- ముందుకు వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం
హన్మకొండ(వరంగల్ జిల్లా): కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఎరువుల ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో మూసి వేసిన కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు మోదీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇక్కడ ఉత్పత్తి కానున్న ఎరువులను కిసాన్ బ్రాండ్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రాంతాన్ని త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహీర్, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రామగుండం సందర్శించనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. విపత్తు సహాయ నిధుల నుంచి నిధులు వాడుకోవడానికి కేంద్రం సడలింపు ఇచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణకు ఎరువుల ఫ్యాక్టరీ
Published Fri, Apr 24 2015 7:24 PM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement