శనివారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సమీక్షిస్తున్న మంత్రులు కిషన్‌రెడ్డి, మాండవ్య
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) నిర్మాణం చివరి దశ పనులు త్వరగా పూర్తి చేస్తామని, నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్‌సుఖ్ మాండవ్య అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలసి శనివారం సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.6,120.5 కోట్లతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99 శాతం పూర్తయ్యాయన్నారు. కరోనా కారణంగా ప్లాంట్ పనులు మూడు నెలలు ఆలస్యం అయ్యాయని చెప్పారు.
ప్లాంట్‌లో ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకే కేటాయిస్తామని తెలిపారు. కర్మాగారం పూర్తయ్యాక ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దాదాపు 4 కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారని, 2.5 కోట్ల యూరియా దిగుమతి చేసుకుంటామని వివరించారు. దేశవ్యాప్తంగా ఐదు ఎరువుల కర్మాగారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు వినియోగించే ఎరువుల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.600 నుంచి రూ.700 సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కర్మాగారం ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి ధర్మాపిల్, కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్‌ఎఫ్‌సీఎల్ ఈడీ రాజన్ థాపర్ పాల్గొన్నారు.
తమాషా చూస్తున్నారా? పోలీసులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
రాష్ట్రంలో ఎక్కడ ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా ముందే హౌస్ అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీ నాయకుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ గేటు ఎదుట టీఆర్‌ఎస్ నాయకులు గంటసేపు ధర్నా చేసినా పట్టించుకోకుండా తమాషా చూస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న క్రమంలో జనాల వద్దకు మంత్రులు వెళ్లొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. తాము వాహనాలను దిగివచ్చి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడామన్నారు. అక్క డ పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు విఫలమ య్యారని విమర్శించారు. రాజకీయం కావా లా? ఫ్యాక్టరీ కావాలా? తెలంగాణ రైతులకు ఉపయోగపడే యూరియా కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు ప్లాంట్‌లో ట్రయల్‌రన్ నిర్వహిస్తామని, నవంబర్‌లో ప్రధాని మోదీ చేతులు మీదుగా ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రారంభిస్తామని తెలిపారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ‘లోకల్ ఫైట్’
కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు మాండవ్య, కిషన్‌రెడ్డిని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించడంతో కేంద్ర మంత్రులు వాహనాలు దిగి వారి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రులకు, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే చందర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న వీర్నపల్లి గ్రామాన్ని తరలించాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో అక్కడకు చేరుకొన్న బీజేపీ నాయకులు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒకదశలో అసహనానికి గురైన కేంద్రమంత్రులు వెనక్కివెళ్లి వాహనాల్లో కూర్చున్నారు. ఈ సమయంలో ఎంపీ వెంకటేశ్ వారివద్దకు వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడారు. తర్వాత మంత్రులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment