ఉదయం లేవగానే బాల్కనీలోని మొక్కల పచ్చదనం చూస్తే భలే హాయిగా ఉంటుంది కదా. మరి అరవిచ్చిన మందారమో, విచ్చీవిచ్చని రోజా పువ్వు మొగ్గలు పలకరిస్తేనో.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. పువ్వుల్లో రాణి స్థానం గులాబీదే. రెడ్, వైట్, ఎల్లో, పింక్, ఆరెంజ్, బ్లూ , గ్రీన్, బ్లాక్ రంగుల్లో గులాబీలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
గ్లాడియేటర్, సర్పంచ్, డబుల్ డిలైట్ కలర్, హైబ్రీడ్, మార్నింగ్ గ్లోరీ, సన్సెట్, కశ్మీర్, కాకినాడ, రేఖ, ముద్ద, తీగజాతి ఇలా పలు రకాల గులాబీలున్నాయి. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు మొగ్గలతో కళకళలాడుతూండే గులాబీ మొక్క మన గార్డెన్‌లో నాటిన తరువాత మొగ్గలు వేయడం మానేస్తుంది. ఆరోగ్యంగా ఎదగదు. ఒకవేళ మొక్క బాగా విస్తరించినా, పెద్దగా పూలు పూయదు. దీనికి కారణంగా మొక్కకు అవసరమైన పోషకాలు అందకపోవడమే. మరి ఏం చేయాలి. చక్కగా గుత్తులుగా గుత్తులుగా పూలతో మన బాల్కనీలోని గులాబీ మొక్క కళ కళలాడాలంటే ఏం చేయాలి. సేంద్రీయంగా ఎలాంటి ఎరువులివ్వాలి లాంటి వివరాలు తెలుసుకోవడం అవసరం. (Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?)
పెరటి తోటల్లో చిన్న చిన్న కుండీలలో పెంచే మొక్కలు ఏపుగా ఎదగాలన్నా, పువ్వులు విరగ బూయాలన్నా కిచెన్ కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎక్కువగా ఉపయోగ పడతాయి. వీటితోపాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఫెర్‌మింటెడ్ ఫ్రూట్స్, బెల్లంతో కలిపి పులియ బెట్టిన పళ్లు, లేదా తొక్కలు ద్వారా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టలైజర్స్ వాడటం వల్ల వచ్చే ఫలితాలను గమనిస్తే ఆశ్చర్య పోక తప్పదు.
మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం మూడు పోషకాలలో చాలా. అవసరం. వీటన్నింటిలోకి రాణి లాంటిది ముఖ్యంగా గులాబీ మొక్కలకు బాగా ఉపయోగపడేది అరటి పళ్ల తొక్కలతో చేసే ఎరువు. ఈ లిక్విడ్‌ను మొక్కలకిచ్చిన వారంరోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. నైట్రోజన్ ఇతర రూపాల్లో లభించినప్పటికీ ముఖ్యమైన పొటాషియం అరటి తొక్కల ఫెర్టిలైజర్ ద్వారా లభిస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం.
బనానా పీల్ ఫెర్టిలైజర్
బాగా మగ్గిన అరటి పళ్ల తొక్కలను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని, గిన్నెలోకి తీసుకొని ముక్కలు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. దీన్ని రెండు మూడు పొంగులు వచ్చే దాకా మరిగించుకోవాలి. బాగా చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని వడపోసుకుని కుండీకి ఒక కప్పు చొప్పున గులాబీ మొక్క మొదట్లో పోసుకోవాలి. పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నా ప్రమాదమేమీలేదు. కానీ మొక్కకిచ్చిన ఫెర్టిలైజర్ బయటికి పోకుండా చూసుకోవాలి. అంటే మనం అందించిన పోషకం మొత్తం వృధాకా కుండా మొక్క కందేలా చూసుకోవాలన్నమాట. వారం రోజుల్లో కొత్త చిగుర్లు, చిగుర్లతోపాటు కొత్తబడ్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.
మరొక విధానంలో ముక్కలుగా కట్ చేసిన అరటి పళ్ల తొక్కల్ని 24 గంటలపాటు నీళ్లలో నానబెట్టి, ఆ తరువాత ఆ నీరును మొక్కలకు వాడవచ్చు. ఏ మొక్కకైనా పూత పిందె దశలో ఈ ఫెర్టిలైజర్‌ను అందిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే అరటి తొక్కలను మొక్క మొదట్లో పాతిపెట్టినా ఉపయోగమే.సేంద్రీయంగా పండించిన అరటి పళ్ల తొక్కలను ఉపయోగిస్తే మరీ మంచిది.
పొటాషియం మొక్కలు కాండాన్ని బలంగా చేయడమే కాదు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. పుష్పించే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. పండ్ల మొక్కల్లో పండ్ల నాణ్యతను మెరుగు పరుస్తుంది. కాల్షియం, పొటాషియం, మాంగనీసు లాంటివాటికి అద్భుతమైన మూలం అరటి తొక్కలు. ఇవి మొక్కలు ఎక్కువ నత్రజనిని తీసుకోవడానికి, కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment