5 నుంచి 15 శాతం వరకూ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) డిజిన్వెస్ట్‌మెంట్ తాజా జాబితాలో దాదాపు 13 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఉన్నాయి. ఈ దిశలో 5-15 శాతం మేర వాటాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ముసాయిదా కేబినెట్ నోట్ ఇప్పటికే సిద్ధమయినట్లు సమాచారం. కాగా తదుపరి జాబితా సిద్ధమయినప్పటికీ, ఏ ప్రభుత్వ రంగ సంస్థ తక్షణం మార్కెట్‌లోకి వస్తుందన్న విషయం తెలియలేదు. ఇందుకు సంబంధించి కేంద్రం మార్కెట్ కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సంస్థలు ఇవీ...
* నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్‌ఎఫ్‌ఎల్), హిందుస్తాన్ కాపర్(హెచ్‌సీఎల్), ఇండియా టూరిజం అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ), స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్‌టీసీ), ఎంఎంటీసీల్లో 15% చొప్పున వాటాల విక్రయం.
* ఇంజనీర్స్ ఇండియా(ఈఐఎల్), నాల్కో, ఎన్‌ఎండీసీ, ఇండియన్ ఆయిల్(ఐఓసీ)ల్లో 10% చొప్పున డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక.
* బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్‌సీఎఫ్), డ్రెడ్జింగ్ కార్పొరేషన్ (డీసీఐఎల్)లో 5 శాతం వాటా విక్రయం.
వాటాల విక్రయ విలువలు ఇలా...: ప్రస్తుత మార్కెట్లో ఆయా షేరు ధరల ప్రకారం ఎన్‌ఎఫ్‌ఎల్ ద్వారా రూ.240 కోట్లు, హెచ్‌సీఎల్ ద్వారా రూ.1,000 కోట్లు, ఐటీడీసీతో రూ.169 కోట్లు, ఎస్‌టీసీ ద్వారా రూ.140 కోట్లు, ఎంఎంటీసీకి సంబంధించి రూ.800 కోట్లు, ఈఐఎల్ ద్వారా రూ.700 కోట్లు, నాల్కో విషయంలో రూ.1,200 కోట్లు లభించనున్నాయి. ఎన్‌ఎండీసీ ద్వారా రూ.5,300 కోట్లు, ఐఓసీ ద్వారా రూ.9,000 కోట్లు, బీహెచ్‌ఈఎల్ విషయంలో రూ.2,900 కోట్లు, ఎన్‌టీపీసీ విషయంలో రూ.6,000 కోట్ల సమీకరణ జరగొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.41,000 కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. గత వారం ఆర్‌ఈసీలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.1,550 కోట్లు సమీకరించింది.
డిజిన్వెస్ట్‌మెంట్‌కు 13 సంస్థలు రెడీ!
Published Tue, Apr 14 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement