
కల్తీ చేస్తే.. కటకటాలే!
విత్తనాలు, ఎరువుల్లో కల్తీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం
► అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
► కఠిన చట్టం తెచ్చి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తాం
► ఆహార పదార్థాలు కల్తీ చేసేవారిపైనా కఠిన చర్యలు
► పండించిన కూరగాయలు, పండ్లను రైతులే అమ్మాలి
► ఈ నెల 10 నుంచి ఏఈవోలు గ్రామాల్లో పర్యటించాలి
సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందాలని, నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నకిలీ, కల్తీకి పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపేలా కఠిన చట్టం రూపొందించాలని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపైనా ఉక్కుపాదం మోపేలా విధానం రూపొందించాలని ఆదేశించారు. కూరగాయలు, పండ్లు మన రైతులే పండించి అమ్మేలా తగిన సహకారం అందించాలని సూచించారు. పండించిన పంటను కూడా రైతులతోనే ఆహార పదార్థంగా ప్రాసెసింగ్ చేయించాలని పేర్కొన్నారు.
రైతులకు పెట్టుబడి వ్యయాన్ని అందించే విధానంతోపాటు ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ ప్రక్రియలో రైతుకు వెన్నుదన్నుగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందించాలని కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి అనంత్ కుమార్‌ను కోరారు. ఈ భేటీలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, పార్థసారథి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎరువులు ఇప్పుడే నిల్వ చేయండి
వర్షాకాలానికి అవసరమయ్యే ఎరువులన్నీ వేసవిలోనే సేకరించి నిల్వ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో 16 లక్షల టన్నుల ఎరువులు అవసరమని, ఇప్పటికే 8 లక్షల టన్నులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. కొంత ఎరువు స్థానికంగానే లభ్యమవుతుందన్నారు. 2 లక్షల టన్నుల యూరియా, 50 వేల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల ఎన్‌పీకే సేకరించి పెట్టుకుంటే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
ఇందుకు స్పందించిన సీఎం వెంటనే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్‌కు ఫోన్ చేసి ఎరువులుS సరఫరా చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. మంగళవారం వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు అందించనున్నారు. ‘‘రాష్ట్రంలో కేవలం వరి ధాన్యం విషయంలో మాత్రమే స్వయం సమృద్ధి సాధించాం. ఇతర ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ అవసరాలు ఏమిటి? కూరగాయలు ఎన్ని కావాలి? పండ్లు ఎన్ని కావాలి? ఏది ఎంత కావాలో నిర్ధారించి అంత మేరకు ఉత్పత్తి చేసుకోవాలి. దీని ద్వారా ప్రజల అవసరాలు తీరుతాయి.
మన అవసరాలు పోను మిగతా సరుకును ఎగుమతి చేస్తే రైతులు బాగుపడతారు. ఇందుకు అధికారులు ఏ పంట వేయాలనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు అందించాలి. ఏ పంటకు డిమాండ్ ఉందో గుర్తించి మార్కెట్ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి చేయాలి’’ అని సీఎం చెప్పారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని, వారికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. గ్రామంలో రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. మిర్చి వేసిన రైతులే కారం పట్టి అమ్మేలా, పసుపు కొమ్ములను పసుపుగా మార్చేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ శాఖ కూడా స్వరూపం మార్చుకోవాలని, అసవరమైన సిబ్బందిని నియమించుకోవాలని, ఏ ఉద్యోగి ఏ పని చేయాలనే విషయంలో జాబ్ చార్ట్ రూపొందించాలని ఆదేశించారు.
భూముల లెక్కలు తీయండి
వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు గ్రామాల్లో పర్యటించి, భూముల వివరాలు సేకరించా లని సీఎం ఆదేశించారు. ‘‘ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది? అందులో ఏ పంట సాగుచేస్తున్నారు? నీటి వసతి ఉందా? వానా కాలంలో ఏం పండిస్తారు? యాసం గిలో ఏం పండిస్తారు? సూక్ష్మ సేద్యం చేస్తు న్నారా? యంత్రాలు వాడుతున్నారా? భూ సార పరీక్ష చేయించారా? చేయిస్తే ఎలాంటి రకం నేల అని తేలింది? తదితర వివరాలన్నీ సేకరించాలి.
ఇలా సేకరించిన వివరాల ఆధారంగానే రైతుకు పెట్టుబడి అందించ డంతో పాటు భవిష్యత్తులో రైతుకు సంబం ధించిన ఇతర కార్యక్రమాలు అమలు చే స్తాం. కాబట్టి వివరాలు కచ్చితంగా ఉండాలి. వాస్తవాలే ఉండాలి. తప్పుడు వివరాలు సేక రించినా.. తప్పుడు సమాచా రం అందిం చినా ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తుంది. వ్యవసాయాధికా రులు ప్రతీ రైతు దగ్గరికి వస్తారు. రైతులు పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలి’’ అని పేర్కొన్నారు.