డిజిన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయాధికారం...ఇక మంత్రుల చేతికి..!
• ప్రత్యామ్నాయ యంత్రాంగానికి కేబినెట్ ఆమోదముద్ర...
• కమిటీలో ఆర్థిక, రవాణా, పీఎస్‌యూలకు చెందిన మంత్రులకు చోటు
• 5 ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీల్లో వాటా అమ్మకానికి సై
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్) జోరు పెంచేందుకు మోదీ సర్కారు కొత్త విధానానికి తెరతీసింది. వాటా అమ్మకాలకు సంబంధించిన అధికారాలన్నీ మంత్రుల బృందానికి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) బుధవారం ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయాలు తీసుకునే ఈ మంత్రుల బృందంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, సంబంధిత పీఎస్‌యూలకు సంబంధించిన మంత్రులు ఉంటారు.
ఏదైనా సీపీఎస్‌యూలో వాటా విక్రయానికి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత.. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియపై నిర్ణయాలన్నీ మంత్రుల బృందమే తీసుకుంటుంది. వాటా విక్రయించే తేదీ, షేరు ధర ఖరారు, ఎన్నిదశల్లో వాటా విక్రయించాలి ఇతరత్రా అంశాలన్నీ నిర్ణయిస్తుంది. ‘నిర్దిష్ట సీపీఎస్‌యూలో ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గకుండా, యాజమాన్య నియంత్రణను సర్కారు చేతిలో ఉండేవిధంగానే వాటా విక్రయాలు జరుగుతాయి. దీనిప్రకారం ఆయా సంస్థల్లో ఎంత వాటా విక్రయించాలనేది ఇకపై ప్రత్యామ్నాయ యంత్రాంగమే నిర్ణయిస్తుంది’ అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
జాప్యాలు, ఊహాగానాలను తగ్గించేందుకే...
డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో జాప్యాలు, విధానపరమైన అంశాలపై ఊహాగానాలను తగ్గించడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.56,500 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.36,500 కోట్లను మైనారిటీ వాటా అమ్మకాల రూపంలో.. మిగతా రూ.28,000 కోట్లను వ్యూహాత్మక విక్రయాల ద్వారా సమీకరంచాలనేది ప్రభుత్వ ప్రణాళిక. కాగా, ఆర్థిక సంవత్సరం మరో రెండున్నర నెలల్లో ముగియనుండగా... ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ.23,500 కోట్ల నిధులను మాత్రమే సమీకరించగలిగింది.
లిస్టింగ్ బాటలో సాధారణ బీమా కంపెనీలు...
ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల్లో వాటా అమ్మకానికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రతిపాదనకు కేబినెట్ లైన్‌క్లియర్ చేసింది. ఈ రంగంలో ఉన్న మొత్తం ఐదు ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ‘తాజా ఈక్విటీ జారీ లేదా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వాటా విక్రయం ఉండొచ్చు. ఈ కంపెనీల్లో ప్రభుత్వ వాటాను ఇప్పుడున్న 100 శాతం నుంచి దశలవారీగా 75 శాతానికి తీసుకురావడమే మా లక్ష్యం’ అని కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో చెప్పారు. వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వ మూలధన నిధులపై ఆధారపడటాన్ని తగ్గించి... స్టాక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణను ప్రోత్సహించడం, కార్పొరేట్ నైతిక నియమావళిని మెరుగుపచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రభుత్వం వాటా విక్రయానికి ఓకే చెప్పిన పీఎస్‌యూ సాధారణ బీమా కంపెనీల్లో... న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(జీఐసీ)ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 52 బీమా కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో 24 జీవిత బీమా వ్యాపారంలో, 28 కంపెనీలు సాధారణ బీమా రంగంలో ఉన్నాయి. కాగా, భారతీయ జాయింట్ వెంచర్లలో విదేశీ బీమా కంపెనీల వాటా(ఎఫ్‌డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఇప్పటికే మోదీ సర్కారు ఆమోదం తెలిపింది.
‘ఎలక్ట్రానిక్స్’కు రాయితీల పరిమితి రూ.10,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా నెలకొల్పే ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లకు రాయితీల పరిమితిని రూ.10,000 కోట్లుగా కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు ప్రత్యేక రాయితీ ప్యాకేజీ పథకం(ఎంఎస్‌ఐపీఎస్)లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ స్కీం కింద కొత్త కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలకు దరఖాస్తుల అనుమతి గడువును ఏడాదిన్నరపాటు కుదించారు. ‘ఎంఎస్‌ఐపీఎస్ స్కీమ్‌లో సవరణ ప్రకారం ఇకపై ప్రతిపాదనలను 2018 డిసెంబర్ వరకూ అనుమతించనున్నాం.
అదేవిధంగా ప్రోత్సాహకాల పరిమితి రూ.10,000 కోట్లుగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటివరకూ స్కీమ్‌లో దరఖాస్తులకు వీలుంటుంది’ అని కేబినెట్ సమావేశం అనంతరం ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు చెప్పారు. ఒకవేళ పెట్టుబడి బిలియన్ డాలర్ల కంటే అధికంగా ఉంటే దానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ ఆమోదం తెలుపుతుందని ఆయన వెల్లడించారు. 2015 ఆగస్టులో ఈ స్కీమ్‌కు సవరణ చేస్తూ 2020 జూలై 27 వరకూ పొడించారు.
చిన్న సంస్థలకు ప్యాకేజీ...
దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు చేయూతనిచ్చేందుకు కేంద్రం ఒక ప్యాకేజీని ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థలకు నిధుల కల్పన కోసం క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ కింద మూలనిధి(కార్పస్)ని పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. దీనిప్రకారం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లో రుణాలను రెట్టింపు చేయనున్నారు. ఇప్పటివరకూ రూ. కోటి వరకూ రుణాలిస్తుండగా.. ఇకపై రూ.2 కోట్ల వరకూ లభిస్తుంది. తాజా నిర్ణయంతో కార్పస్ ఇప్పుడున్న రూ.2,500 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెరగనుంది. దీనికి నిదులను కేంద్రమే సమకూర్చుతుంది.
ఎఫ్‌సీఐకి రూ.45,000 కోట్ల ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్ రుణం...
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్) నుంచి రూ.45,000 కోట్ల రుణం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆహార సబ్సిడీ అవసరాల కోసం ఎఫ్‌సీఐ ఈ నిధులను ఉపయోగించుకోనుంది. కాగా, 4 రాష్ట్రాలు(అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాలకు ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్ రుణాల నుంచి మినహాయింపునిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.