సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో పండించిన సోయాబీన్ విత్తనాలు మొలకెత్తవని నిర్ధారణ అయింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పండించిన 15 వేల క్వింటాలల్లో 9 వేల క్వింటాలు, హాకా పండించిన 10 వేల క్వింటాలల్లో 5 వేల క్వింటాలు మొలకెత్తవని నిర్ధారించారు.
మరోవైపు ప్రైవేట్ విత్తన కంపెనీలు రాష్ట్రంలో పండించిన సోయా విత్తనం కూడా పూర్తిస్థాయిలో మొలకెత్తే లక్షణం లేదని తెలిసింది. దీంతో విత్తన కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి సోయా విత్తనాన్ని కొనుగోలు చేసి వాటిని ఇక్కడే పండించామని ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించినట్లు సమాచారం. రాష్ట్రంలో సోయాబీన్ విత్తనాన్ని పండించి, ఉత్పత్తి చేసి ఇవ్వాలని సర్కారు కోరితే, ప్రైవేట్ కంపెనీలు ఇలా అక్రమాలకు పాల్పడటం తీవ్ర ఆరోపణలకు దారితీసింది.
సోయా విత్తనోత్పత్తికి శ్రీకారం...
రాష్ట్రంలో ఖరీఫ్‌లో సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.80 లక్షల ఎకరాలు. ఈ పంట ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాగవుతోంది. అయితే సోయాబీన్‌కు అవసరమైన విత్తనాలు రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పరిస్థితి లేదు. రెండేళ్ల క్రితం వరకు కూడా టెండర్లు పిలిచి కంపెనీలకు విత్తనాల సేకరణ బాధ్యత అప్పగించేవారు.
ఆయా కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి విత్తనాలను కొని ఇక్కడికి తీసుకొస్తుంటాయి. సోయాబీన్ విత్తనాన్ని కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్ కోసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. ఆ మేరకు విత్తనాభివృద్ధి సంస్థ, హాకా సహా ప్రైవేట్ కంపెనీలకు విత్తన ఉత్పత్తి బాధ్యత అప్పగించారు.
కానీ రాష్ట్రంలో పండించిన విత్తనాల్లో మొలకెత్తే లక్షణం లేనట్లు గుర్తించడంతో ఈసారీ ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్ కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి, వాటిని ఇక్కడే ఉత్పత్తి చేసినట్లు రాష్ట్ర విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థను నమ్మించాయి. చివరకు తెలంగాణ ట్యాగ్‌లు వేయించుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.2,400 కొని... రూ.5,800కు విక్రయం
సోయాబీన్ ధర అత్యంత తక్కువ ఉన్న సమయంలో రూ. 2,400 నుంచి రూ. 3,400 మధ్య ప్రైవేటు కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుత ధర ప్రకారం లెక్కలేసి సోయాబీన్ విత్తన విక్రయ ధరను రూ. 5,800గా ఖరారు చేసింది. దీనికి 37% సబ్సిడీ ప్రకటించింది.
ఆ ప్రకారం రూ. 2,146 రైతులకు సబ్సిడీ అందనుంది. అంటే రైతులు రూ. 3,654 ధరకు కొనుగోలు చేయాలి. కానీ కంపెనీలు ప్రభుత్వానికి రూ. 5,800 ప్రకారం విత్తనాన్ని విక్రయిస్తున్నాయి. అంటే రెండింతల మేరకు లాభాలు పొందుతున్నాయి.
అనుకూలించని వాతావరణం...
రాష్ట్రంలో సోయా విత్తనోత్పత్తికి అనుకూల వాతావరణం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడే పండించి రైతులకు విత్తనాలు సరఫరా చేయాలనుకోవడం మంచిదే కానీ సాధ్యం కానప్పుడు ఇతరత్రా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలన్న వాదనలున్నాయి. ఖరీఫ్‌లో వేసే సోయాబీన్ విత్తనానికి రెండు మూడేళ్లుగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో కురిసే వర్షాలు తీవ్ర అడ్డంకిగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment