సాక్షి పెద్దపల్లి: వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ఎరువుల కొరత తీరనుంది. తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్)తో ఎరువుల లభ్యత పెరగనుంది. ఈనెల 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) పేరుతో పునరుద్ధరించాలని నిర్ణయించింది.
2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్‌ఎఫ్‌సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్ బ్రాండ్’పేరుతో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి చేసే 45 కిలోల యూరియా బస్తా ధరను రూ.266.50గా నిర్ణయించి వాణిజ్య అవసరాల నిమిత్తం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో రాష్ట్రంలో యూరియా, అమ్మోనియా కొరత పూర్తిగా తీరిపోనుంది.
తగ్గనున్న దిగుమతి భారం
దేశవ్యాప్తంగా ఏటా 300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా.. 250 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎఫ్‌సీల్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ కొరత చాలావరకు తీరనుంది. విదేశాలనుంచి దిగుమతి భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ (అప్పటి ఎఫ్‌సీఐ), గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), బరౌనీ(బిహార్) ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ చేపట్టింది. వీటిలో మొదట రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక గోరఖ్‌పూర్, సింద్రీ యూనిట్లలో 2022 మార్చి నాటికి, తాల్చేర్ ప్లాంట్‌లో 2023లో యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎఫ్‌సీఐ ఏర్పడింది ఇలా..
►1970 అక్టోబర్ 2న నాటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి త్రిగున్‌సేన్ రామగుండంలో ఎఫ్‌సీఐ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు.
►గడువు కంటే ఆరేళ్లు ఆలస్యంగా ప్రారంభమైన ఎఫ్‌సీఐ.. 1980 నవంబర్ ఒకటి నుంచి స్వస్తిక్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
►అనంతర కాలంలో పలు కారణాలతో 1999 మార్చి 31న కంపెనీ మూతపడింది.
నాడు బొగ్గు.. నేడు సహజవాయువు
రామగుండంలో మూతపడిన ఎఫ్‌సీఐ కర్మాగారం అప్పట్లో బొగ్గు, విద్యుత్తు ఆధారంగా నడిచేది. ప్రస్తుతం కర్మాగారాన్ని పునరుద్ధరించాక సహజవాయువును ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి రాజస్తాన్‌కు వెళ్లే గ్యాస్ పైప్‌లైన్ నుంచి రామగుండం వరకు 363 కిలోమీటర్ల మేర ప్రత్యేక గ్యాస్ పైప్‌లైన్లను నిర్మించారు. ఈ కర్మాగారంలో కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాష్ట్రానికి 50 శాతం యూరియూ
ఆర్‌ఎఫ్‌సీఎల్ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఐదు నెలలుగా ఇక్కడ ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణకే సరఫరా చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
విదేశీ సాంకేతికతతో ఉత్పత్తి
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్డోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేమ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేయడం, ఆ నీటి ఆవిరినే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి కోసం వినియోగించడం ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రత్యేకతల్లో ఒకటి. ప్లాంటుకు కావాల్సిన ఒక టీఎంసీ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment