Private Banking
-
హెచ్డీఎఫ్సీ తర్వాత.. ఐడీఎఫ్సీ బ్యాంకులో ఐడీఎఫ్సీ విలీనం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మాతృ సంస్థ ఐడీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా లావాదేవీని చేపట్టనున్నారు. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఆమోదించినట్లు ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు తాజాగా వెల్లడించాయి. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్సీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు జారీ చేయనున్నారు. ప్రధానంగా మౌలిక రంగానికి రుణాలందించే ఐడీఎఫ్సీ 1997లో ఆవిర్భవించింది. 2015లో ఐసీఐసీఐ, ఐడీబీఐ తరహాలో బ్యాంకింగ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్లో క్యాపిటల్ ఫస్ట్‌ను టేకోవర్ చేసింది. -
ప్రైవేటు బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ గవర్నర్...!
ముంబై: బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపై దృష్టి సారించి, ఇందుకు సంబంధించి తగిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని ప్రైవేటు రంగ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ ఆదేశించారు. ఒడిదుడుకులు తట్టుకునేలా బ్యాలెన్స్ షీట్స్ ఉండాలని సూచించారు. వ్యక్తులు, వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలుసహా వివిధ ఫైనాన్షియల్ సేవలు అన్నింటికీ తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటురంగ బ్యాంకర్లతో గవర్నర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం సమావేశ వివరాలపై ఒక ప్రకటన వెలువడింది. ప్రకటన ప్రకారం, మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన చర్యలను సత్వరం అమలు చేయాలని సూచించారు. దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత సవాళ్లలో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను గవర్నర్ ప్రశంసించారు. సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వర రావు, మైఖేల్ డీ పాత్ర, టీ రబి శంకర్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్ వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలను ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ బేస్ రేటు తగ్గింపు
ముంబై : ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు తమ బేస్ రేటును స్వల్పంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 9.75 శాతం నుంచి ఇకపై 9.70 శాతానికి దిగి వస్తుంది. కొత్త రేటు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత బ్యాంకు బేస్ రేటును తగ్గించడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల బేస్ రేటు కూడా 9.70%గా ఉంది. -
అరచేతిలో బ్యాంకింగ్...
మొబైల్ ఫోన్ ద్వారానే రుణ దరఖాస్తు కూడా 75 సేవలతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ యాప్ ఆవిష్కరణ వారణాసి నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా డిజిటల్ మాధ్యమంలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. 75 సర్వీసులతో కొత్త యాప్‌ను బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్ మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. గో డిజిటల్ - అరచేతిలో బ్యాంక్ నినాదం కింద దీన్ని ప్రవేశపెడుతున్నట్లు, మరే ఇతర బ్యాంకు కూడా ఇన్ని సర్వీసులు అందించడం లేదని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 100 దాకా పెరుగుతుందని చుగ్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న యాప్‌లో 60 దాకా నగదు, నగదుయేతర లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యముందని, వాటికి మరికొన్ని జత చేసి ఈ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని చుగ్ పేర్కొన్నారు. ఎఫ్డీలు, ఆర్డీలు ప్రారంభించడం, బిల్లుల చెల్లింపులు, ఫండ్స్..బీమా పథకాలు కొనుగోలు చేయడంతో పాటు ఈ యాప్ ద్వారా లోన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చని ఆయన తెలి పారు. దేశీయంగా ఈ త రహా సర్వీసు అందించడం ఇదే ప్రథమం అన్నారు. అలాగే, ఆయా ఖాతాదారులకు అందుబాటులో ఉండే వివిధ ఆఫర్లను బ్యాంకు నేరుగా తెలియజేసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఉదాహరణకు..ఖాతాదారు ఏదైనా నిర్దిష్ట ప్రదేశంలో తమ బ్యాంకు కార్డును ఉపయోగించి షాపింగ్ చేసిన పక్షంలో అక్కడికి దగ్గర్లోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై అందుబాటులో ఉన్న ఇతర ఆఫర్ల గురించిన సమాచారం కూడా మొబైల్ ద్వారా తక్షణమే లభించగలదని చుగ్ తెలిపారు. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు.. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులు జరిపే లావాదేవీల్లో 55 శాతం మొబైల్ సహా డిజిటల్ మాధ్యమంలోనే ఉంటున్నాయని చుగ్ వివరించారు. ఏటీఎంలు, ఇతరత్రా కార్డుల వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది 80 శాతం పైచిలుకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 90 కోట్ల పైచిలుకు మొబైల్ యూజర్లు ఉండగా.. 4 కోట్ల మంది మాత్రమే మొబైల్ బ్యాంకింగ్‌ని వినియోగిస్తున్నారని చుగ్ చెప్పారు. రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్ సేవల వినియోగం మరింత పెరగనుందన్నారు. తాము ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు.