రైతు నెత్తిన సోయాబీన్ టోపీ
► మార్కెట్లో క్వింటాలు రూ.4 వేల లోపే
► కంపెనీల నుంచి రూ.5,200కు కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: సోయాబీన్ విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసేందుకు కంపెనీలతో వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. మార్కెట్లో సోయాబీన్ ధర పడిపోయినా అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. సోయాబీన్ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాలుకు రూ. 2,775 ఉంది.
ఇక విత్తన ధర అటూఇటుగా క్వింటాలు రూ.3,500–రూ.4వేలుంది. కానీ తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్రం 2017–18లో ఖరీఫ్‌లో రైతులకు సరఫరా చేసేందుకు రూ.5,200కు విత్తనాన్ని కొనుగోలు చేసేందు కు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇటీవల టెండర్లు పిలచిన శాఖ దాదాపు 32 కంపెనీల నుంచి విత్తనాల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. ఒక్కో కంపె నీ నుంచి 5వేల క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలి సింది.
గతేడాదితో పోలుస్తూ: పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ ను పండించాలని గతేడాది ప్రభుత్వం ప్రచారం చేసిన సంగతి తెలి సిందే. గతేడాది విత్తన ధరను రూ.6,600గా ఖరారు చేసింది. 33 శాతం సబ్సిడీతో రైతులకు రూ.4,400కు ఇచ్చింది. ఈసారి సోయబీన్ ధర మార్కెట్లో పతనమైంది. క్వింటాలుకు రూ.2,100 నుంచి రూ. 2,500 వరకే పలుకుతోంది. అంటే ఎంఎస్‌పీ కంటే తక్కు వే. దీంతో విత్తన ధర కూడా పడిపోయింది. పైగా ఈసారి రాష్ట్రంలోనూ సోయాబీన్ దిగుబడి బాగానే ఉంది.
గతంలోలా మధ్యప్రదేశ్ నుంచే పూర్తిస్థాయిలో సేకరించాల్సిన అవసరమూ విత్తన కంపెనీలకు ఉండదు. అంతేకాదు మధ్యప్రదేశ్‌లో ప్రాసెస్ చేసిన సోయా విత్తన ధర రూ.3,500–రూ.4 వేల వరకే ఉందని అక్కడ వ్యవసాయశాఖ పేర్కొంది. కాబట్టి క్వింటాలుకు రూ. 4 వేలకు మించి ఖర్చు కాదు. అలాంటిది రూ. 5,200కు కంపెనీల నుంచి ఎలా కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది.