కొంగొత్త ఆవిష్కరణలు..తక్కువ ఖర్చుతో సమస్యకు ఈజీగా చెక్‌! | 3 Companies Recieve Infosys Foundation Aarohan Social Innovation Award | Sakshi
Sakshi News home page

కొంగొత్త ఆవిష్కరణలు..ఖర్చు తక్కువ..సమస్యకు ఈజీగా చెక్‌!

Published Thu, Oct 12 2023 2:05 PM | Last Updated on Thu, Oct 12 2023 7:19 PM

3 Companies Recieve Infosys Foundation Aarohan Social Innovation Award    - Sakshi

భారత స్టార్టప్‌ల హబ్‌గా ఎన్నో కొత్త ఆవిష్కరణలతో ప్రగతి పథంలో ముందుకుపోతుంది. ప్రభుత్వం సైతం వీటికి మంచి ప్రోత్సహం ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే సరికొత్త టెక్నాలజీతో కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకొస్తున్నాయి. అలాంటి కొంగొత్త ఆవిష్కరణలతో జఠిలమైన సమస్యలను చెక్‌ పెట్టిన హైదరాబాద్‌కి చెందిన మూడు కంపెనీలు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ 2023 సంవత్సరానికి ఇచ్చే ఆరోహన్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌  ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. ఆ స్థార్టప్‌ కంపెనీలు కనుగొన్న ఆవిష్కరణలు, వాటి ప్రత్యేకత గురించే ఈ కథనం.!

కామెర్లకు ఏఐ nLite 360తో చికిత్స
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో నవజాత శిశువుల్లో వచ్చే నియోనాటల్ కామెర్ల సమస్య మరీ ప్రముఖమైనది. దీని కారణంగా నిత్యం వేలాది చిన్నారులు అంగవైకల్యం బారిన పడటం లేదా మరణించడం జరుగుతోంది. దీనికి చెక్‌ పెట్లేలా ఐఐటీ హైదరాబాద్‌ ఆధారిత మెడ్‌టెక్‌ స్టార్టప్‌ హీమ్యాక్‌ ఏఐ సాంకేతికతో కూడిన ఫోటోథెరపీ పరికరం 'nLite 360'తో ముందుకు వచ్చింది.

ఇది శిశువుల్లో వచ్చే కామెర్ల వ్యాధికి సమర్థవంతంగా చికిత్స అందించగలదు. ఇతర సాధారణ ఫోటోథెరపీ పరికరాల కంటే మెరుగ్గా తక్కువ సమయంలోనే నవజాత శిశువులకు చికిత్స అందించగలదు అని ఈ హీమాక్ సహ వ్యవస్థాపకురాలు అంకిత కొల్లోజు చెప్పారు. సాధారణంగా శిశువుల్లో కామెర్ల వ్యాధి రాగానే వైద్యులు బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెడతారు. ప్రతి నిమిషం ఆ బిడ్డను పర్యవేక్షించాలా ఓ నిపుణుడు ఉంటారు. కానీ ఈ సాంకేతికతో కూడిన పరికరానికి ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పరికరానికి నిర్ధిష్ట సెన్సార్‌లు ఉంటాయి. అలాగే చికిత్సకు ఎలాంటి ఆటంకం లేకుండా బిడ్డకు తల్లి పాలిచ్చేలా పోర్టబుల్‌ యూనిట్‌ ఉంటుంది. ఈ వైద్య పరికరం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా పోర్టబిలిటీ యాక్సిస్‌ ఉంది. సరైన విద్యుత్‌ సరఫరాల లేని కుగ్రామాల్లో సైతం సమర్థవంతంగా పనిచేసే విధంగా బ్యాటరీతో నడిచేలా డిజైన్‌ చేసిన వైద్య పరికరం.

చేనేత కష్టాన్ని తీర్చే ఆవిష్కరణ
భారతదేశంలో చేనేత రంగం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం. తరతరాలుగా వస్తున్న ఓ సంప్రదాయ కళ. సృజనాత్మక కళకు చెందిన జీవనోపాధి. ఈ వృత్తి చాలా శ్రమతో కూడిన పని. మగ్గం నేయాలంటే సుమారు 20 నుంచి 45 కిలోల బరువులు ఉండే మగ్గం యంత్రాల్ని ఎత్తాల్సి ఉంటుంది. ఇక నెయ్యాలంటే దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల సార్లు తొక్కాలి. ముఖ్యంగా మనదేశంలో  సుమారు 19 లక్షల మందికి పైగా మహిళలకు చేనేత వృత్తే ఆధారం. ఈ వృత్తి అత్యంత కష్టమైనది గాక దీని కారణంగా మోకాళ్లు నొప్పులు, వెన్నునొప్పి వంటి ఇతరత్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు చేనేత కార్మికులు.

పలువురు ఈ వృత్తి కారణంగా కాళ్లు పోగొట్టుకున్నావారు ఉన్నారు. అంతేగాదు వికలాంగులు లేదా చేనేత కార్మికుడే ప్రమాదవశాత్తు వికలాంగుడైతే ఈ చేనేత వృత్తి కొనసాగించడం మరింత కష్టం. ఆ సమస్యను నివారించేలా శివకుమార్‌ మోదా స్థాపించిన మోదా టెక్నాలజీస్‌ ఓ సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. శివకుమార్‌ ఆయన బృందం చేనెత కార్మికుడి కష్టాన్ని తీర్చేలా మోధా పెడల్ ఆపరేటింగ్ మెషీన్‌ను తీసుకొచ్చింది. మగ్గాలకు ఎలాంటి మార్పులు చేయకుండా ఈ యంత్రాన్ని మగ్గానికి బిగిస్తే సరిపోతుంది.

యంత్రానికి అమర్చిన మోటారు బరువులును ఎత్తక్కర్లేకుండా  అదే ఆటోమేటిక్‌గా పైకి లేస్తుంది. దానికుండే పెడల్‌ స్విచ్‌ నొక్కితే చాలు తొక్కాల్సిన పని ఉండదు. దీంతో చేనేత కార్మికుడి మోకాళ్లు, వీపుపై ఎలాంటి భారం పడదు. పైగా హయిగా ఈ వృత్తిని చేసుకోగలుగుతారు. ఈ మిషన్‌తో చేనేత పని ఈజీ అవ్వడమే గాక మన దేశ వారసత్వ వృత్తి కనుమరగవ్వకుండా కాపాడుకోగలుగుతాం. వికలాంగులకు ఈ మిషన్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుబాటు ధరలోనే ఈ మిషన్‌ లభించేలా వినూత్నంగా తీసుకొచ్చారు శివ కుమార్‌, అతడి బృందం. 

ఊపిరితిత్తుల అనారోగ్యాన్ని గుర్తించే ఏఐ టూల్‌
లక్షలాది మంది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణ దగ్గుకి, ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే వచ్చే దగ్గుకు తేడా ఉంటుంది. కేవలం దగ్గు ఆధారంగా ఊరితిత్తుల సమస్య గుర్తించడం ఎలా అన్న ఆలోచనే ఆ ఆవిష్కరణకు నాంది అయ్యింది. ఈ మేరకు సాల్‌సిట్‌ వ్యవస్థాపకుడు నారాయణరావు శ్రీపాద ఐదేళ్ల క్రితం ఎయిమ్స్‌లో ఒక ప్రొఫెసర్‌తో దీనిపై జరిపిన చర్చే ఈ ఆవిష్కరణకు మూలం. ఆయన వైద్య రంగంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్ధారించే పరికరాల అవసరాన్ని గ్రహించారు.

అంతేగాదు ఆయన దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణం అయినప్పుడూ ఆ దగ్గులో అంతర్తీనంగా ఉండే తేడాల బట్టి అది ఉబ్బసం, టీబీ, క్షయం లేక కోరింత దగ్గు అనేది గుర్తించేలా సాంకేతికతను ఎందుకు అభివృద్ధి చేయకూడదు అనుకున్నారు. ఆ క్రమంలోనే శ్వాశ ఏఐ సాఫ్టేవేర్ టూల్‌ మన ముందుకు వచ్చింది. ఈ టూల్‌ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ అభ్యర్థి దగ్గును పది సెకన్లలో రికార్డు చేసి దేని వల్ల దగ్గు వచ్చిందనేది విశ్లేషిస్తుంది.

దీని అనుగుణంగా ప్రజలు తదుపరి టెస్ట్‌ చేయించుకుని సకాలంలో వైద్యం పొందొచ్చు. పైగా ల్యాబ్‌ టెస్ట్‌లు చేయించుకోవాలనే భయం తప్పుతుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా ఈ వైద్య పరికరం చక్కగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పరీక్షల కోసం డయాగ్నోస్టిక్‌ సెంటర్ల్‌కు వెళ్లక్కర్లేకుండా ప్రజలే ఇంటి వద్దే సులభంగా చెక్‌ చేసుకోగలుగుతారు. దీని వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సౌకర్యాలు లేని ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఈ ఏఐ టూల్‌ ఉపయోగపడుతుంది. 

(చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement