అమ్మోనియా, యూరియా ప్లాంట్ల ఏర్పాటు
మూడు ప్రభుత్వ రంగ సంస్థల సంతకాలు
ప్రాజెక్టు వ్యయం రూ. 5,000 కోట్లు
2016లో నిర్మాణం మొదలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్‌ఎఫ్‌ఎల్), ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐఎల్) కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో ఒక కొత్త కంపెనీని ప్రారంభించేందుకు జరిగిన ఈ ఒప్పందంపై కేంద్ర ఎరువుల మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల సమక్షంలో బుధవారం నోయిడాలో సంతకాలు జరిగాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 5,000 కోట్లుగా ఉండవచ్చని ఇంతకుముందే ఎన్‌ఎఫ్‌ఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు.
2200 మెట్రిక్ టన్నుల రోజువారీ సామర్థ్యంతో అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంటు ఏర్పాటవుతాయి. వెంచర్లో ఎన్‌ఎఫ్‌ఎల్, ఈఐఎల్‌లకు చెరో 26 శాతం వాటా వుంటుంది. మిగిలిన వాటా రామగుండం ప్రాజెక్టుకు ప్రస్తుత మౌలిక సదుపాయాల్ని అందిస్తున్న ఎఫ్‌సీఐఎల్ చేతిలో వుంటుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈపీసీ కాంట్రాక్టు పద్ధతిన ఇంజనీర్స్ ఇండియా చేపడుతుంది. 2018కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా. ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారాను, నీటి వనరులను గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి అందించనున్నారు.
రామగుండం ఎరువుల యూనిట్ పునరుద్ధరణకు ఒప్పందం
Published Thu, Jan 15 2015 8:05 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement
Advertisement