Soybean seeds
-
సోయా.. ఏదయా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోయా సబ్సిడీ విత్తనాల సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ వానాకాలం సీజనులో రైతులకు సరఫరా చేయాల్సిన సోయా విత్తనాల్లో కనీసం సగం కూడా జిల్లాలకు చేరలేదు. మరో వారం రోజుల్లో ఖరీఫ్ పనులు ఊపందుకోనున్న నేపథ్యంలో.. ఈసారి పూర్తి స్థాయిలో సోయా సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయలేమని వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. రైతులు తమకు అవసరమైన సోయా విత్తనాలను ప్రైవేటు విత్తన వ్యాపారుల వద్ద కొనుగోలు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి రావాల్సిన ఈ విత్తనాలు లాక్డౌన్ కారణంగా నిలిచిపోయాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. (హార్ట్‌టచింగ్: నేలకు దిగిన న్యాయం!) ఈ వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బఫర్ నిల్వలు 16,500 క్వింటాళ్లు ఉండగా, మిగిలిన 1.28 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు సరఫరా చేసే బాధ్యతలను తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హాకా, ఎన్ఎస్సీ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ సంస్థలకు అప్పగించింది. అయితే 1.45 లక్షల క్వింటాళ్లలో ఇప్పటి వరకు సుమారు 80 వేల క్వింటాళ్లు కూడా జిల్లాలకు చేరలేదు. ఒక్క నిజామాబాద్ జిల్లానే పరిశీలిస్తే 32 వేల క్వింటాళ్లు సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపితే కేవలం 19,820 క్వింటాళ్ల మాత్రమే కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు 9,532 క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సాగు రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సోయా సాగవుతుంది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువగా రైతులు ఈ పంటను వేసుకుంటారు. గత వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 4.28 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన వ్యవసాయ విధానంలో ఈ సోయా సాగు విస్తీర్ణాన్ని మూడు లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. రైతులకు విత్తన భారం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా సోయా విత్తనాలపై సబ్సిడీని ఇస్తోంది. ఒక్కో క్వింటాలుపై రూ.810 ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా, రైతులు రూ.1,183 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పూర్తి ధర చెల్లించి విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు విత్తన వ్యాపారులు ధరలను పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు. (చదవండి: సొంతూళ్లోనే కాయకష్టం) -
సోయా విత్తనోత్పత్తిలో కంపెనీల మోసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో కంపెనీలు, కొందరు అధికారులు నిమగ్నమయ్యారు. నాణ్యమైన విత్తనం అందించాలని ప్రభు త్వం పదేపదే చెబుతున్నా దళారులు, కొందరు అధికారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో సోయా విత్తనాన్ని పండించి, ఉత్పత్తి చేసి ఇవ్వాలని సర్కారు కోరితే, అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలోనే ఉత్పత్తి చేసినట్లు ట్యాగ్లు వేయించుకోవడం ఇప్పుడు తీవ్ర ఆరోపణలకు దారితీసింది. కంపెనీలకు కొందరు అధికారులు వంత పాడడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విత్తన ధ్రువీకరణ సంస్థలోని కొందరు అధికారుల అండ చూసుకునే అనేక కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర విత్తన ఉత్పత్తి, సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజిలెన్స్ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరు గుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్లో పనిచేస్తున్నందున, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నందునే ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. విత్తన ఉత్పత్తికి శ్రీకారం చుట్టినా.. రాష్ట్రంలో ఖరీఫ్‌లో సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.80 లక్షల ఎకరాలు. ఈ పంట ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాగవుతోంది. అయితే సోయాబీన్‌కు అవసరమైన విత్తనాలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. రెండు మూడేళ్ల క్రితం వరకు టెండర్లు పిలిచి కంపెనీలకు విత్తనాల సేకరణ బాధ్యత అప్పగించేవారు. ఆయా కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి విత్తనాలను కొని ఇక్కడ విక్రయిస్తుంటాయి. రాష్ట్రం విత్తన భాండాగారంగా ఉన్నందున సోయాబీన్ విత్తనాన్ని కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, హాకాసహా ప్రైవేటు కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఖరీఫ్ కోసం దాదాపు 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అయితే ప్రైవేటు కంపెనీలు ఇక్కడే పెద్ద మోసానికి తెగబడ్డాయి. తెలంగాణలో వాతావరణం అనుకూలించకపోవడంతో సోయాబీన్ విత్తన పంట సరిగా లేదని ముందుగానే గుర్తించి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కొనుగోలు చేశాయి. వాటన్నింటినీ తెలంగాణలోనే ఉత్పత్తి చేసినట్లుగా రాష్ట్ర విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థను నమ్మించాయి. చివరకు తెలంగాణ ట్యాగ్లు వేయించుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచిత్రమేంటంటే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 10–15 వేల మంది రైతుల ఆధార్‌కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు సేకరించి వారు పండించినట్లుగా ఆధారాలు సృష్టించినట్లు సమాచారం. కానీ మధ్యప్రదేశ్ వంటి చోట నాసిరకపు విత్తనాలు కొని ఈ రైతులు పండించినట్లుగా నమ్మబలికి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ధరలు పెట్టి కొనుగోలు బహిరంగ మార్కెట్లో సోయాబీన్‌కు ధర చాలా తక్కువ ఉన్నప్పటికీ, విత్తనానికి మాత్రం అంతకు రెట్టింపు ధరకు విక్రయించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఈ ఏడాది నిర్ణయించింది. ధర ప్రభావం తెలియకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపేలా సబ్సిడీ శాతాన్ని చూపడం గమనార్హం. సోయాబీన్ వాస్తవ ధర క్వింటాలుకు రూ. 6,150 ఉండగా, ప్రభుత్వం రైతులకు 40.65 శాతం సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. అంటే రూ. 2,500 సబ్సిడీ ఇస్తారు. రైతులు రూ. 3,650 చెల్లించాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుంటే, అందుకు విరుద్ధంగా రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా రైతులపై భారం వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.3,339 ప్రకటించినప్పటికీ, రైతులకు మార్కెట్లో రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్యలోనే ధర అందింది. అదే సందర్భంలో ఇప్పుడు విత్తన కొనుగోలును మాత్రం క్వింటాకు రూ. 5,500 చేసి, రవాణా ఇతరత్రా చార్జీలకు క్వింటాకు రూ.600 చొప్పున కలుపుతూ మొత్తం గా రూ. 6,150కు ధర ఖరారు చేశారు. వాస్తవానికి మార్కెట్లో సోయాబీన్ ధర రూ.3వేల లోపు మాత్రమే ఉంది. అటువంటిది క్వింటాకు రూ. 5,500 పెట్టి విత్తన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రాసెసింగ్‌కు, ప్యాకింగ్, రవాణాకు అన్నింటికి కలిపినా రూ.5,400 వరకు మించదని, అటువంటిది రూ. 6,100 చెల్లించడంలో మతలబు ఏమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఒక క్వింటాకు రూ.500 నుంచి రూ.700 వరకు చేతులు మారుతున్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాయి. -
సర్కారు సోయా విత్తనం డొల్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో పండించిన సోయాబీన్ విత్తనాలు మొలకెత్తవని నిర్ధారణ అయింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పండించిన 15 వేల క్వింటాలల్లో 9 వేల క్వింటాలు, హాకా పండించిన 10 వేల క్వింటాలల్లో 5 వేల క్వింటాలు మొలకెత్తవని నిర్ధారించారు. మరోవైపు ప్రైవేట్ విత్తన కంపెనీలు రాష్ట్రంలో పండించిన సోయా విత్తనం కూడా పూర్తిస్థాయిలో మొలకెత్తే లక్షణం లేదని తెలిసింది. దీంతో విత్తన కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి సోయా విత్తనాన్ని కొనుగోలు చేసి వాటిని ఇక్కడే పండించామని ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించినట్లు సమాచారం. రాష్ట్రంలో సోయాబీన్ విత్తనాన్ని పండించి, ఉత్పత్తి చేసి ఇవ్వాలని సర్కారు కోరితే, ప్రైవేట్ కంపెనీలు ఇలా అక్రమాలకు పాల్పడటం తీవ్ర ఆరోపణలకు దారితీసింది. సోయా విత్తనోత్పత్తికి శ్రీకారం... రాష్ట్రంలో ఖరీఫ్‌లో సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.80 లక్షల ఎకరాలు. ఈ పంట ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాగవుతోంది. అయితే సోయాబీన్‌కు అవసరమైన విత్తనాలు రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పరిస్థితి లేదు. రెండేళ్ల క్రితం వరకు కూడా టెండర్లు పిలిచి కంపెనీలకు విత్తనాల సేకరణ బాధ్యత అప్పగించేవారు. ఆయా కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి విత్తనాలను కొని ఇక్కడికి తీసుకొస్తుంటాయి. సోయాబీన్ విత్తనాన్ని కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్ కోసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. ఆ మేరకు విత్తనాభివృద్ధి సంస్థ, హాకా సహా ప్రైవేట్ కంపెనీలకు విత్తన ఉత్పత్తి బాధ్యత అప్పగించారు. కానీ రాష్ట్రంలో పండించిన విత్తనాల్లో మొలకెత్తే లక్షణం లేనట్లు గుర్తించడంతో ఈసారీ ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్ కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి, వాటిని ఇక్కడే ఉత్పత్తి చేసినట్లు రాష్ట్ర విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థను నమ్మించాయి. చివరకు తెలంగాణ ట్యాగ్లు వేయించుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.2,400 కొని... రూ.5,800కు విక్రయం సోయాబీన్ ధర అత్యంత తక్కువ ఉన్న సమయంలో రూ. 2,400 నుంచి రూ. 3,400 మధ్య ప్రైవేటు కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుత ధర ప్రకారం లెక్కలేసి సోయాబీన్ విత్తన విక్రయ ధరను రూ. 5,800గా ఖరారు చేసింది. దీనికి 37% సబ్సిడీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 2,146 రైతులకు సబ్సిడీ అందనుంది. అంటే రైతులు రూ. 3,654 ధరకు కొనుగోలు చేయాలి. కానీ కంపెనీలు ప్రభుత్వానికి రూ. 5,800 ప్రకారం విత్తనాన్ని విక్రయిస్తున్నాయి. అంటే రెండింతల మేరకు లాభాలు పొందుతున్నాయి. అనుకూలించని వాతావరణం... రాష్ట్రంలో సోయా విత్తనోత్పత్తికి అనుకూల వాతావరణం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడే పండించి రైతులకు విత్తనాలు సరఫరా చేయాలనుకోవడం మంచిదే కానీ సాధ్యం కానప్పుడు ఇతరత్రా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలన్న వాదనలున్నాయి. ఖరీఫ్‌లో వేసే సోయాబీన్ విత్తనానికి రెండు మూడేళ్లుగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో కురిసే వర్షాలు తీవ్ర అడ్డంకిగా మారాయి. -
రైతు నెత్తిన సోయాబీన్ టోపీ
► మార్కెట్లో క్వింటాలు రూ.4 వేల లోపే ► కంపెనీల నుంచి రూ.5,200కు కొనుగోలు సాక్షి, హైదరాబాద్: సోయాబీన్ విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసేందుకు కంపెనీలతో వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. మార్కెట్లో సోయాబీన్ ధర పడిపోయినా అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. సోయాబీన్ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ. 2,775 ఉంది. ఇక విత్తన ధర అటూఇటుగా క్వింటాలు రూ.3,500–రూ.4వేలుంది. కానీ తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్రం 2017–18లో ఖరీఫ్‌లో రైతులకు సరఫరా చేసేందుకు రూ.5,200కు విత్తనాన్ని కొనుగోలు చేసేందు కు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇటీవల టెండర్లు పిలచిన శాఖ దాదాపు 32 కంపెనీల నుంచి విత్తనాల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. ఒక్కో కంపె నీ నుంచి 5వేల క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలి సింది. గతేడాదితో పోలుస్తూ: పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ ను పండించాలని గతేడాది ప్రభుత్వం ప్రచారం చేసిన సంగతి తెలి సిందే. గతేడాది విత్తన ధరను రూ.6,600గా ఖరారు చేసింది. 33 శాతం సబ్సిడీతో రైతులకు రూ.4,400కు ఇచ్చింది. ఈసారి సోయబీన్ ధర మార్కెట్లో పతనమైంది. క్వింటాలుకు రూ.2,100 నుంచి రూ. 2,500 వరకే పలుకుతోంది. అంటే ఎంఎస్పీ కంటే తక్కు వే. దీంతో విత్తన ధర కూడా పడిపోయింది. పైగా ఈసారి రాష్ట్రంలోనూ సోయాబీన్ దిగుబడి బాగానే ఉంది. గతంలోలా మధ్యప్రదేశ్ నుంచే పూర్తిస్థాయిలో సేకరించాల్సిన అవసరమూ విత్తన కంపెనీలకు ఉండదు. అంతేకాదు మధ్యప్రదేశ్‌లో ప్రాసెస్ చేసిన సోయా విత్తన ధర రూ.3,500–రూ.4 వేల వరకే ఉందని అక్కడ వ్యవసాయశాఖ పేర్కొంది. కాబట్టి క్వింటాలుకు రూ. 4 వేలకు మించి ఖర్చు కాదు. అలాంటిది రూ. 5,200కు కంపెనీల నుంచి ఎలా కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది. -
పంటల సాగులో మెలకువలు పాటించాలి
‘ఫోన్‌ఇన్’లో ఏఓ శ్రీనివాస్‌రెడ్డి కల్హేర్: పంట సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని కల్హేర్ మండల వ్యవసాయధికారి కె.శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సూచించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో రైతులతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో అన్నదాతలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పి, సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: సోయాలో కలుపును ఎలా నివారించాలి: మల్దోడ్డి రాములు, కృష్ణపూర్ ఏఓ: 250 మిల్లీలీటర్ల క్విజోనోపాప్ఇతల్, ఫైరిత్రోబాక్ సోడియం మందులను కలిపి లీటర్ నీటిలో 2 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి. ప్రశ్న: మక్కజొన్న శేను ఎర్రగా మారుతుంది. ఏం చేయాలి: వడ్డె కిష్టాయ్య, ఇందిరానగర్ జవాబు: లీటర్ నీటిలో 2 గ్రాముల యూరియా కలిపి పంటపై పిచికారీ చేయండి. ప్రశ్న: సోయా పంటకు ఆకుముడత వస్తోంది: చింతల నారాయణ, మార్డి జవాబు: లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి స్ప్రే చేయాలి. ప్రశ్న: కల్హేర్‌లో యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారు: హన్మంత్‌రావు, కల్హేర్ జవాబు: అధిక ధరకు యూరియా విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: సోయాలో పూత రాలుతోంది. ఏం చేయాలి: రాఘవరెడ్డి, కడ్పల్ జవాబు: లీటర్ నీటిలో 4 ఎంఎల్ ప్లానోఫిక్స్ మందును కలిపి స్ప్రే చేస్తే పూత రాలదు. ప్రశ్న: కడ్పల్లో 2011 నుంచి 2014 వరకు రైతులకు అందజేసిన పంట నష్ట పరిహారం వివరాలివ్వండి: రాంరెడ్డి, కడ్పల్ జవాబు: వారం రోజుల తర్వాత పంట నష్ట పరిహారం చెల్లింపు వివరాలు ఇస్తాం. ప్రశ్న: వరిలో తాటాకు తెగులు నివారణ చర్యలు చెప్పండి: పోతిరెడ్డి, మాసాన్‌పల్లి జవాబు: నాలుగు కిలోల ఫర్టెర గుళికలు, 4 గ్రాముల క్లోరంత్రోనోప్రోనిల్ను కలిపి పొలంలో చల్లుకోవాలి. ప్రశ్న: మార్డిలో రైతులకు అందజేసిన ఇన్పుట్ సబ్సిడీ వివరాలివ్వండి: సంగమేశ్వర్, మార్డి జవాబు: వారం రోజుల తర్వాత ఇస్తాం. ప్రశ్న: జింక్, చౌడ్ నివారణకు చర్యలు చెప్పండి: గోపీనాయక్, మార్డితండా జవాబు: జింక్ లోపం కోసం 2 గ్రాముల స్వర్ణపల్, 2 గ్రాముల అన్నబేరిని స్ప్రే చేయాలి. చౌడ్ నివారణకు ఎకరాకు 200 కిలోలు జిప్సం వేయాలి. ప్రశ్న: సబ్సిడీపై శనగలు కావాలి: మల్లయ్య, రాంరెడ్డిపేట జవాబు: శనగలు వచ్చిన వెంటనే సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తాం. ప్రశ్న: పత్తిలో రసం పీల్చే పురుగును ఎలా నివారించాలి: అంజయ్య, ముబారక్పూర్ జవాబు: 10 లీటర్ల నీటిలో 6 మిల్లీలీటర్ల ఇండక్లోరిఫైడ్ 17.8ఎస్ఎల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 500 గ్రాముల ఎసిపేట్ వేయాలి. ప్రశ్న: వరి పైరులో మొగిపురుగు నివారణ చర్యలు ఎమిటి: లక్ష్మణ్, ఖానాపూర్(కె) జవాబు: నాలుగు కిలోల ఇసుకలో 4 గ్రాముల క్లోరంత్రోనోప్రోనిల్ను కలిపి పొలంలో వేయాలి. సోయాచిక్కుడులో ఆకుపచ్చ పురుగు ప్రశ్న: సోయాచిక్కుడు పంటలో ఆకుపై పచ్చరంగులో ఉన్న పురుగులు కనిపిస్తున్నాయి. ఇవి చెట్టు ఆకులను తింటూ రంధ్రాలు చేస్తున్నాయి. వీటి నివారణకు ఏంచేయాలో చెప్పండి. - భూమయ్య, వెల్మకన్న, సెల్: 9000742690 జవాబు: మీరు సాగు చేసిన పంటకు పచ్చపురుగు సోకింది. దీని ప్రభావంతో మొక్క ఎదుగుదల ఉండదు. దిగుబడి తగ్గిపోతుంది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ పురుగును మొదటి దశలోనే గుర్తించడం వల్ల పూర్తిగా నివారించవచ్చు. 200 లీటర్ల నీటిలో 320 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ కలిపి ఎకరా చేనులో పిచికారీ చేయాలి. - రాజు, ఏఓ కౌడిపల్లి, సెల్: 8886612478 -
ముచ్చటగా మూడోసారి..
రెండుసార్లూ మొలకెత్తని విత్తనాలు ఇటీవలి వర్షాలతో చిగురించిన ఆశలు మళ్లీ విత్తనాలు వేస్తున్న రైతులు ఆదిలాబాద్ అగ్రికల్చర్: ఖరీఫ్ ప్రారంభంలో ఒకసారి.. జూలై మొదటి వారంలో రెండోసారి విత్తనాలు విత్తినా వర్షాలు కురవక అవి మొలకెత్తలేదు. దీంతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జిల్లా రైతులు సన్నద్ధమయ్యారు. వారం క్రితం నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలతో మూడోసారి విత్తనాలు విత్తుతూ ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. చాలామంది రైతులు జూన్‌లో ఓసారి.. జూలై ప్రారంభంలో రెండోసారి పత్తి, సోయాబీన్ విత్తనాలు వేసినా వర్షాలు కురవక అవి మొలకెత్తలేదు. దీంతో పెట్టుబడి మట్టిపాలైందని ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో వారం క్రితం నాలుగు రోజులపాటు వర్షాలు కురవడం.. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. మూడోసారి విత్తనాలు విత్తి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు మూడోసారి విత్తనాలు వేయగా.. ఇంకొందరు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. సకాలంలో వర్షాలు కురిస్తే.. ఈ సమయానికి మొలకలు పెరిగి కలుపు తీసే పనిలో బిజీబిజీగా ఉండేవారమని రైతులు పేర్కొంటున్నారు. కానరాని వరిసాగు.. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు సాగైన వరి విస్తీర్ణం వందల ఎకరాల్లోపే ఉంది. వర్షాలు కురవక.. జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు నిండకపోవడంతో వరి వేసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. జిల్లాలో 11 ప్రాజెక్టులు ఉండగా.. ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు సగం నిండలేదు. సాత్నాల, రెబ్బెన, ఎన్టీఆర్ సాగర్, స్వర్ణ, పీపీరావు, కొమురం భీమ్, గొల్లవాగు, ర్యాలీవాగు తదితర ప్రాజెక్టుల్లో గరిష్ట మట్టానికి నీరు చాలా దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో కాలువల ద్వారా సాగునీరు అందుతుందో.. లేదోనని రైతులు వరి సాగుకు ముందుకు రావడంలేదు. నీటి సౌకర్యం ఉన్నవారే కొద్దో..గొప్పో.. వరి వేస్తున్నారు. సోయాబీన్ వద్దు.. ప్రస్తుత వర్షాలకు సోయాబీన్ విత్తనాలు వేయరాదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో సోయాబీన్ విత్తితే దిగుబడి తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పత్తి, కంది ప్రత్యామ్నాయ పంటలైన నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశెనగ తదితర పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. 70 నుంచి 80 రోజుల వ్యవధిలో దిగుబడి వచ్చే స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. -
వ్యవ‘సాయం’ చేయండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సోయాబీన్ విత్తనాలు, రసాయనిక ఎరువుల సరఫరా గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లనుంచి జిల్లాలో సోయాబీన్ సాగు చేస్తున్నారన్నారు. గతేడాది జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ఈ పంట పండించారని పేర్కొన్నారు. సుమారు రూ. 20 కోట్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించామన్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునేవారమని, ఈసారి అక్కడ భారీ వర్షాలు కురియడంతో సోయాబీన్ పంటకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీంతో వచ్చే ఖరీఫ్‌లో విత్తనాలకు ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులున్నాయన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సోయాబీన్ విత్తనాలను ఉత్పత్తి చేసి ఖరీఫ్‌లో కొరత లేకుండా చూడాలని ఏపీ సీడ్ మేనేజింగ్ డెరైక్టర్ సుధాకర్‌ను కోరారు. విత్తనాలను ఇక్కడే ఉత్పత్తి చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యవసాయాధికారులు ప్రాంతాలవారీగా భూములను అధ్యయనం చేసి, ఎక్కడ ఏ పంట వేస్తే లాభదాయకమో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటలను నిల్వ చేసుకోవడానికి వీలుగా గిడ్డంగులను నిర్మిస్తున్నామన్నారు. రబీలో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ప్రద్యుమ్న వ్యవసాయాధికారులకు సూచించారు. సమావేశంలో ఏపీ సీడ్స్ ఎండీ సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త కేశవ్, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.