సాక్షి, పెద్దపల్లి: సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పొలంబాట పట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులో గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి తన పొలంలో నాటు వేస్తుండగా.. అటుగా వెళ్తున్న మంత్రి నేరుగా ఆయన పొలంలో దిగారు. లుంగి ధరించి రైతుతో కలిసి గొర్రు (జంబూ) కొట్టారు. పొలం మడిలో రసాయన ఎరువు చల్లారు. నారును మహిళా కూలీలకు అందించారు. మహిళలతో కలిసి సుమారు అరగంటపాటు నాటు వేశారు.
అప్పటికే మధ్యాహ్నం కావటంతో కూలీలతోనే కలిసి భోజనం చేశారు. అక్కడినుంచి ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన ఎర్రగుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తోందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతోందని, పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందిస్తున్నామని వెల్లడించారు.
చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment