మద్దతు ధర కోసం..
♦ కలెక్టరేట్ ఎదుట దొండ రైతుల ధర్నా
♦ దొండకాయలను రోడ్డుపై కుప్పగా పోసి ఆందోళన చేసిన కర్షకులు
♦ దళారుల నుంచి కాపాడాలని డిమాండ్
నల్లగొండ టూటౌన్ :
ఆరుగాలం కష్టపడి పండించిన దొండకాయకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని పీఏపల్లి మండల రైతులు సోమవారం కలెక్టర్ ఎదుట ఆందోళన చేశారు. బస్తాలలో దొండకాయలు తెచ్చి కలెక్టరేట్ గేటు ఎదుట, ప్రధాన రహదారిపై కుప్పలుగా పోసి దర్నా చేశారు. ఈ సందర్భంగా పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లు నాగార్జున్‌రెడ్డి మాట్లాడుతూ దొండ రైతులను దళారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు.
పండించిన పంటకు ధర లేక కూళ్లు కూడా వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు మద్దతు ధర రూ.1200 ఇప్పించాలని, అర్హులైన రైతులకు సబ్సిడీ డబ్బులను వెంటనే ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. దళారులు సిండికేటై క్వింటా దొండ ధర రూ. 100లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. రోడ్డుపై దొండకాయలు పోసి వాటిపై పడుతున్న రైతులకు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. కొంతమంది రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పండ్లతోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్‌రెడ్డి నాగిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, గజ్జల లింగయ్య, వి. రవీందర్‌రెడ్డి, బి. బాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
దొండకాయల కోసం ఎగబడిన ప్రజలు..
రైతులు దొండకాయలను కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పోసి ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడే సమీపంలో ఉన్న హోటల్ వ్యాపారులు, కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు దొండకాయల కోసం ఎగబడడం గమనార్హం. ఓ వైపు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే.., వారికి మద్దతుగా నిలవకుండా అక్కడ ఉన్న దొండకాయలను తీసుకెళ్లడంపై పలువురు రైతులు విస్మయం వ్యక్తం చేశారు.