సాక్షి, ఖమ్మం: కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఖమ్మం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. ‘రైతు గోస–బీజేపీ భరోసా’ బహిరంగ సభలో మాట్లాడుతూ, కేసీఆర్ సర్కార్‌ను సాగనంపాలని.. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలన్నారు.
‘‘తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోతుంది. కమలం వికసిస్తుంది. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది.. కానీ రాముడి గుడికి వెళ్లదు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. కేసీఆర్ పనైపోయింది. భవిష్యత్ సీఎం బీజేపీ అభ్యర్థే అవుతారు..తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘బీఆర్‌ఎస్ 2జీ పార్టీ, కాంగ్రెస్ 4జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ.. 4జీ, 3జీ, 2జీ కాదు తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. కాంగ్రెస్ 4జీ అంటే నాలుగు తరాల పార్టీ. బీఆర్‌ఎస్ 2జీ అంటే రెండు జనరేషన్ల పార్టీ. ఎంఐఎం 3జీ అంటే మూడు జనరేషన్ల పార్టీ’’ అంటూ అమిత్ షా చురకలు అంటించారు.
‘‘తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది యువకులు ప్రాణత్యాగం చేశారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోంది. బీజేపీ ఎప్పుడూ బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లదు. మజ్లిస్‌తో కలిసి ఉండేవాళ్ల పక్కన మేం కూర్చొం. 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.80 లక్షల కోట్లు ఇచ్చింది’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు: కిషన్‌రెడ్డి
రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ‘రైతు గోస–బీజేపీ భరోసా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ విమోచణ దినోత్సవాలను కేసీఆర్ నిర్వహించడం లేదు. పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. రైతులకు సీడ్ సబ్సిడీ అందడం లేదు’’ అని మండిపడ్డారు.
‘‘రైతుల ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులే. కల్తీ విత్తనాలపై కేసీఆర్ సర్కార్ చర్యలు శూన్యం. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులకు వెన్నుపోటు పొడిచారు. సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. ధరణి పోర్టల్‌తో 20 లక్షల రైతులు ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు సమస్యలన్నీ పరిష్కరిస్తాం. బీజేపీ పూర్తిగా రైతుల పక్షాన నిలబడుతుంది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment