ముచ్చటగా మూడోసారి.. | The start of kharif season in july | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి..

Published Sun, Jul 27 2014 12:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

The start of kharif season in july

  •  రెండుసార్లూ మొలకెత్తని విత్తనాలు
  •  ఇటీవలి వర్షాలతో చిగురించిన ఆశలు
  •  మళ్లీ విత్తనాలు వేస్తున్న రైతులు
  • ఆదిలాబాద్ అగ్రికల్చర్: ఖరీఫ్ ప్రారంభంలో ఒకసారి.. జూలై మొదటి వారంలో రెండోసారి విత్తనాలు విత్తినా వర్షాలు కురవక అవి మొలకెత్తలేదు. దీంతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జిల్లా రైతులు సన్నద్ధమయ్యారు. వారం క్రితం నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలతో మూడోసారి విత్తనాలు విత్తుతూ ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నారు.

    ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. చాలామంది రైతులు జూన్‌లో ఓసారి.. జూలై ప్రారంభంలో రెండోసారి పత్తి, సోయాబీన్ విత్తనాలు వేసినా వర్షాలు కురవక అవి మొలకెత్తలేదు. దీంతో పెట్టుబడి మట్టిపాలైందని ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో వారం క్రితం నాలుగు రోజులపాటు వర్షాలు కురవడం.. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. మూడోసారి విత్తనాలు విత్తి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు మూడోసారి విత్తనాలు వేయగా.. ఇంకొందరు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. సకాలంలో వర్షాలు కురిస్తే.. ఈ సమయానికి మొలకలు పెరిగి కలుపు తీసే పనిలో బిజీబిజీగా ఉండేవారమని రైతులు పేర్కొంటున్నారు.
     
    కానరాని వరిసాగు..
    జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు సాగైన వరి విస్తీర్ణం వందల ఎకరాల్లోపే ఉంది. వర్షాలు కురవక.. జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు నిండకపోవడంతో వరి వేసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. జిల్లాలో 11 ప్రాజెక్టులు ఉండగా.. ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు సగం నిండలేదు. సాత్నాల, రెబ్బెన, ఎన్టీఆర్ సాగర్, స్వర్ణ, పీపీరావు, కొమురం భీమ్, గొల్లవాగు, ర్యాలీవాగు తదితర ప్రాజెక్టుల్లో గరిష్ట మట్టానికి నీరు చాలా దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో కాలువల ద్వారా సాగునీరు అందుతుందో.. లేదోనని రైతులు వరి సాగుకు ముందుకు రావడంలేదు. నీటి సౌకర్యం ఉన్నవారే కొద్దో..గొప్పో.. వరి వేస్తున్నారు.  
     
    సోయాబీన్ వద్దు..
    ప్రస్తుత వర్షాలకు సోయాబీన్ విత్తనాలు వేయరాదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో సోయాబీన్ విత్తితే దిగుబడి తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పత్తి, కంది ప్రత్యామ్నాయ పంటలైన నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశెనగ తదితర పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. 70 నుంచి 80 రోజుల వ్యవధిలో దిగుబడి వచ్చే స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement