సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చివరి రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరులో ఎటువంటి మార్పులేదు. సభ మొదలైన మరుక్షణం నుంచే కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమైన వెంటనే పథకం ప్రకారం గొడవ చేసి వెళ్లిపోయారు. కేవలం సభలో 15 నిమిషాలు మాత్రమే టీడీపీ సభ్యులు సభలో ఉన్నారు.
సంప్రదాయం ప్రకారం బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై గురువారం సభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా సభ ప్రారంభమైన వెంటనే జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధంపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లారు.
ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, అశోక్, రామకృష్ణలు స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, చినరాజప్ప తదితరులు స్పీకర్ పోడియం ముందు నిలుచుని, పోడియాన్ని తడుతూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళన మధ్యే సభా కార్యకలాపాలను కొనసాగిస్తూ స్పీకర్ మాట్లాడుతుండగా... ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ స్పీకర్ మైక్‌లో వినిపించేలా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాష్ట్రంలో గంజాయి సాగు, వాడకం మితిమీరిపోయిందంటూ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పుబట్టారు. సభలో జరుగుతున్న బిజినెస్‌కు విరుద్ధంగా వాయిదా తీర్మానాలకు డిమాండ్ చేసి ఆందోళనకు దిగడమేమిటని ప్రశి్నంచారు.
రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకసారి పోలీస్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులు రాలేదు.
రెండు బిల్లులకు ఆమోదం
ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2024, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు–2024ను శాసనసభ ఆమోదించింది. విద్యుత్ సుంకం బిల్లును ఆ ర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment