తూకంలో మోసం చేస్తున్న ఎరువుల కంపెనీలు
50 కేజీల బస్తాలో 3 నుంచి 6 కేజీల వరకు తగ్గుదల
అధికారుల తనిఖీలో వెల్లడైన వాస్తవం
అన్నం పెట్టే రైతన్న అడుగడుగునా దగా పడుతున్నాడు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎరువుల కంపెనీలు సైతం మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ విషయం తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది.
నరసరావుపేట వెస్ట్ : సాధారణ తనిఖీల్లో భాగంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ చల్లా దయాకరరెడ్డి వినుకొండ రోడ్డులోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ గోడౌన్లను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆ సమయంలో గోడౌన్‌లో స్పిక్, కోరమాండల్ కంపెనీకి చెందిన గ్రోమోర్ పారీ సూపర్, ఎంవోపీ (పోటాషియం), పీపీఎల్ నవరత్న (డీఏపీ) ఎరువులకు చెందిన వేలాది బస్తాలు షాపులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి నుంచి ప్రతి రకానికి చెందిన 32 బస్తాలను ఎలక్ట్రానిక్ కాటా సహాయంతో తూకం వేయగా దిమ్మె తిరిగే వాస్తవం బయటపడింది. కాటాల్లో కోరమాండల్ పారీ సూపర్ కంపెనీకి చెందిన 50 కేజీల 32 బస్తాలను కాటా వేయగా వాటిలో 16 బస్తాల్లో తూకంలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ఒక్కో బస్తాలో 1 నుంచి 6 కేజీల వరకు తక్కువగా ఉన్నాయి. అలాగే కోరమాండల్ ఎంవోపీ (పొటాషియం) 32 బస్తాలను తూకం వేయగా ఒక్కో బస్తాలో 3 కేజీల వరకు త గ్గుదల ఉందని ఇన్‌స్పెక్టర్ దయాకరరెడ్డి చెప్పారు. పీపీఎల్ నవరత్న డీఏపీ బస్తాలను తూకం వేయగా 8 బస్తాల్లో 5 కేజీల వరకు తూకం తగ్గిందన్నారు. ప్రతి బస్తా గోనె సంచితో కలిపి 50 కేజీల 120 గ్రాములు ఉండాల్సి ఉండగా 49.600 గ్రాములే ఉన్నాయన్నారు.
కంపెనీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తాం
తనిఖీల్లో బయటపడిన వాస్తవాలపై ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసి, ఆ కంపెనీలపై కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్ దయాకరరెడ్డి విలేకర్లకు చెప్పారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాను కాటా వేసుకొని తూకాన్ని నిర్థారించుకున్న తర్వాతనే తీసుకోవాలని ఆయన సూచించారు.
దగాపడుతున్న రైతన్న
Published Sat, Nov 21 2015 12:42 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement
Advertisement