోని చెరువులుకు జలకళ వచ్చింది. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆశాజనకంగా కంది పంట
రాయికోడ్: మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఈ ఏడాది సాగు చేసిన కంది పంట ఆశాజనకంగా ఉంది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రాయికోడ్, పీపడ్పల్లి, కర్చల్, మోరట్గా, మామిడిపల్లి, రామోజిపల్లి, నల్లంపల్లి, సిరూర్, దౌల్తాబాద్ తదితర గ్రామాల్లో రైతులు కంది పంటను సాగు చేశారు. అనంతరం పంట ఎదుగుదల, రక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుతున్నారు. ఇటీవల మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం కంది పంటకు ఎంతో మేలు చేకూర్చింది. కంది పొలాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఏపుగా పెరిగిన మొక్కలతో కంది పొలాలు కళకళలాడుతున్నాయి. మండలంలోని 32 గ్రామాల్లో ఈ ఏడాది 1,280 హెక్టార్ల విస్తీర్ణంలో కంది పంటను సాగు చేశారు. గత ఏడాది ఎంతో ఆశతో కంది పంటను సాగు చేసిన రైతులకు లద్దె పురుగు బెడదతో నష్టాలు వచ్చాయి. పంటలో 50 శాతం కంది పంట లద్దెపురుగు దాటికి గురైంది. దీంతో పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రైతులకు రాలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని కంది సాగు రైతులు పంట పొలాలను నిత్యం పరిశీలిస్తూ మొక్కల ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది కూడా కందికి ఇప్పుడిప్పుడే లద్దెపురుగు ఆశిస్తోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లద్దె పురుగు బారి నుంచి పంటను రక్షించుకుంటే ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
రాయికోడ్: మండల కేంద్రమైన రాయికోడ్‌లో 190 మీటర్ల పొడవున నూతనంగా సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నిర్మాణం పనులు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నుంచి దారి మళ్లించారు. తహసీల్దార్ కార్యాలయ సమీపం మీదుగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్దకు మళ్లించారు. బైపాస్ దారికి ఏ మాత్రం మరమ్మతులు చేయకుండానే వాహనాలను మళ్లించారు. ప్రస్తుతం వాహనాలను దారి మళ్లించిన మార్గంలోని పలు ప్రాంతాల్లో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ఏ మాత్రం ప్రయాణానికి పనికి రాకుండా ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఎటు వైపు నుంచి నడపాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మూలమలుపుల వద్ద ఆదివారం ఓ కారు ప్రమాదానికి గురైంది. పలువురు ద్విచక్ర వాహనదారులు మూలమలుపుల వద్ద ప్రమాదాలకు గురయ్యారు. మహమ్మదాపూర్ ప్రధాన రహదారి సమీపంలో గల మూలమలుపు వద్ద పలు లారీలు గుంతల్లో ఇరుక్కుపోయాయి. వీటిని జేసీబీల ద్వారా బయటకు లాగడానికి రూ.వేలల్లో ఖర్చయినట్లు డ్రైవర్లు తెలిపారు. ప్రమాదాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల జహీరాబాద్ డిపోకు చెందిన హైదారాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు మూలమలుపు వద్ద అదుపు తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డాడు. నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ రహదారిని సక్రమంగా సిద్ధం చేయడంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.