model houses
-
ఇన్నాళ్లకు కల తీరింది..
సాక్షి, దెందులూరు: పాదయాత్ర సమయంలో ఊరూరా నిరుపేద గూడు గోడు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. పేదలు సొంత ఇల్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నట్లు తెలుసుకుని “నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే అర్హులు ఎంతమంది ఉంటే అందరికీ ఉచితంగా స్థలం ఇవ్వడమే కాక ఇంటిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 25వ తేదీ నుంచి రాష్ట్రమంతా అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 1,70,699 మందికి సొంత ఇంటి కల నెరవేరింది. అంతే కాకుండా ఇంటి పట్టాతో పాటు ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు నిధులు ఉచితంగా మంజూరు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరిట మంజూరు పత్రాలు సైతం అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ విషయమై లబ్ధిదారులకు మూడు అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం, లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేయడంతో సగం ధరకే మెటీరియల్‌కు సంబంధించి నిధులు బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చొరవతో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఆదర్శ గృహాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు కొత్త ఇళ్లల్లోకి మకాం మార్చడం విశేషం. ఇంటి నిర్మాణం ఇలా.. ప్రతి ఇంట్లో వసారా, కిచెన్, రెండు బెడ్రూమ్లు, బాత్రూమ్, శ్లాబ్, ఇంటిపై వాటర్ ట్యాంక్ ఏర్పాటుతో నిర్మాణం చేసేట్లు గృహ నిర్మాణ శాఖ రూపొందించింది. సీఎం మరో నజరానా ఈ పథకానికి మరింత వన్నె తెచ్చేలా ప్రతి లబ్దిదారునికి ఉచితంగా రెండు ప్యాన్లు రెండు ట్యూబ్లైట్లను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లకు కల తీరింది సొంత ఇంటిలో ఉండాలన్న నా కలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నెరవేర్చారు. ఇంటి నిర్మాణం చేసి ప్రభుత్వం నాకు అందజేయటం, కుటుంబ సభ్యులతో మేము సొంత ఇంటిలో ఉండటం ఎన్నటికీ మరచిపోలేని విషయం. సీఎం, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటాం. – తొంటా సరస్వతి, లబ్ధిదారురాలు, పెదవేగి ఇల్లు నిర్మించి అప్పగించాం పెదవేగిలో మోడల్ హౌస్ నిర్మించి లబ్ధిదారునికి అప్పగించాం. లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేసి కుటుంబ సభ్యులతో ఆ ఇంటిలో నివాసం ఉండటం చాలా సంతోషంగా ఉంది. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు సహకరించాలి. ఇళ్ల పట్టా, నిర్మాణ మంజూరు పత్రాలు ఒకేసారి అందజేస్తున్నాం. – కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ -
నిరుపయోగంగా మోడల్ హౌస్
సాక్షి, టేక్మాల్(మెదక్): నిరుపేదల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మోడల్ హౌస్‌లు అలంకారప్రాయంగా మిగిలాయి. కొన్ని అసంపూర్తిగా వదిలేయగా మరికొన్ని నిర్మాణం పూర్తై నిరుపయోగంగా మారాయి. శిథిలావస్థకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వెరసి అనుకున్న లక్ష్యం నాణ్యతతో కూడిన ఇల్లు ఎలా కట్టుకోవాలో లబ్ధిదారులకు చాటి చెప్పేందుకు ఈ భవనాలు నిర్మించారు. ఒక్కో భవనానికి కేవలం రూ.1.50లక్షలు ఖర్చు చేసి ఒక కుటుంబం ఉండేందుకు వీలుగా బెడ్రూం, హాల్, కిచెన్, వరండాతో సహా ఎలా కట్టుకోవాలో నిర్మించి మరీ చూపించారు. అంతా బాగానే ఉన్నా ఈ భవనాలు పూర్తై దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నాయి. మండలానికొక నిర్మాణం.. జిల్లా వాప్తంగా 2012–13లో మండలాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణానికి హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.1.50 లక్షలు వెచ్చించి పూర్తి నమూనా ఇళ్లను నిర్మించాల్సిందిగా అధికారులు నిర్ణయించారు. తర్వాత గ్రామాలకు విస్తరించాలనుకున్నారు. మొదట్లో పనులు బాగానే కొనసాగాయి. 80శాతం వరకు పూర్తి చేశారు కూడా. మిగతా పనులు కూడా పూర్తి చేసి హౌసింగ్ శాఖ మండల కార్యాలయంగా ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్థానంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని తీసుకువచ్చింది. హౌసింగ్ శాఖను కూడా పూర్తిగా రద్దు చేసి సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేసింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిర్మాణం చేపట్టిన మోడల్ హౌస్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వీటికి కరెంట్ సరఫరా, వైరింగ్, తలుపులు, కిటికీల బిగింపు, పెయింటింగ్ వేయడం వంటి పనులు చేపట్టకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయాయి. శిథిలావస్థకు చేరుతున్న భవనాలు.. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాల పనులు ఇంకా పూర్తికాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా మండలాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మందుబాబులు, పేకాట రాయుళ్లకు రాత్రివేళ సిట్టింగ్ కోసం ఉపయోగపడుతున్నాయి. మరికొన్ని మండలాల్లో ఇతర శాఖల అధికారులు వీటిని స్టోర్ రూంలుగా వాడుకుంటున్నారు. మరిన్ని నిధులు వెచ్చించి భవనాలను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. వినియోగంలోకి తేవాలి. లక్షలాది రూపాయలతో నిర్మించిన మోడల్ హౌస్‌లను వినియోగంలోకి తేవాలి. ప్రభుత్వం భవనాల నిర్మాణానికి మరింత డబ్బులు వెచ్చించి పూర్తి చేస్తే బాగుంటుంది. ఏదైనా ప్రభుత్వశాఖ కార్యాలయంగా వాడుకోవచ్చు. ప్రజాధనం వృథా చేయడం సరికాదు. – మజహర్, కో–ఆప్షన్ సభ్యుడు, టేక్మాల్ -
నమూనా ఇళ్ల నిర్మాణం
3న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభం కలెక్టర్ ముత్యాలరాజు వెంకటాచలం: మండలంలోని చౌటపాళెం పంచాయతీలోని సరస్వతీనగర్‌లో బిల్డింగ్ మెటీరియల్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్(బీఎంటీపీసీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మోడల్ హౌస్ సముదాయాన్ని సెప్టంబర్ 3న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు చేతులుమీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. మోడల్ హౌస్ సముదాయాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.4.55కోట్లతో మొత్తం 36 ఇళ్లను సముదాయంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. జీఎఫ్ఆర్జీ సిస్టంతో నిర్మిస్తున్న ఇళ్లను 36 మంది లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పారు. అలాగే ప్రాంగణంలో రూ.73.4లక్షలతో కమ్యూనిటీహాలు, మరో రూ.72.4లక్షలతో ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కలెక్టర్ వెంట బీఎంటీపీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శైలేష్ అగర్వాల్, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ సుధాకర్, తదితరులు ఉన్నారు. హెలిప్యాడ్ పరిశీలన వెంకటాచలం మండలానికి సెప్టంబర్ 3,4 తేదీల్లో ప్రముఖులు రానున్నారు. 3న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 4న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రియో ఒలింపిక్స్ రజక పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల్ల గోపిచంద్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు రానున్నారు. స్వర్ణభారత్‌ట్రస్ట్, అక్షర విద్యాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వెంకటాచలంలోని క్యూబా కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ ముత్యాలరాజు పరిశీలించారు.