సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేసేందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.43 కోట్ల విలువ చేసే పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లెక్కన 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.15,810 కోట్లు ఖర్చుచేయనుంది.
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించే యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడ్కోతో కలిపి ఇప్పటికే రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వగా 20.28 ఇళ్లకు శంకుస్థాపనలు జరిగి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లలో ఇప్పటికే 3.40 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
లక్ష్య సాధనలో భాగంగా...
ప్రస్తుతం రోజుకు సగటున రూ.25 కోట్ల నుంచి రూ.28 కోట్ల పనులు చేస్తున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రూ.43 కోట్ల మేర పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుల్లో కాలయాపన లేకుండా చూస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.730 కోట్ల మేర గృహ నిర్మాణ సంస్థ బిల్లు చెల్లింపులు చేపట్టింది. మరోవైపు.. శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆ రోజు జిల్లా కలెక్టర్లు, మండల, సచివాలయాల స్థాయి అధికారులు లేఅవుట్‌లను సందర్శించి పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
ఇలా ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఏడు హౌసింగ్ డేలు నిర్వహించారు. అధికారులు 306 లేఅవుట్‌లను సందర్శించారు. ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇందులో హౌసింగ్ డే రోజున లేఅవుట్‌లకు వెళ్లిన అధికారులు తనిఖీల తాలూకు ఫొటోలను అప్‌లోడ్ చేయడంతో పాటు, తమ దృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను టోకెన్ రైజ్ చేస్తున్నారు. అంతేకాక.. 11 మంది సీనియర్ అధికారులను ఆయా జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా గృహ నిర్మాణ శాఖ నియమించింది. వీరు ప్రతినెలా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి ఇళ్ల పథకం అమలు, తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు.
గత ఏడాది రోజూ రూ.28 కోట్ల ఖర్చు
గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.28 కోట్ల చొప్పున పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చుచేసింది. పేదలకు ఖరీదైన ప్రాంతాల్లో ఉచితంగా స్థలాలిచ్చిన ప్రభుత్వం, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీంతోపాటు పావలా వడ్డీకి బ్యాంకు రుణం రూపంలో రూ.35 వేలు అందిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు.. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తున్నారు. ఇలా 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణ పథకం కోసం ప్రభుత్వం రూ.10,203 కోట్లు ఖర్చుచేసింది.
జిల్లాలకు రోజువారీ లక్ష్యాలు
ఇళ్ల నిర్మాణాల వేగాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. ఎక్కడైనా పనులు మందగమనంలో ఉంటే అక్కడ పర్యటించి సమీక్షించి పనులు జోరందుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఐదు లక్షల ఇళ్లను పూర్తిచేయనున్నాం. – లక్ష్మీశా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment