AP: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు | Sakshi
Sakshi News home page

AP: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Published Tue, Feb 27 2024 5:13 AM

AP Speaker Tammineni Sitaram Disqualified 8 MLAs - Sakshi

సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్‌ (విశాఖ దక్షిణ), కరణం బలరాం (చీరాల), మద్దాల గిరి (గుంటూరు వెస్ట్‌), వల్లభనేని వంశి (గన్నవరం)పై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్‌ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు. ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు.

పార్టీల విప్‌లు చేసిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు ఇచి్చన వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్‌.. ఆ 8 మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్‌ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement