యూరియా గుప్పించారు  | Massively increased urea consumption | Sakshi
Sakshi News home page

యూరియా గుప్పించారు 

Published Fri, Oct 6 2023 2:10 AM | Last Updated on Fri, Oct 6 2023 2:10 AM

Massively increased urea consumption - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పంట పొలాల్లో యూరియాను గుప్పిస్తున్నారు. ఇలా ఏడాదికేడాదికి యూరియా వినియోగం పెరుగుతోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. దీనివల్ల భూసారంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 10.34 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు పంట పొలాల్లో వాడారని వ్యవసాయశాఖ వెల్లడించింది.

ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. 2021–22 వానాకాలం సీజన్‌లో 9.50 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2022–23 వానాకాలం సీజన్‌లో 9.05 లక్షల ఎకరాల్లో యూరియా వినియోగించగా, ఈసారి ఏకంగా 1.29 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. ఆగస్టు నెలలో 3.42 లక్షల మెట్రిక్‌ టన్నులు, సెపె్టంబర్‌ నెలలో 3.44 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగించారు.  

సాగు తగ్గినా పెరిగిన యూరియా వినియోగం... 
వాస్తవానికి ఈ ఏడాది యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవంగా గత ఏడాది వానాకాలం సీజన్‌ కంటే ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం గతేడాది కంటే ఏకంగా 1.29 లక్షల మెట్రిక్‌ టన్నులు  అదనంగా పెరగడం విశేషం.  

పలుమార్లు విత్తనాలు విత్తడంతో పెరిగిన వినియోగం 
ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు పత్తి వంటి వాటిని వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు. ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది. దీంతో రెండు బస్తాలు వాడాల్సిన చోట మూడు నాలుగు బస్తాల యూరియా చల్లారని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుకమేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది. అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement