కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సోయాబీన్ విత్తనాలు, రసాయనిక ఎరువుల సరఫరా గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లనుంచి జిల్లాలో సోయాబీన్ సాగు చేస్తున్నారన్నారు. గతేడాది జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ఈ పంట పండించారని పేర్కొన్నారు. సుమారు రూ. 20 కోట్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించామన్నారు.
ఇప్పటివరకు మధ్యప్రదేశ్ నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునేవారమని, ఈసారి అక్కడ భారీ వర్షాలు కురియడంతో సోయాబీన్ పంటకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీంతో వచ్చే ఖరీఫ్‌లో విత్తనాలకు ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులున్నాయన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సోయాబీన్ విత్తనాలను ఉత్పత్తి చేసి ఖరీఫ్‌లో కొరత లేకుండా చూడాలని ఏపీ సీడ్ మేనేజింగ్ డెరైక్టర్ సుధాకర్‌ను కోరారు. విత్తనాలను ఇక్కడే ఉత్పత్తి చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వ్యవసాయాధికారులు ప్రాంతాలవారీగా భూములను అధ్యయనం చేసి, ఎక్కడ ఏ పంట వేస్తే లాభదాయకమో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటలను నిల్వ చేసుకోవడానికి వీలుగా గిడ్డంగులను నిర్మిస్తున్నామన్నారు. రబీలో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ప్రద్యుమ్న వ్యవసాయాధికారులకు సూచించారు. సమావేశంలో ఏపీ సీడ్స్ ఎండీ సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త కేశవ్, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
వ్యవ‘సాయం’ చేయండి
Published Sat, Dec 28 2013 3:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement