
ప్రయోగాత్మక వ్యవసాయానికి ప్రాధాన్యత
- సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి,హైదరాబాద్: రబీలో ప్రయోగాత్మక వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ, అనుబంధ శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. భూసార పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టాలని, ఎరువుల పరిశ్రమలు కూడా ఈ పరీక్షలకు సహకరించి సూక్ష్మ పోషకాల నిర్ధారణకు తోడ్పడాలని కోరారు.
రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక రంగం అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ఇక్రిశాట్, వ్యవసాయం, అనుబంధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపులో సీఎం మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో ఎలాంటి వ్యవసాయ విధానాలతో ముందుకెళ్లాలో త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.
అన్నీ ఆన్‌లైన్‌లోనే
ప్రభుత్వ నిధులు మంజూరు, చెల్లింపులన్నీ ఇక ఆన్‌లైన్‌లో విధానంలోనే జరగనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్థిక శాఖ ప్రారంభించిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ఇప్పుడు అమల్లోకి వస్తోంది. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ప్రయోగాత్మకంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.