కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాదు! కొండే అడ్డు రానీ.. | In What Extent Human Making Life And The Living Fruitful For Us | Sakshi
Sakshi News home page

కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాదు! కొండే అడ్డు రానీ.. తలవంచక సాగడమే..

Published Mon, Jul 17 2023 9:45 AM | Last Updated on Mon, Jul 17 2023 10:04 AM

In What Extent Human Making Life And The Living Fruitful For Us - Sakshi

ఆచరణల ప్రసంగం, ఆశల ప్రణాళిక, నమ్మకాల ప్రదర్శన, అభిప్రాయాల ప్రకటన, గుణాల ప్రతాపం, భావాల ప్రవాహం, ఆలోచనల ప్రస్థానం మనిషి జీవనం, జీవితం. జీవనం, జీవితం వీటిని మనిషి ఏ మేరకు ఫలవంతం చేసుకుంటున్నాడు? ఎంత సారవంతం చేసుకుంటున్నాడు? తన జీవనం, జీవితం వీటివల్ల మనిషి ఏ మేరకు ఫలవంతం ఔతున్నాడు? ఎంత సారవంతం ఔతున్నాడు? ఈ ప్రశ్నలకు సంతప్తికరమైన జవాబులు మాత్రమే రావాలి లేదా సాధించుకోవాలి. అందుకనే మనిషికి జీవనం, జీవితం ఉన్నాయి; అందుకనే జీవనం, జీవితం వీటితో మనిషి ఉన్నాడు. మనిషికి జీవనం లేకపోతే జీవితం లేదు; జీవితం లేకపోతే జీవనం లేదు. జీవనం, జీవితం ఈ రెండూ లేకపోతే మనిషి లేడు.

ఉన్న మనిషికి ఉండే జీవనం, జీవితం మనిషి సఫలం అయ్యేందుకే కాని విఫలమూ, విధ్వంసమూ అయ్యేందుకు కాదు; విఫలమూ, విధ్వంసమూ చేసేందుకు కాదు. మనిషి మస్తిష్కం ఆకాశం ఐతే అక్కడ నుంచి నాణ్యమైన, సరైన భావనల వానపడితే ఆ వానకు మనసు తడిస్తే జీవనం పూస్తుంది; జీవితం రూపొందుతుంది. జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ అవాలంటే మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ ఉండాలి లేదా నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉండాలి. మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉంటే జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఔత మనిషికి మాన్యత వస్తుంది. పుట్టేశాం కదా అని కాలాన్ని తోసెయ్యడం జీవనం కాదు; కాలంవల్ల తోసెయ్యబడడం జీవితం కాకూడదు.

అభిప్రాయాల్నీ, మనోభావాల్నీ పేర్చుకుంటూపోవడం జీవనం కాదు; వాటినే మోసుకుంటూ వాటి బరువుకు కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాకూడదు. వాగులో కొట్టుకుపోవడం కొనసాగడం ఔతుందా? ప్రవాహంలో ముందుకు ఈదడమూ, అవసరానికి ఆనుగుణంగా ప్రవాహానికి ఎదురు ఈదడమూ జీవనం అవుతుంది; నదిలో కొట్టుకుపోవడమా? కాదు, కాదు నదిలా ప్రవహించడం జీవితం ఔతుంది. రాని పిలుపును విని వడివడిగా వెళ్లడం జీవనం కాదు; లేని చోటును వెతుక్కుంటూ వెళ్లడం జీవితం కాదు. ఉన్న దారిలో లేని తలుపులు మూసుకుని ఉన్నాయి అని అనుకుని ఊరికే పడి ఉండడం జీవనం కాదు; కొండే అడ్డుగా ఉన్నా దారీ, తీరూ మార్చుకుని నీరులా ముందుకు సాగడమే జీవితం.

మనిషికీ జీవితం ఒక గుంటగానూ, ఆ గుంటలో పడిపోయి పరుగెత్తుతూ ఉండడం జీవనంగానూ అవకూడదు. తనను తాను కోల్పోవడం మనిషికి జీవితం అవుతుందా? అవదు, అవదు; తన నుంచి తాను కోలుకోవడం ఏం ఔతుంది? అదే జీవితం ఔతుంది! పోగొట్టుకోవడం జీవనం అవదు అన్న తెలివిడి వస్తే పొందడం అన్నది జీవితం అవుతుంది అని తెలియవస్తుంది మనిషికి. మనిషి తననుంచి తాను విడివడడం అన్న కళను అభ్యసించి నేర్చుకోవాలి. జన్మతః మనిషికి మానసికంగానూ, చింతనపరంగానూ లోపాలు, దోషాల ఉంటాయి.

లోపాలు, దోషాల లేని మనిషి ఉండడం ఉండదు. తన లోపాల్నీ, దోషాల్నీ వదులుకోవడం కోసం మనిషి తన నుంచి తాను విడివడాలి లేదా విడుదలవ్వాలి. అలా జరిగితే అప్పుడు అది జీవనం ఔతుంది. తనను తాను మాటిమాటికీ సరి చూసుకుంటూ, సరి చేసుకుంటూ తనలోకి తాను చేరుతూ ఉంటే అప్పుడు అది జీవితం ఔతుంది. జీవితం తనతో ఉన్నప్పుడు మనిషి దాన్ని ఉపయోగించుకోవడం జీవనం; జీవనం ఉపయోగపడడంవల్ల ఉన్నతిని పొందడం జీవితం. జీవనానికి జీవితం ఉండాలి;

జీవితానికి జీవనం పండాలి; మహిలో మనిషి మెరవాలి. జీవనమూ, జీవితమూ ఉన్నాయి కాబట్టి మరణించాక కూడా మనిషి పరిమళించాలి. ఇక చివరిగా ఏది మనిషికి విజయం తన జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఐనా జీవనం, జీవితానికి విజయం, ఫలవంతమూ సారవంతమూ ఐతే జీవితానికి జీవనం విజయం.
– రోచిష్మాన్‌

(చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement