చెక్క వీడర్‌.. పక్కా లోకల్‌! | Tribal Farmer Innovate Local Made Wooden Machine | Sakshi
Sakshi News home page

చెక్క వీడర్‌.. పక్కా లోకల్‌!

Published Tue, Aug 18 2020 9:19 AM | Last Updated on Tue, Aug 18 2020 9:19 AM

Tribal Farmer Innovate Local Made Wooden Machine - Sakshi

బోయి భీమన్న

వరి పంట సాగులో కలుపు నియంత్రణ కోసమని దాదాపు పంట కాలం అంతా పొలంలో నీటిని నిల్వగట్టడం అలవాటుగా వస్తోంది. దీని వల్ల మిథేన్‌ వాయువు వెలువడి పర్యావరణపరమైన ఇబ్బందులు వస్తున్న విషయం కూడా తెలిసిందే. నీరు నిల్వగట్టినప్పటికీ రసాయనిక కలుపు మందులు వాడుతున్న వారూ లేకపోలేదు. అయితే, శ్రీవరి సాగులో నీటిని నిల్వగట్టకుండా ఆరుతడి పద్ధతిలోనే అందిస్తారు. ప్రకృతి వ్యవసాయదారులు రసాయనిక కలుపు మందులకు బదులు కూలీలతోనో, యంత్ర పరికరాలతోనో కలుపు తీస్తారు. శ్రీవరి సాగులో కలుపు తీతకు ఇనుముతో తయారైన ‘మండవ వీడర్‌’ను ఇన్నాళ్లూ వాడుతున్నారు. అయితే, విశాఖ ఏజన్సీలో ఓ గిరిజన రైతు తన తెలివి తేటలతో చెక్కతో సరికొత్త వీడర్‌ను తయారు చేసి మంచి ఫలితాలను పొందుతున్నారు. చిన్న పనస దుంగ, వెదురు బొంగు, గుప్పెడు మేకులతో చెక్క వీడర్‌ను తయారు చేశారు. ఒకే ఒక్క రోజులో దీన్ని తయారు చేయటం మరో విశేషం. ఇది బాగా పనిచేస్తోందని నిపుణులు తెలిపారు. 

బోయి భీమన్న.. దాదాపు ముప్పయ్యేళ్ల యువ ఆదివాసీ రైతు. విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ప్రకృతి వ్యవసాయ క్లస్టర్‌లోని కుమ్మరితోము అతని స్వగ్రామం. ఐదో తరగతి వరకు చదువుకొని 2.80 ఎకరాల సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, కోవెల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ ఏడాదే 20 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో శ్రీవరి సాగుకు శ్రీకారం చుట్టారు. 
కోవెల్‌ ఫౌండేషన్‌ శ్రీవరి రైతులకు కలుపు తీత కోసం ఇనుముతో తయారు చేసిన ‘మండవ వీడర్‌’ను ఇస్తున్నారు. దీని ఖరీదు రూ. 1,500. మూడు జిల్లాల్లో 50 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కోవెల్‌ ఫౌండేషన్‌ ఈ ఏడాది కొత్త రైతులకు ఇవ్వడానికి 2 వేల వీడర్లు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే, కరోనా విలయతాండవం కారణంగా మండవ వీడర్లు ఈ ఏడాది రైతులకు ఇంకా అందలేదు. 
ఈ నేపథ్యంలో భీమన్న నాట్లు వేసి నెల రోజులైంది. కలుపుతీత సమయం దాటిపోతుండటంతో భీమన్న అవసరం కొద్దీ బుర్రకు పదును పెట్టారు. భిన్నంగా ఆలోచించారు. అంతా ఇనుముతోనే ఎక్కడో తయారైన కలుపు తీత పరికరం చేతికి వచ్చే వరకు ఎదురు చూసే కన్నా సొంతంగా చేతనైనది చేద్దామనుకున్నారు. 

శ్రీవరి సాగులో సాళ్ల మధ్య దూరం 25 సెంటీ మీటర్లు (పది అంగుళాలు) ఉంటుంది. భీమన్న 24 సెం.మీ. వెడల్పు, అడుగు చుట్టుకొలత ఉన్న గుండ్రటి పనస దుంగ సమకూర్చుకున్నారు. అరున్నర అడుగుల వెదురు బొంగును కొంత వరకూ చీల్చి దానికి చువ్వలతో బండి లాగా ముందుకు నడిపేందుకు వీలుగా బిగించారు. పనస దుంగకు అంగుళానికొకటì  చొప్పున ఇనుప మేకులు కొట్టారు భీమన్న. ఇందుకు మూడు అంగుళాల మేకులు సరిపోతాయి. ఒక అంగుళం లోపలికి దిగినా రెండు అంగుళాల పొడవైన మేకు పైకి ఉంటే సరిపోతుంది. అయితే, భీమన్న దగ్గర 6 అంగుళాల పొడవైన మేకులు మాత్రమే ఉన్నాయి. ఆ మేకులను సగానికి తెగ్గొట్టి వీడర్‌ తయారీలో వాడుకొని అనుకున్న రోజే పని పూర్తి చేయటం విశేషం! 

దుంగ(చెక్క చక్రాన్ని)ను వెదురు బొంగు సాయంతో నెట్టుకుంటూ వెళ్తుంటే.. ఈ ఇనుప మేకులు కలుపు మొక్కలను పీకేస్తూ ఉంటాయన్న మాట. వరి మొక్కల మధ్య వరుసల్లో చెక్క వీడర్‌ను ముందుకు తోసినప్పుడు దానికున్న మేకులు కలుపును మధ్యస్థంగా ముక్కలు చేస్తుంటాయి. ఆ వెంటనే చెక్క చక్రం ఆ కలుపు ముక్కలను బురదలోకి తొక్కి పెట్టి, కుళ్లేందుకు వీలుగా చేస్తుంది. 

నాటేసిన నెల రోజుల్లోనే రెండు సార్లు తన వీడర్‌తో కలుపు తీశానని భీమన్న తెలిపారు. 20 సెంట్లకు గత ఏడాది కలుపు తీత కూలి ఖర్చు రూ. వెయ్యి ఖర్చు అయితే, ఈ ఏడాది రూ. 400 కూలి అయ్యిందన్నారు. అంటే.. ఎకరానికి రూ. 3 వేలు ఖర్చు తగ్గిందన్న మాట. 
గత ఏడాది నాటేసిన నెలకు తమ పద్ధతిలో 15 పిలకలు వచ్చేవని, ఈ ఏడాది శ్రీవరిలో 35 పిలకల వరకు వచ్చాయని అంటూ.. దిగుబడి కూడా పెరుగుతుందను కుంటున్నానన్నారు. 

ఇదిలా ఉండగా.. తేలికగా ఉంటుంది కాబట్టి పనస దుంగను వీడర్‌ తయారీకి వాడానని, బరువైన తంగేడు, ఏగిశ దుంగలతో కూడా వీడర్‌ను తయారు చేస్తానని, ఏది బాగా పని చేస్తోందో చూస్తానని భీమన్న వివరించారు. రూ. 1,500లతో సుదూర మైదాన ప్రాంతంలో ఇనుముతో తయారయ్యే కలుపు తీత పరికరానికి ప్రత్యామ్నాయంగా.. భీమన్న తనకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఎంచక్కా చెక్క వీడర్‌ను తయారు చేశారు. అన్నీ కలిపి మహా అయితే రూ. 400–500కు మించి ఖర్చు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరైనా, ఎక్కడైనా, ఒక్క పూటలో దీన్ని తయారు చేసుకోవచ్చు. నిరుపేద రైతుకూ ఇది ఆర్థిక భారం కాదు. ఇదీ భీమన్న ఆవిష్కరణ విశిష్టత. ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి భీమన్నను ఫోన్‌లో పలుకరించి అభినందించింది. అయితే, భీమన్న స్వరంలో మాత్రం తానేదో చాలా గొప్ప పని చేసేశానన్న భావం ఏ కోశానా

ధ్వనించ లేదు! స్థిత ప్రజ్ఞత అంటే ఇదేనేమో!! 
(బోయి భీమన్న గ్రామంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సరిగ్గా లేదు. కోవెల్‌ ఫౌండేషన్‌ సీఈవో కృష్ణారావు ద్వారా భీమన్నను సంప్రదించవచ్చు. మొబైల్‌: 94409 76848. ఐదేళ్లుగా తాము పాడేరు ఏజన్సీలో ఆదివాసీ రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నామని, కంటెపురం గ్రామాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం బయో గ్రామంగా ప్రకటించిందని కృష్ణారావు తెలిపారు. శ్రీవరిలో దిగుబడి 30–50% పెరిగింది. ఎకరానికి రూ. 4 వేలు ఖర్చు తగ్గిందని ఆయన వివరించారు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement