అరచేతిలో బ్యాంకింగ్...
మొబైల్ ఫోన్ ద్వారానే రుణ దరఖాస్తు కూడా
75 సేవలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ యాప్ ఆవిష్కరణ
వారణాసి నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా డిజిటల్ మాధ్యమంలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. 75 సర్వీసులతో కొత్త యాప్‌ను బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్ మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. గో డిజిటల్ - అరచేతిలో బ్యాంక్ నినాదం కింద దీన్ని ప్రవేశపెడుతున్నట్లు, మరే ఇతర బ్యాంకు కూడా ఇన్ని సర్వీసులు అందించడం లేదని ఆయన వివరించారు.
రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 100 దాకా పెరుగుతుందని చుగ్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న యాప్‌లో 60 దాకా నగదు, నగదుయేతర లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యముందని, వాటికి మరికొన్ని జత చేసి ఈ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని చుగ్ పేర్కొన్నారు. ఎఫ్‌డీలు, ఆర్‌డీలు ప్రారంభించడం, బిల్లుల చెల్లింపులు, ఫండ్స్..బీమా పథకాలు కొనుగోలు చేయడంతో పాటు ఈ యాప్ ద్వారా లోన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చని ఆయన తెలి పారు. దేశీయంగా ఈ త రహా సర్వీసు అందించడం ఇదే ప్రథమం అన్నారు.
అలాగే, ఆయా ఖాతాదారులకు అందుబాటులో ఉండే వివిధ ఆఫర్లను బ్యాంకు నేరుగా తెలియజేసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఉదాహరణకు..ఖాతాదారు ఏదైనా నిర్దిష్ట ప్రదేశంలో తమ బ్యాంకు కార్డును ఉపయోగించి షాపింగ్ చేసిన పక్షంలో అక్కడికి దగ్గర్లోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై అందుబాటులో ఉన్న ఇతర ఆఫర్ల గురించిన సమాచారం కూడా మొబైల్ ద్వారా తక్షణమే లభించగలదని చుగ్ తెలిపారు.
పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు..
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులు జరిపే లావాదేవీల్లో 55 శాతం మొబైల్ సహా డిజిటల్ మాధ్యమంలోనే ఉంటున్నాయని చుగ్ వివరించారు. ఏటీఎంలు, ఇతరత్రా కార్డుల వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది 80 శాతం పైచిలుకు ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశీయంగా 90 కోట్ల పైచిలుకు మొబైల్ యూజర్లు ఉండగా.. 4 కోట్ల మంది మాత్రమే మొబైల్ బ్యాంకింగ్‌ని వినియోగిస్తున్నారని చుగ్ చెప్పారు. రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్ సేవల వినియోగం మరింత పెరగనుందన్నారు. తాము ప్రవేశపెట్టిన ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్ సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు.