తాజాగా 598 పాయింట్లు జూమ్
80,846 వద్ద ముగిసిన సెన్సెక్స్
181 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్
ముంబై: ప్రధానంగా పీఎస్‌యూ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లకు పెరిగిన డిమాండ్‌తో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 598 పాయింట్లు జంప్‌చేసి 80,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్ల వృద్ధితో 24,457 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,802 పాయింట్లు జమ చేసుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 701, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున ఎగశాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 81,000 సమీపాని(80,949)కి చేరింది. గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లు వెలుగులో నిలిచినట్లు పేర్కొన్నారు.
బ్లూచిప్స్ బలిమి..: ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా 2.5 శాతం జంప్‌చేయగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఆటో, ఐటీ 0.5 శాతం బలపడగా.. ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్ 6 శాతం జంప్‌చేసింది. ఎన్‌టీపీసీ, అదానీ ఎంటర్, యాక్సిస్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, అ్రల్టాటెక్, ఓఎన్‌జీసీ, సిప్లా, బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.7–1 శాతం మధ్య లాభపడ్డాయి.
అయితే ఎయిర్‌టెల్, హీరోమోటో, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 1.5–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. మార్కెట్ల బాటలో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1% ఎగశాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి రూ. 3,665 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం గమనార్హం! దేశీ ఫండ్స్ రూ. 251 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.
⇒ వారాంతాన 40 శాతం ప్రీమియంతో లిస్టయిన ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఇంట్రాడేలో మరో 19 శాతం జంప్‌చేసి రూ. 264ను తాకింది. చివరికి ఈ షేరు 16 % లాభంతో రూ. 258 వద్ద ముగిసింది.
⇒ గత నెల 27న లిస్టయిన ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 142 వద్ద నిలిచింది. ఈ షేరు ఐపీవో
ధర రూ. 108.
బంపర్ లిస్టింగ్‌లు
సీ2సీ అడ్వాన్స్‌డ్
చిన్న తరహా కంపెనీ(ఎస్‌ఎంఈ).. సీ2సీ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ బంపర్ లిస్టింగ్ సాధించింది. ఇష్యూ ధర రూ.226తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ.429 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5 శాతం లాభంతో రూ.451 వద్ద ముగిసింది.
రాజ్‌పుటానా బయోడీజిల్
ఎస్‌ఎంఈ సంస్థ రాజ్‌పుటానా బయోడీజిల్ లిస్టింగ్ అదిరింది. ఇష్యూ ధర రూ. 130తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ. 247 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5% లాభంతో రూ. 259 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment