AP: ఫిరాయింపులపై ఇక స్పీకర్‌దే నిర్ణయం! | Sakshi
Sakshi News home page

‘అనర్హత’పై ఉత్కంఠ: విచారణకు రాలేమని రిప్లై.. ఇక స్పీకర్‌దే నిర్ణయం!

Published Mon, Feb 19 2024 9:28 AM

AP Assembly Notices: Defected MLAs MLCs Hearing Updates - Sakshi

ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్

  • విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • 4 గంటల వరకు సమయం ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
  • మరికొంత సమయం కావాలంటూ స్పీకర్‌కు లెటర్ రాసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు సిద్దమైన స్పీకర్
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం 
  • అనర్హత పిటిషన్‌లపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం
     

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్‌ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు ‘తుది’ నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాము విచారణకు హాజరు కాలేమని వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు బదులు పంపినట్లు తెలుస్తోంది. 

నోటీసుల ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నాం తొలుత టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయింపుల విచారణ ఉంది. అయితే.. విచారణకు హాజరుకాలేమంటూ ఆనం రామనారాయణరెడ్డి బదులు పంపినట్లు తెలుస్తోంది. తమ అనర్హత పిటిషన్‌కు సంబంధించి.. పిటిషనర్‌ సమర్పించిన వీడియో ఆధారాలు ఒరిజినల్‌ అని నిరూపించాల్సిన అవసరం ఉందంటూ పాత పాటే పాడారు వాళ్లు. తాము మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఆయా సంస్థల సర్టిఫైడ్‌ కాపీలు కావాలని స్పీకర్‌ను ఆనం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము విచారణకు రాలేమని ఆయన బదులు పంపారు.  అలాగే.. మేకపాటి, శ్రీదేవి కూడా మరింత సమయం కావాలని కోరినట్లు సమాచారం.

వైఎస్సార్‌సీపీ నుంచి నెగ్గి.. టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు  సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన వీళ్లపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్‌ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్‌ మేరిగ మురళీధర్‌.. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌  కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. వీళ్లతో పాటు టీడీపీ తరఫు నుంచి కూడా అనర్హత ఫిర్యాదు నమోదు అయ్యింది.

.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. వాళ్లపై నమోదు అయిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్‌, మండలి చైర్మన్‌లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు.  అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు.  

సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఇవాళ (19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. స్పీకర్‌ కార్యాలయంలో వీళ్ల విచారణ జరగాల్సి ఉంది. 

అలాగే.. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్‌(మండలి) సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్‌ కార్యాలయం.ఒకవేళ.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్‌, చైర్మన్‌లు స్పష్టం చేశారు. దీంతో రాలేమంటూ లేఖ పంపిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉండనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇంకోవైపు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. వీళ్లను కూడా ఇవాళే విచారణకు రావాల్సిందిగా స్పీకర్‌, మండలి చైర్మన్‌లు నోటీసులు పంపించారు.

Advertisement
Advertisement