
ప్రపంచ స్టాక్ మార్కెట్లు అప్
టారిఫ్‌లపై యూఎస్ వెనకడుగు
ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు ఎఫెక్ట్
బాండ్ల ఈల్డ్ డీలా, పసిడి మెరుపులు
నేడు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే వీలుంది. ఆసియా, యూరప్, యూఎస్ మార్కెట్లు బలపడటంతో సెంటిమెంటు మెరుగుపడింది. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లను 90 రోజుల వరకూ నిలిపివేయడంతోపాటు.. ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో హుషారు నెలకొంది.
ముంబై: అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం దేశీ స్టాక్‌మార్కెట్లు పనిచేయనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ఆసియా మార్కెట్లు 0.5–1.5% బలపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు మరింత అధికంగా 1.5–2.5% ఎగశాయి. యూఎస్ మార్కెట్లు సైతం 1% పైగా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) దేశీ మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు తెలిపారు. ఇప్పటికే యూఎస్ టారిఫ్‌ల అమలు 3 నెలలపాటు నిలిచిపోగా.. తాజాగా ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు లభించింది.
కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌సహా పలు ప్రొడక్టులపై కొత్త టారిఫ్‌లను ఎత్తివేశారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే టారిఫ్‌ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావచ్చన్న ఆందోళనలు అటు ముడిచమురు ధరలను.. ఇటు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరును దెబ్బతీస్తున్నట్లు వివరించారు. టోక్యో ఎల్రక్టాన్, శామ్‌సంగ్ ఎల్రక్టానిక్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. మార్చిలో చైనా ఎగుమతులు 12 శాతంపైగా పుంజుకున్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది.
బాండ్లు, కరెన్సీపై..
తాజాగా 10ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్ 4.47 శాతానికి బలపడింది. ఒక దశలో 4.58 శాతానికి ఎగసింది. వారంక్రితం 4.01 శాతంగా నమోదైంది. వెరసి ట్రేడ్ వార్ కారణంగా యూఎస్ వెలుపలి ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్లను విక్రయిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నష్టాలను కవర్ చేసుకునే బాటలో హెడ్జ్ ఫండ్స్ సైతం బాండ్లను విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై అటూఇటుగా వ్యవహరిస్తుండటంతో ప్రపంచ దేశాలలో రక్షణాత్మకంగా భావించే యూఎస్‌పై విశ్వాసం తగ్గే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఇది మరోవైపు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో న్యూ యార్క్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం తాజాగా 3,261 డాలర్లను తాకింది.
ద్రవ్యోల్బణం..
ట్రంప్ టారిఫ్ ప్రణాళికలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మార్చి గణాంకాలు అంచనాలకంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభా వాన్ని చూపనున్నట్లు భావిస్తున్నారు. ఫలితంగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి విధానాల్లో స్వేచ్చగా వ్యవహరించలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
శుక్రవారం సెలవు గుడ్‌ఫ్రైడే
సందర్భంగా శుక్రవారం(18న) స్టాక్ మార్కెట్లతోపాటు కమోడిటీ మార్కెట్లు సైతం పనిచేయవు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయలేదు. దీంతో ఈ వారం ట్రేడింగ్ 3 రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఈ వారం పలు దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలు ప్రకటించనున్నాయి. 15న ఇరెడా, ఐసీఐసీఐ ప్రు, 16న స్వరాజ్ ఇంజిన్స్, విప్రో, 17న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏఎంసీ, ఇన్ఫోసిస్, టాటాఎలక్సీ, 18న మాస్టెక్, 19న హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంకుల పనితీరు వెల్లడికానుంది.