విజయనగరం: సహకార సంఘాల్లో బినామీ రుణాల సొమ్ము మాత్రమే కాదు, ఎరువుల పైసలు కూడా పక్కదారి పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఎరువులు విక్రయించగా వచ్చిన రూ.కోటీ 50 లక్షలకు పైగా మొత్తం అనధికారికంగా పీఏసీఎస్ పెద్దల చేతుల్లో చెలామణి అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ మొత్తాన్ని దర్జాగా సంఘాల పెద్దలు అనుభవిస్తున్నారు. సొమ్ము చెల్లించాలని అడుగుతున్న మార్క్‌ఫెడ్‌కు మాయమాటలు చెప్పి కాలం గడిపేస్తున్నారు. డీసీసీబీ ఇచ్చిన గ్యారంటీ మేరకు విజయనగరం జిల్లాలోని సహకార సంఘాల(పీఏసీఎస్)కు ప్రతీ ఏడాది మార్క్‌ఫెడ్ ఎరువుల్ని సరఫరా చేస్తోంది.
వీటిని విక్రయించి, ఆ మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు జమ చేయాలి. పైసా పెట్టుబడి లేకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఆ సంఘాలు కమీషన్ పొందుతాయి. దీనివల్ల సిబ్బంది జీత భత్యాలు కొంతమేర గట్టెక్కుతాయి. అలాగే, రైతులకు అందుబాటులోనే ఎరువుల్ని విక్రయంచినట్టు అవుతుంది. ఇంత సదుద్దేశంతో సహకార సంఘాలకు మార్క్‌ఫెడ్ ఎరువుల్ని సరఫరా చేస్తుంటే ఆ స్థాయిలో తిరిగి చెల్లింపులు జరగడం లేదు. విక్రయాలు జరిపి నెలలు, ఏళ్లు గడుస్తున్నా మార్క్‌ఫెడ్‌కు సొమ్ము జమచేయకుండా కొన్ని సంఘాల్లో ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకుంటున్నారు.
మరికొన్ని సంఘాల పెద్దలు వడ్డీలకిచ్చి లాభాలు పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఇదే తంతు నడుస్తోంది. కానీ, అధికారులు నియంత్రించలేకపోతున్నారు. జిల్లాలో పలు పీఏసీఎస్‌లు గత ఏడాది రూ.2కోట్ల84లక్షల 52వేల మేర మార్క్‌ఫెడ్‌కు సంఘాలు బకాయి పడ్డాయి. అలాగని ఆ మేరకు స్టాక్ ఎక్కడా లేదు. దాదాపు విక్రయాలు జరిగిపోయాయి. ఆ సొమ్ము దాదాపు సంఘాల పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది విషయానికి వస్తే సహకార సంఘాలకు రూ. 25.53 కోట్ల విలువైన ఎరువుల్ని మార్క్‌ఫెడ్ సరఫరా చేసింది. గత ఏడాది బకాయితో కలిపి దాదాపు రూ.28.38 కోట్ల మేర మార్క్‌ఫెడ్‌కు సహకార సంఘాలు చెల్లించాల్సి ఉంది.
ఇదే సందర్భంలో సహకార సంఘాల బినామీ రుణాల భాగోతం వెలుగు చూస్తుండడం, పలు సంఘాలపై ప్రాథమిక విచారణ, స్టాట్యూటరీ విచారణలు పడుతుండడంతో ఎరువులు సొమ్ము వాడుకుంటున్న సంఘాలు ఉలిక్కిపడ్డాయి. ఈ సమయంలో ఎరువుల వ్యవహారం బయటపెడితే ఇబ్బందులొస్తాయని ఆ సంఘాల పెద్దలు చెల్లింపులు చేయడం వేగవంతం చేశారు. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నాటికి రూ.4.40 కోట్లు బకాయి ఉండగా, అక్టోబర్ నాటికి రూ.3.89 కోట్లకు, నవంబర్ నాటికి రూ.2.81కోట్లకు తగ్గింది. కానీ, చివరిగా మిగిలిన రూ.2.49కోట్ల బకాయికి సంబంధించిన వివరాలు అధికారుల వద్ద లేవు. విక్రయాలు జరిగినదెంత? స్టాక్ ఉన్నదెంత? అనేది ఎవరికీ తెలియదు. కానీ, సహకార శాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం స్టాక్ విలువ రూ.కోటి లోపే ఉంటుందని తెలుస్తోంది.
అంటే దాదాపు రూ.కోటీ 50 లక్షలు వ్యక్తుల జేబుల్లోనే ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. బకాయిలున్న సంఘాల్లో ఇప్పటికే స్టాట్యూటరీ విచారణ జరుగుతున్న రావివలస, చెముడు సొసైటీలున్నాయి. వాటితో పాటు విక్రయాలు జరిపి మార్క్‌ఫెడ్‌కు సొమ్ము చేయని సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా మార్క్‌ఫెడ్ అధికారులు ఏం చేయలేకపోతున్నారు. దీనికి పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తోంది. ఆ శాఖలో నలుగురే ఉద్యోగులుండటం, వారిలో ఇద్దరు కార్యాలయానికి పరిమితం కావలసి వస్తుండగా, మరొకరు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇంకొకరు డివిజనల్ మేనేజర్‌గా అన్ని వ్యవహారాలను పర్యవేక్షించవలసి ఉంది.
దీన్నిబట్టి మార్క్‌ఫెడ్ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సంఘాలకు సరఫరా చేసిన ఎరువుల్లో ఎంత స్టాక్‌ను విక్రయించారు ? ఎంత స్టాక్ ఉంది? అన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దీనికోసం తనిఖీలు జరపాలి. విక్రయాలు జరిగిన మేరకు మార్క్‌ఫెడ్‌కు సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లాలో అటువంటి పర్యవేక్షణ, తనిఖీలు జరగకపోవడంతో ఎక్కడేం జరుగుతుందో? ఎక్కడెంత విక్రయాలు జరిగాయో? ఎక్కడెంత స్టాక్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంఘాల సిబ్బంది చెప్పే వివరాలు, లెక్కల్నే మార్క్‌ఫెడ్ సిబ్బంది పరిగణలోకి తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని పలు సంఘాల్లో విక్రయాలు చేపట్టినా... ఆ మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు జమ చేయడం లేదు. సదరు మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. వడ్డీలకు తిప్పుకుని లబ్ధిపొందుతున్నారు. కొందరికి ఇదొక టర్నోవర్‌గా తయారైంది.