గోదావరిఖని : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో మరో ముందడుగు పడింది. 1999లో మూసివేసిన ఈ కర్మాగారాన్ని గ్యాస్ ఆధారంగా పునరుద్ధరించే క్రమంలో ఇందుకు సంబంధించి బుధవారం కీలక ఘట్టం ముగిసింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) సంస్థలతో భాగస్వామ్య (జాయింట్ వెంచర్) సంస్థ ఏర్పాటైంది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల ఎఫ్‌సీఐఎల్ కార్యాలయంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేందర్‌ప్రధాన్‌తో పాటు ఆయా సంస్థల ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై జాయింట్ వెంచర్‌పై చర్చించి సంస్థను ఏర్పాటు చేస్తూ ఆయా కంపెనీల అధికారులు సంతకాలు చేశారు. దీనికి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌గా నామకరణం చేశారు.
ఈ ప్లాంట్‌కు కాకినాడ తీరంలోని మల్లవరం నుంచి గుజరాత్‌లోని బిల్వారాకు పైప్‌లైన్ ద్వారా తీసుకెళ్లే గ్యాస్‌ను సమీపంలోని పాయింట్ నుంచి సరఫరా చేయనున్నారు. 2018 నాటికి ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా కర్మాగారం పనులు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అంగీకరించారు.
రూ.5వేల కోట్ల పెట్టుబడి
రూ.5వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 70 శాతం రుణంగా తీసుకోనున్నారు. మిగతా 30 శాతం ఈక్విటీని ప్రకటించనుండగా, ఎన్‌ఎఫ్‌ఎల్ 26 శాతం, ఈఐఎల్ 26 శాతం, ఎఫ్‌సీఐఎల్ 11 శాతం, మరో 37 శాతం షేర్‌హోల్డర్ల నుంచి సేకరించనున్నారు.
ఈ రోజుకు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్లాంట్‌ను నిర్మించనున్నారు. పర్యావరణ అనుమతి రాగానే ప్రాథమికంగా పనులు చేపట్టనున్నారు. సంక్రాంతి పండుగ కానుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు జాయింట్ వెంచర్‌ను ప్రారంభించినట్టైంది.
ఎన్డీఏ హయాంలోనే మూసివేత.. పునరుద్ధరణ
బొగ్గు ఆధారంగా రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణ పనులు 1970 అక్టోబర్ 2న ప్రారంభం కాగా.. 1980 నవంబర్ ఒకటిన యూరియాను ఉత్పత్తి చేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, నాణ్యతలేని బొగ్గు సరఫరా, నూతన టెక్నాలజీలో ఏర్పడిన లోపాలు, కేంద్రం సకాలంలో ఆర్థిక వనరులను సమకూర్చకపోవడం, ఉన్నతస్థాయి కమిటీలు చేసిన సిఫారసులను అమలు చేయకపోవడం, తదితర కారణాలు ఎరువుల కర్మాగారానికి నష్టాలను తెచ్చిపెట్టాయి.
దీంతో 1999 మార్చి 31న అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఎరువుల కర్మాగారాన్ని మూసివేసింది. అప్పటికి 16.89 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసింది. ఆనాటి నుంచి ఎరువుల కార్మాగారాన్ని తెరిపించాలని అనేక పార్టీలు, సంఘాలు చేసిన ఆందోళనల ఫలితంగా నూతన ప్లాంట్‌ను నిర్మించేందుకు కేంద్రం సమ్మతించింది. బీఐఎఫ్‌ఆర్ నుంచి విముక్తి కల్పించడంతో పాటు రూ.10,400 కోట్ల రుణాన్ని కేంద్రం మాఫీ చేసింది.
నెలాఖరులోగా ప్రజాభిప్రాయసేకరణ
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు మూడు కంపెనీలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు కాగా... జనవరి నెలాఖరులోగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. స్థానికులతో చర్చించి వారి అభిప్రాయాన్ని సేకరించి ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
కర్మాగారం పునరుద్ధరణ కోసం మాజీ ఎంపీ జి.వివేక్ శాయశక్తులా కృషి చేయగా, ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ పలుమార్లు లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, అధికారుల సంఘం, కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రతినిధులు ఎం.సుందర్‌రాజు, కంది శ్రీనివాస్ తదితరులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి ఎఫ్‌సీఐ పునరుద్ధరణ కోసం వినతిపత్రాలు అందజేశారు.
మరో ముందడుగు
Published Thu, Jan 15 2015 3:22 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement
Advertisement