National Fertilizers
-
ఎన్ఎఫ్ఎల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఎరువుల రంగ పీఎస్‌యూ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్)లో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా 20 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా ఓఎఫ్ఎస్ను నిర్వహించేందుకు మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల సంస్థలు మార్చి 2లోగా బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. ఇందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఎన్ఎఫ్ఎల్లో 20 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 400 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఐపీఓకు ఇండియా పెస్టిసైడ్స్ నిధుల సమీకరణకు మరో సంస్థ సిద్ధమైంది. ఆగ్రో కెమికల్ టెక్నాలజీస్ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు కోసం సెబీకి బుధవారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను విడుదల చేయనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ ప్రధాన ప్రమోటర్ అగర్వాల్‌తో పాటు ఇతర ప్రమోటర్లు రూ.700 కోట్ల షేర్లను విక్రయించునున్నట్లు కంపెనీ తెలిపింది. -
డిజిన్వెస్ట్మెంట్కు 13 సంస్థలు రెడీ!
5 నుంచి 15 శాతం వరకూ వాటాల విక్రయం న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) డిజిన్వెస్ట్‌మెంట్ తాజా జాబితాలో దాదాపు 13 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఉన్నాయి. ఈ దిశలో 5-15 శాతం మేర వాటాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ముసాయిదా కేబినెట్ నోట్ ఇప్పటికే సిద్ధమయినట్లు సమాచారం. కాగా తదుపరి జాబితా సిద్ధమయినప్పటికీ, ఏ ప్రభుత్వ రంగ సంస్థ తక్షణం మార్కెట్లోకి వస్తుందన్న విషయం తెలియలేదు. ఇందుకు సంబంధించి కేంద్రం మార్కెట్ కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సంస్థలు ఇవీ... * నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్), హిందుస్తాన్ కాపర్(హెచ్‌సీఎల్), ఇండియా టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ), స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ), ఎంఎంటీసీల్లో 15% చొప్పున వాటాల విక్రయం. * ఇంజనీర్స్ ఇండియా(ఈఐఎల్), నాల్కో, ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్(ఐఓసీ)ల్లో 10% చొప్పున డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక. * బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్), డ్రెడ్జింగ్ కార్పొరేషన్ (డీసీఐఎల్)లో 5 శాతం వాటా విక్రయం. వాటాల విక్రయ విలువలు ఇలా...: ప్రస్తుత మార్కెట్లో ఆయా షేరు ధరల ప్రకారం ఎన్ఎఫ్ఎల్ ద్వారా రూ.240 కోట్లు, హెచ్‌సీఎల్ ద్వారా రూ.1,000 కోట్లు, ఐటీడీసీతో రూ.169 కోట్లు, ఎస్టీసీ ద్వారా రూ.140 కోట్లు, ఎంఎంటీసీకి సంబంధించి రూ.800 కోట్లు, ఈఐఎల్ ద్వారా రూ.700 కోట్లు, నాల్కో విషయంలో రూ.1,200 కోట్లు లభించనున్నాయి. ఎన్ఎండీసీ ద్వారా రూ.5,300 కోట్లు, ఐఓసీ ద్వారా రూ.9,000 కోట్లు, బీహెచ్ఈఎల్ విషయంలో రూ.2,900 కోట్లు, ఎన్టీపీసీ విషయంలో రూ.6,000 కోట్ల సమీకరణ జరగొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.41,000 కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. గత వారం ఆర్ఈసీలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.1,550 కోట్లు సమీకరించింది. -
రామగుండం ఎరువుల యూనిట్ పునరుద్ధరణకు ఒప్పందం
అమ్మోనియా, యూరియా ప్లాంట్ల ఏర్పాటు మూడు ప్రభుత్వ రంగ సంస్థల సంతకాలు ప్రాజెక్టు వ్యయం రూ. 5,000 కోట్లు 2016లో నిర్మాణం మొదలు న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐఎల్) కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో ఒక కొత్త కంపెనీని ప్రారంభించేందుకు జరిగిన ఈ ఒప్పందంపై కేంద్ర ఎరువుల మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల సమక్షంలో బుధవారం నోయిడాలో సంతకాలు జరిగాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 5,000 కోట్లుగా ఉండవచ్చని ఇంతకుముందే ఎన్ఎఫ్ఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు. 2200 మెట్రిక్ టన్నుల రోజువారీ సామర్థ్యంతో అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంటు ఏర్పాటవుతాయి. వెంచర్లో ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్లకు చెరో 26 శాతం వాటా వుంటుంది. మిగిలిన వాటా రామగుండం ప్రాజెక్టుకు ప్రస్తుత మౌలిక సదుపాయాల్ని అందిస్తున్న ఎఫ్‌సీఐఎల్ చేతిలో వుంటుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈపీసీ కాంట్రాక్టు పద్ధతిన ఇంజనీర్స్ ఇండియా చేపడుతుంది. 2018కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా. ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారాను, నీటి వనరులను గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి అందించనున్నారు. -
రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ!
న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ చర్యలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐఎల్) కలిసి బుధవారం జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 5,000 కోట్లుగా ఉండనుందని ఎన్ఎఫ్ఎల్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. రామగుండం ఎరువుల కర్మాగారం కరీంనగర్ జిల్లాలో ఉంది. కార్యకలాపాలు లాభదాయకంగా లేకపోవడంతో 1999 నుంచి ఇందులో యూరియా, అమోనియా ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే, మూతబడిన ఎఫ్‌సీఐఎల్ యూనిట్లను పునరుద్ధరించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రామగుండం ప్లాంటు కూడా తెరపైకి వచ్చింది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం రోజుకూ 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దనున్నారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి కాగలదని ఎన్ఎఫ్ఎల్ పేర్కొంది. దీనికి అవసరమైన నిధుల్లో ఎన్ఎఫ్ఎల్ 26 శాతం సమకూరుస్తుంది. ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారాను, నీటి వనరులను గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి అందించనున్నారు.