
కల్తీగాళ్లపై ఉక్కుపాదం మోపండి..
పోలీసు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
కల్తీ ఆహార పదార్థాలు, విత్తనాలతో భారీ నష్టం..
∙కల్తీకి పాల్పడే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి
∙పీడీ యాక్ట్ ప్రయోగించండి.. అవసరమైతే కొత్త చట్టం తీసుకొద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని, కల్తీలకు పాల్పడే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని పోలీసులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కల్తీలు లేకుండా చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆహార పదార్థాల కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, కల్తీ విత్తనాల వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం నుంచి ఈ దుర్మార్గాన్ని తరిమికొట్టాలని, ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలు, విత్తనాల నియంత్రణకు అవలంబించాల్సిన వ్యూహంపై ఆదివారం ప్రగతి భవన్‌లో పోలీసు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, హైదరాబాద్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సెక్యూరిటీ ఐజీ ఎంకే సింగ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
నియంత్రణ ఉండాలి..
గుడుంబా, పేకాట వల్ల అనర్థాలు కలుగుతున్నాయని భావించి వాటిని రాష్ట్రంలో అనుమతించవద్దని గట్టిగా నిర్ణయించుకున్నామని సీఎం పేర్కొన్నారు. పోలీసు అధికారుల కృషితో గుడుంబా, పేకాట నియంత్రించగలిగామని, అలాగే ఇప్పుడు కల్తీలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. కల్తీ నియంత్రణను పోలీసు శాఖ ఒక సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. డీజీపీ నుంచి ఎస్‌ఐ వరకు త్రికరణ శుద్ధితో కల్తీపై యుద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టి వ్యవసాయ, ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. దాడులు జరిపి, దోషులను గుర్తించాలని, ఈ విషయంలో అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
కల్తీలను గుర్తించడానికి అధిక సంఖ్య లో డీఎన్‌ఏ కిట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆహార పదార్థాలు, ఎరువులు, విత్తనాలను ఈ కిట్ల ద్వారా ఎక్కడికక్కడ పరీక్షించవచ్చని, క్షేత్రస్థాయిలో ఇవి అందుబాటులో ఉండటం వల్ల కల్తీని గుర్తించడం, నియంత్రించడం తేలికవుతుందని అభిప్రాయపడ్డారు. కల్తీలకు పాల్పడే వారిపై చీటింగ్, కాపీ రైటింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేయాలని, పీడీ యాక్టు కూడా పెట్టే వెసులుబాటు కల్పించామని తెలిపారు. కల్తీలకు పాల్పడే వ్యక్తులను పట్టుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. అలాంటి వారికి ఇన్సెంటివ్‌లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డీజీపీకి సూచించారు. వంద శాతం కల్తీని అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఒకటీ రెండు రోజుల్లో పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
పోలీస్ సేవలు భేష్
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారని సీఎం కితాబిచ్చారు. షీ టీమ్స్‌కు ఎంతో పేరొచ్చిందని, తాము భద్రంగా, సురక్షితంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని, సమైక్య పాలనలో పోలీసు శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా గాలికొదిలేశారని, పోలీసు కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోలేదన్నారు.
కానీ స్వరాష్ట్రంలో ప్రభుత్వం శాంతిభద్రతల పర్యవేక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. పోలీసులు హరితహారం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయయంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. పోలీసులు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. పోలీసు ఉన్నతాధికారుల దగ్గర కూడా అత్యవసర పనుల కోసం ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు అందుబాటులో పెడుతున్నామని తెలిపారు.
ఏడేండ్లకు ప్రణాళిక రూపొందించండి
పోలీసు వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక రచించుకోవాలని, ఏడేండ్ల కోసం కార్యాచరణ రూపొందించాలని డీజీపీని ఆదేశించారు. వివిధ జోన్లు, రేంజ్‌లలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏడేళ్ల తర్వాత ఎలా ఉండాలి, అనే విషయాల్లో స్పష్టత రావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, అత్యాచారం వంటి కేసుల్లోనూ బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాల్సి ఉందని, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాప్యం జరగొద్దని సూచించారు. పోలీసు శాఖ నుంచి ప్రతిపాదనలు రాగానే కలెక్టర్లు డబ్బులు వెంటనే విడుదల చేసి బాధితులకు తక్షణం సాయం అందడం వల్ల కొంత ఉపశమనం పొందుతారని సూచించారు.