ఇందూర్ శివారులో నీట మునిగిన పంట పొలాలు
- చెరువులకు జలకళ
- పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
రాయికోడ్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. మండలంలోని రాయిపల్లి, కర్చల్, మోరట్గా, మామిడిపల్లి, ఇందూర్ సిరూర్, దౌల్తాబాద్ తదితర గ్రామాల శివార్లలో సాగు చేసిన కంది, పత్తి, జొన్న, సోయాబీన్ తదితర పంటలు నీట మునిగాయి.
వారం రోజుల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నీటి వనరుల పరిసరాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరింది. నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నా పంటలు చేతికందే పరిస్థితులు లేవని సాగు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మండలంలోని ఆయా గ్రామాల్లో నిట మునిగిన పంటల వివరాలను సేకరించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున మంజీర నదిలోకి చేరింది. మండలంలోని 18 గ్రామాల శివార్ల నుంచి మంజీర నది ప్రవహిస్తోంది. నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో ఆయా గ్రామాల శివార్లలోని పంట భూముల్లో సాగు చేస్తున్న పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
మంజీర నదికి సమీపంలోని పంట పొలాల్లోని పంటలు అసలే చేతికందేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా మండలంలోని ఇందూర్, హస్నాబాద్, సింగితం, జంమ్గి, కుసునూర్, ఔరంగానగర్ తదితర గ్రామాల్లోని చెరువులుకు జలకళ వచ్చింది. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.