కేసీఆర్‌ x భట్టి | CM KCR Vs Bhatti Vikramarka In Assembly | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ x భట్టి

Published Tue, Feb 26 2019 4:01 AM | Last Updated on Tue, Feb 26 2019 10:30 AM

CM KCR Vs Bhatti Vikramarka In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సోమవారం అసెంబ్లీలో ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని శబరి నది విషయంలో.. వీరిద్దరి మధ్య సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో ఇందిర స్రవంతి, రాజీవ్‌ స్రవంతి అంటూ సమైక్య సీఎంలు కుట్రలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ – నాగార్జునసాగర్‌కు నీటి మళ్లింపు కోసం తెలంగాణ వారిని మైమరిపించేందుకు ఈ ప్రాజెక్టులు తెచ్చారన్నారు. నాడు కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నా.. మహారాష్ట్రతో నీటి ఒప్పందం చేసుకోలేకపోయారన్నారు. దీంతో.. అంబేడ్కర్‌ సుజల స్రవంతి కాస్తా కాగితం స్రవంతిగా మారిపోయిందన్నారు. ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెంలో కొట్టుకుపోయిందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి తవ్వకుండా ఎక్కడో చేవెళ్ల దగ్గర కాలువ తవ్వడం కాంగ్రెస్‌ వాళ్ల తెలివి అని కేసీఆర్‌ విమర్శించారు.

తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో, బయటా టీఆర్‌ఎస్‌ పోరాడిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీ–డిజైన్‌పై అసెంబ్లీలో ప్రజెంటేషన్‌ ఇస్తే దానికి కాంగ్రెస్‌ సభ్యులు ఎందుకు హాజరుకాలేదని సీఎం ప్రశ్నించారు. గోదావరి నుంచి 160 టీఎంసీలే కాదు 400 టీఎంసీలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. 15–20 రోజుల్లోనే మేడిగడ్డ పనులు చేపడతామన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ అన్యాయంగా కేసులు వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 200 కేసులు వేశారని, వారిలో కాంగ్రెస్‌ ఆఫీస్‌బేరర్లు ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక కంటితుడుపుగానే మిగిలిందన్నారు. సీతారామప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు, నాగార్జునసాగర్‌ ఆయకట్టు పటిష్టం చేయడం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

ఈ వర్షాకాలం జూన్, జూలైలలో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలిచ్చి.. మధిరతో పాటు వివిధ నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామన్నారు. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ కాకపోయినా తెలియని విషయాలు తెలుసుకున్నానని నీటిపారుదలరంగంపై పట్టుసాధించానని, ఈ విషయంలో కాంగ్రెస్‌ నాయకులు బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దని సీఎం హితవుపలికారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లను పునర్వ్యవస్థీకరిస్తామని, గ్యాప్‌ ఆయకట్టును పూర్తిచేయడం తమ కమిట్‌మెంట్‌ అని కేసీఆర్‌ స్పష్టంచేశారు. అంబేడ్కర్‌ సుజల స్రవంతి ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని, ఈమేరకు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు.

పునర్విభజన చట్టం ప్రకారం..
పోలవరం ప్రాజెక్టు వస్తే, రాకపోతే అనే రెండుపద్ధతుల్లో ఆలోచించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా రుద్రమకోట దగ్గర శబరి నదిలో ఏడాదంతా అందుబాటులో ఉండే 4.5 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నారు. గోదావరిలో ఆ పాయింట్‌ను తెలంగాణ కోల్పోవద్దని పునర్విభజన చట్టంలోనూ ఉన్న ఈ హక్కును చేజారుకోవద్దన్నారు. దుమ్ముగూడెం, సీతారామప్రాజెక్టుల ద్వారా 2.5లక్షల నుంచి 8లక్షల ఎకరాల దాకా నీరు ఇవ్వొచ్చునన్నారు.

రాజీవ్‌సాగర్‌కు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తే పూర్తి అవుతుందని దాని ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కోర్టులో కేసు వేసిన సత్యనారాయణ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, ఆయన భార్య చేవెళ్ల జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని భట్టి పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇచ్చినపుడు, తమ వాదన వినిపించేందుకు తమకు ప్రజెంటేషన్‌ అవకాశమివ్వాలని సీఎల్‌పీ తరఫున లేఖ ఇచ్చినా స్పీకర్‌ నుంచి స్పందన లేకపోవడం వల్లే తాము హాజరుకాలేదని భట్టి స్పష్టం చేశారు.

ఎక్కడీ శబరి?
ఈ సందర్భంగా కేసీఆర్‌ జోక్యం చేసుకుంటూ భట్టి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వద్దని.. కమిటీ హాల్లో ప్రజెంటేషన్‌ పెట్టాలని వితండవాదం చేసింది కాంగ్రెస్‌ వాళ్లేనన్నారు. రుద్రమకోట, శబరి నది ఎక్కడ? ఈ విషయంలోనూ సభను తప్పుదోవ పట్టిస్తారా అని విమర్శించారు. శబరినది గోదావరిలో కలిసే స్థానం ఏపీలో ఉందని.. భౌగోళిక వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారని సీఎం ప్రశ్నించారు. పాపికొండల దగ్గర శబరి కలుస్తుందన్నారు. మరోసారి ధ్రువీకరించుకోవాలని భట్టికి సూచించారు. ఖమ్మం జిల్లాకు రెండేళ్లలో నీళ్లిచ్చి భట్టిని వెంట తీసుకెళతామన్నారు.

ఖమ్మంకు వచ్చి చూడండి!
సీఎం ఖమ్మం జిల్లాకు వచ్చి గతంలోని ప్రాజెక్టుల పాయింట్లను చూడాలన్నారు. రుద్రంపేట, శబరి దగ్గర చెబుతున్న ప్రాంతాలు మునిగిపోతాయని, పోలవరం పూర్తయితే అది 30 మీటర్ల అడుగుకు పోతుందన్నారు. ఆ ప్రాంతం ప్రాజెక్టుల నిర్వహణకు ఏమాత్రం ప్రయోజనకరం కాదన్నారు. అయితే.. భట్టి కంటే తానే ఆ ప్రాంతంలో ఎక్కువ పర్యటించానని సీఎం చెప్పారు. కాంగ్రెస్‌ వారి కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుని రక్షణశాఖను బతిమిలాడి లైడర్‌ సర్వే చేయించానన్నారు. గోదావరికి సంబంధించి అక్షాంశాలు, రేఖాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు సీఎం తెలిపారు.

పోలవరం ముంపుప్రాంతాలే కాకుండా తీసుకున్న ఇతర ప్రాంతాల గురించి గతంలో సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. కాంగ్రెస్‌తో దోస్తీ కట్టాక భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో పదిలక్షల ఎకరాలకు (సాగర్‌ ప్రాంతంతో సహా) నీళ్లు అందించాక.. భట్టి వెంట రాకపోయినా లాక్కెళ్తానని సీఎం చమత్కరించారు. తాను పిలిస్తే వస్తానని, బలవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరంలేదని భట్టి కూడా అదే రీతిలో స్పందించారు. మరోసారి రుద్రమకోట గురించి పరిశీలించాలని సీఎంకు సూచించారు. అయితే.. ఈ అంశంపై తాను చెప్పేదేమీ లేదంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొనడంతో వీరిద్దరి మధ్య సంవాదం ముగిసింది.

కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలే: భట్టి
శాసనసభలో చర్చ సందర్భంగా కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని, కేసీఆర్‌ అబద్ధాలను నిర్భయంగా చెబుతారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. శబరి నది గురించి కేసీఆర్‌ సభలో చెప్పింది అబద్ధమని నిరూపిస్తానన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మీడియాను శబరి నది వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కూడా తీసుకెళ్లి శబరి నది ఎక్కడ ఉందో చూపిస్తానన్నారు. పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూనే శబరి నీటిని వాడుకునే వీలుందని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement