అప్పులు తగ్గించి సంపద పెంచాం  | Finance Minister Buggana in the debate on the budget | Sakshi
Sakshi News home page

అప్పులు తగ్గించి సంపద పెంచాం 

Published Fri, Feb 9 2024 5:29 AM | Last Updated on Fri, Feb 9 2024 7:56 AM

Finance Minister Buggana in the debate on the budget - Sakshi

సాక్షి, అమరావతి: తమకు మీడియా బలం ఉందనే అహంకారంతో విపక్షాలు పదేపదే అబద్ధాలతో గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. గత సర్కారు కంటే తక్కువ అప్పులు చేసినా అనునిత్యం బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ 2014లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా ఇప్పుడు కొత్తవి ప్రకటిస్తుంటే బీజేపీ, వామపక్షాలు లాంటి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

శాసనసభలో ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన గురువారం గణాంకాలతో సమాధానమిచ్చారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ సమర్పించే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ 2024–25 ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించాల్సిందిగా సభ్యులను కోరారు.

టీడీపీ కంటే అప్పుల వృద్ధి తక్కువే
వాస్తవ లెక్కలకు, బడ్జెట్‌కు వ్యతాసం ఉందని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించటాన్ని బుగ్గన ఖండించారు. 2019–20లో టీడీపీ రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా వాస్తవంగా ఖర్చు చేసింది రూ.1.64 లక్షల కోట్లు మాత్రమేనని, బడ్జెట్‌ లెక్కల కంటే రూ.27,000 కోట్లు తక్కువ వ్యయం చేసిందని గుర్తు చేశారు.

2023–24 బడ్జెట్‌­లో రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెడితే సవరించిన అంచనాల ప్రకారం వ్యయం రూ.2.75 లక్షల కోట్లుగా ఉందని, తుది లెక్కలు కూడా ఇంచుమించి ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధిరేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మీడియా బలం ఉందన్న అహంకారంతో పదేపదే గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

♦  కేంద్ర అప్పులు 2014–19లో  59.75 శాతం పెరగగా 2019–24లో 86 శాతం పెరిగాయి. కేంద్ర అప్పులు 2014–19లో 9.82 శాతం, 2019–24లో 13.25 శాతం చొప్పున పెరిగాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 126 శాతం పెరిగితే 2019–24 మధ్య అప్పుల్లో వృద్ధి 95 శాతంగా ఉంది. అంటే సగటున టీడీపీ హయాంలో 18 శాతం అప్పులు పెరిగితే మా ప్రభుత్వం వచ్చాక 14 శాతం మేర మాత్రమే పెరిగాయి. కేంద్రం, టీడీపీ సర్కారు రెట్టింపు స్థాయిలో అప్పులు చేస్తే మాట్లాడని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మాపై బురద జల్లడం వెనుక మీడీయా ఉందన్న అహకారం స్పష్టంగా కనిపిస్తోంది.

♦   2014లో పలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత మేనిఫెస్టోను మాయం చేసింది. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటివి ఎగ్గొట్టింది. మా ప్రభుత్వం మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ తు.చ. తప్పకుండా అమలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయి. వామపక్ష పార్టీలు ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా మేనిఫెస్టోను మా ప్రభుత్వం అమలు చేసిందని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. 

♦  గత సర్కారు పెట్టిన బకాయిలను తీర్చడంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలకు సంబంధించిన అకౌంట్స్‌ను మా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం చేసిన అప్పులు బటన్‌ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో జమ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయాయో వెల్లడించాలి. 

♦  మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఖజానాలో ఏమీ లేదని, హామీలు నెరవేర్చలేరంటూ టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు వల్ల కాని హామీలను ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు విస్తుపోతున్నారు. తమ నాయకుడు ఎన్నికల ముందు హామీలను గుప్పించి ఆ తర్వాత గాలికి వదిలేస్తారని రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కలిసినప్పుడు అసలు విషయం చెబుతున్నారు. సంపద సృష్టించి హామీలను అమలు చేస్తానంటున్న చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే వాస్తవాలు బోధపడతాయి. 

♦ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రెవెన్యూ వృద్ధి రేటు 6 శాతం ఉంటే ఇప్పుడు 16 శాతానికి పెరిగింది. దీనిబట్టి ఎవరి హయాంలో సంపద పెరిగిందో తెలుసుకోవచ్చు. 2018–19లో 11% స్థూల ఉత్పత్తి రేటుతో ఏపీ 14వ స్థానంలో ఉండగా 2023 నాటికి 16.2 శాతానికి పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో 4వ స్థానానికి పురోగమించింది. 2018–19లో మన వ్యవసాయ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా ఈ రోజు 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి ఎగబాకింది. 2023–24కి సంబంధించి కేంద్ర జీడీపీలో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేయగా అది మన రాష్ట్రంలో 7.35 శాతంగా ఉంటుంది.  

ఇది ప్రజా బడ్జెట్‌ 
ఇది సప్త రంగాలకు పెద్దపీట వేసిన ప్రజా బడ్జెట్‌ ఇది. గత ప్రభుత్వం మాదిరిగా గాలిలో మేడలు కట్టలేదు. గ్రాఫిక్స్‌ బొమ్మలు చూపించలేదు. మా నాయకుడు సుదీర్ఘ పాదయాత్రలో పేదల గుండెలు తడిమి ప్రతి ఒక్కరి బతుకులు మార్చేలా తీసుకొచ్చిన బడ్జెట్‌ ఇది. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి.. ఆ దిశగా మానవ జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్‌ రూపొందించారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా, విద్య మిథ్యగా మారిపోయింది. ఇప్పుడు ఎందరో పేదలకు ఉచిత వైద్యంతో ఊపిరిపోస్తూ.. ఎందరో పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి చదువులు అందిస్తోంది మా ప్రభుత్వం.

సీఎం జగన్‌ గొప్ప సంకల్పమే జీపీపీతోపాటు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే మార్గదర్శకంగా నిలబెట్టింది. ఉత్తరాంధ్రలో సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారులకు జగనన్న వచ్చిన తర్వాతే కదా జీవిత భరోసా దక్కింది. వేట నిషేధ సమయంలో రూ.10వేలు అందుకుని కడుపు నింపుకుంటున్నారు. టీడీపీ హయాంలో కేవలం 4లక్షల ఇళ్లు ఇస్తే.. మా ప్రభుత్వం 32లక్షలకు పైగా ఇళ్ల స్థలాలతో కొత్త ఊర్లను నిర్మిస్తోంది.

కొత్త పారిశ్రామిక పాలసీ ఏపీ ముఖచిత్రాన్ని మార్చేసింది. మా ప్రభుత్వం డీబీటీ, నాన్‌–డీబీటీ కింద ఇచ్చినవే చెబుతోంది. అవి కాకుండా గ్రామాల్లో చేసిన అభివృద్ధిని కూడా కలిపితే ఏకంగా ఐదేళ్లలో రూ.5.30లక్షల కోట్లకుపైగా సంక్షేమాభివృద్ధిని చేసి చూపించాం. దీనితోపాటు ఉత్తరాంధ్రలో ఇరిగేషన్‌ అభివృద్ధికి మరింత నిధులు కేటాయించాలి.   – కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే  

విద్య, వైద్యానికి పెద్దపీట 
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టి మన పిల్లల భవితకు బంగారు బాటలు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు గోరుముద్ద పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వం నాలుగు రెట్లు అధికంగా బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది.

సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసింది. ఏకంగా 4 లక్షల ఉద్యోగాలను కలి్పంచింది. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో సాయం అందించింది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ప్రస్తుతం రాష్ట్రం నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతోంది.  – హఫీజ్‌ ఖాన్, కర్నూల్‌ ఎమ్మెల్యే 

రేపటి తరాల అభివృద్ధికి పునాదులు 
రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీల అభ్యున్నతికి సీఎం జగన్‌ కంకణబద్దుడై ఉన్నారు. ఈ క్రమంలో ముస్లింలకు మేలు చేస్తూ ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేశారు. నిరుపేదలకు లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రేపటి తరాల అభివృద్ధికి పునాదులు వేశారు. విద్యా, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పులు తెచ్చారు. నవరత్నాల పథకాల అమలు ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారు. సర్పంచ్‌ల దగ్గర నుంచి నాలాంటి సామాన్యూలు ఎందరికో సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు.  – ముస్తఫా, గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement