అదో ‘శాపం’
పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి
ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలి
రైతు రుణాలను మాఫీ చేసి,కొత్త రుణాలు ఇవ్వాలి
విత్తనాల సరఫరాలో జాప్యం వీడి రైతులను ఆదుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి
సీఎం, మంత్రులను కలిసిన ఖమ్మం ఎంపీ
ఖమ్మం గాంధీచౌక్: పోలవరంపై కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దుచేసి తెలంగాణలోనే కొనసాగించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. పొంగులేటి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి రైతు రుణాలను వీలైనంత త్వరగా మాఫీ చేసి కొత్తరుణాలను మంజూరు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటి వరకు అందాల్సిన విత్తనాలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారని వివరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సాగర్ జలాలను విడుదల చేసి చెరువులను నింపాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించాలన్నారు. కళాశాల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేయాలన్నారు.
పోలవరానికి వ్యతిరేకంగా పోరాడుతాం..
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వెలువడిన పోలవరం ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దుచేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాల విలీనానికి వ్యతిరేకంగా అ టు పార్లమెంట్‌లోనూ, ఇటు జిల్లావాసిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. అమాయక గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చరేయాలని కోరారు. బియాస్ మృతుల వెతుకులాటలో జాప్యంపై పొంగులేటి మండిపడ్డారు. విద్యార్థులు గల్లంతై వారం దాటినా మృతదేహాలను వెలికి తీయకుండా వారి తల్లిదండ్రులను తీరని వేదనకు గురిచేస్తున్నారని వాపోయారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేవారు. జిల్లాకు చెందిన బియాస్ మృతులు కిరణ్, ఉపేందర్‌ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన జిల్లావాసి సాధనపల్లి ఆనంద్‌కుమార్, నిజామాబాద్‌కు చెందిన పూర్ణలను అభినందించారు. ఇటువంటి సాహసికులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. జిల్లాకు చెందిన ఆనంద్‌కు తాను అండగా ఉంటానని పొంగులేటి పేర్కొన్నారు. త్వరలోనే ఈ విద్యార్థులను కలవనున్నట్లు ఆయన ప్రకటించారు.