సమావేశంలో మాట్లాడుతున్న ఏడీ రమేష్
–డీలర్లను ఆదేశించిన ఏడీ రమేష్
–నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
చిత్తూరు(రూరల్) : నిర్ణీత ధరకే ఎరువులు విక్రయించాలని దుకాణదారులను ఏడీ రమేష్ ఆదేశించారు. స్థానిక మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ఆయన ఎరువుల దుకాణ డీలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీని దృష్ట్యా ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించిందని పేర్కొన్నారు. అయినా డీలర్లు పాతధరలకే ఎరువులను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసిన కొత్త ధరలకే విక్రయించాలని, పాత ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఎరువుల దుకాణంలోను ఫ్లెక్సీ బోర్డుపై ఎరువుల ధరలు తెలియజేయాలని, రైతులకు ఇచ్చే ప్రతి బిల్లుపై వారి సంతకం, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.