tribal farmer
-
దాడి చేసి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లి
వాంకిడి (ఆసిఫాబాద్): చేనులో ఒంటరిగా పత్తి ఏరుతున్న రైతుపై పెద్దపులి పంజా విసిరింది. ఒక్కసారిగా దాడి చేసి సుమారు కిలోమీటరు దూరం వరకు లాక్కెళ్లి వదిలేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అటవీ ప్రాంతంలోని తన చేనులో పత్తి ఏరేందుకు పెద్ద కుమారుడు సిడాం అయ్యుతో కలిసి మంగళవారం వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుమారుడు భోజనానికి వెళ్లగా.. భీము ఒక్కడే పత్తి ఏరుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పులి అతడిపై దాడి చేసింది. అరుపులు విని పక్క చేనులోనే పనిచేస్తున్న కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా.. రక్తం మరకలు, మనిషిని ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వారు వెంటనే కొంత దూరంలో పోడు భూముల సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి సమాచారం అందించారు. 20 మంది వరకు సిబ్బంది చేనుకు చేరుకొని రక్తం మరకలు, పులి ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లను అనుసరిస్తూ వెతికారు. కిలోమీటరు దూరంలోని ఓ లోయలో భీము మృతదేహం లభ్యమైంది. అంతకుముందు భీము చేను సమీపంలో పశువులు మేపుతున్న ఆత్రం అన్నిగా అనే కాపరిపై పులి దాడికి యత్నించింది. అప్పుడు తన కూతురు గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుంచి పరుగులు తీయడంతో పులి వెళ్లిపోయినట్లు అన్నిగా తెలిపాడు. జిల్లా అటవీశాఖ అధికారి దినేశ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలు అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు ఎవరూ పొలం పనులకు వెళ్లొద్దని సూచించారు. పశువులపై పులుల దాడి.. దహెగాం/తలమడుగు: కుమురంభీం జిల్లాలోని దహెగాం మండలం కర్జి అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి సోమవారం రాత్రి దాడి చేసింది. లంగారి వెంకటేష్‌కు చెందిన కోడె సోమవారం మేతకు వెళ్లి తిరిగి రాకపోవడంతో మంగళవారం అడవిలో వెతకగా కళేబరం లభించింది. పులి దాడి చేసి హతమార్చినట్లు బీట్ అధికారి సుధాకర్ నిర్ధారించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన బాబన్న లేగదూడపై మంగళవారం పులి దాడి చేసి గాయపర్చింది. తాంసి కే గ్రామ శివారు పొలంలో పులి వెనుక నుంచి దాడి చేయగా లేగదూడ తప్పించుకొని గ్రామానికి చేరింది. అటవీశాఖ అధికారులు పులి దాడిగా నిర్ధారించారు. -
చెక్క వీడర్.. పక్కా లోకల్!
వరి పంట సాగులో కలుపు నియంత్రణ కోసమని దాదాపు పంట కాలం అంతా పొలంలో నీటిని నిల్వగట్టడం అలవాటుగా వస్తోంది. దీని వల్ల మిథేన్ వాయువు వెలువడి పర్యావరణపరమైన ఇబ్బందులు వస్తున్న విషయం కూడా తెలిసిందే. నీరు నిల్వగట్టినప్పటికీ రసాయనిక కలుపు మందులు వాడుతున్న వారూ లేకపోలేదు. అయితే, శ్రీవరి సాగులో నీటిని నిల్వగట్టకుండా ఆరుతడి పద్ధతిలోనే అందిస్తారు. ప్రకృతి వ్యవసాయదారులు రసాయనిక కలుపు మందులకు బదులు కూలీలతోనో, యంత్ర పరికరాలతోనో కలుపు తీస్తారు. శ్రీవరి సాగులో కలుపు తీతకు ఇనుముతో తయారైన ‘మండవ వీడర్’ను ఇన్నాళ్లూ వాడుతున్నారు. అయితే, విశాఖ ఏజన్సీలో ఓ గిరిజన రైతు తన తెలివి తేటలతో చెక్కతో సరికొత్త వీడర్‌ను తయారు చేసి మంచి ఫలితాలను పొందుతున్నారు. చిన్న పనస దుంగ, వెదురు బొంగు, గుప్పెడు మేకులతో చెక్క వీడర్‌ను తయారు చేశారు. ఒకే ఒక్క రోజులో దీన్ని తయారు చేయటం మరో విశేషం. ఇది బాగా పనిచేస్తోందని నిపుణులు తెలిపారు. బోయి భీమన్న.. దాదాపు ముప్పయ్యేళ్ల యువ ఆదివాసీ రైతు. విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ప్రకృతి వ్యవసాయ క్లస్టర్‌లోని కుమ్మరితోము అతని స్వగ్రామం. ఐదో తరగతి వరకు చదువుకొని 2.80 ఎకరాల సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, కోవెల్ ఫౌండేషన్ సహకారంతో ఈ ఏడాదే 20 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో శ్రీవరి సాగుకు శ్రీకారం చుట్టారు. ♦ కోవెల్ ఫౌండేషన్ శ్రీవరి రైతులకు కలుపు తీత కోసం ఇనుముతో తయారు చేసిన ‘మండవ వీడర్’ను ఇస్తున్నారు. దీని ఖరీదు రూ. 1,500. మూడు జిల్లాల్లో 50 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కోవెల్ ఫౌండేషన్ ఈ ఏడాది కొత్త రైతులకు ఇవ్వడానికి 2 వేల వీడర్లు ఆర్డర్ ఇచ్చింది. అయితే, కరోనా విలయతాండవం కారణంగా మండవ వీడర్లు ఈ ఏడాది రైతులకు ఇంకా అందలేదు. ♦ ఈ నేపథ్యంలో భీమన్న నాట్లు వేసి నెల రోజులైంది. కలుపుతీత సమయం దాటిపోతుండటంతో భీమన్న అవసరం కొద్దీ బుర్రకు పదును పెట్టారు. భిన్నంగా ఆలోచించారు. అంతా ఇనుముతోనే ఎక్కడో తయారైన కలుపు తీత పరికరం చేతికి వచ్చే వరకు ఎదురు చూసే కన్నా సొంతంగా చేతనైనది చేద్దామనుకున్నారు. శ్రీవరి సాగులో సాళ్ల మధ్య దూరం 25 సెంటీ మీటర్లు (పది అంగుళాలు) ఉంటుంది. భీమన్న 24 సెం.మీ. వెడల్పు, అడుగు చుట్టుకొలత ఉన్న గుండ్రటి పనస దుంగ సమకూర్చుకున్నారు. అరున్నర అడుగుల వెదురు బొంగును కొంత వరకూ చీల్చి దానికి చువ్వలతో బండి లాగా ముందుకు నడిపేందుకు వీలుగా బిగించారు. పనస దుంగకు అంగుళానికొకటì చొప్పున ఇనుప మేకులు కొట్టారు భీమన్న. ఇందుకు మూడు అంగుళాల మేకులు సరిపోతాయి. ఒక అంగుళం లోపలికి దిగినా రెండు అంగుళాల పొడవైన మేకు పైకి ఉంటే సరిపోతుంది. అయితే, భీమన్న దగ్గర 6 అంగుళాల పొడవైన మేకులు మాత్రమే ఉన్నాయి. ఆ మేకులను సగానికి తెగ్గొట్టి వీడర్ తయారీలో వాడుకొని అనుకున్న రోజే పని పూర్తి చేయటం విశేషం! దుంగ(చెక్క చక్రాన్ని)ను వెదురు బొంగు సాయంతో నెట్టుకుంటూ వెళ్తుంటే.. ఈ ఇనుప మేకులు కలుపు మొక్కలను పీకేస్తూ ఉంటాయన్న మాట. వరి మొక్కల మధ్య వరుసల్లో చెక్క వీడర్‌ను ముందుకు తోసినప్పుడు దానికున్న మేకులు కలుపును మధ్యస్థంగా ముక్కలు చేస్తుంటాయి. ఆ వెంటనే చెక్క చక్రం ఆ కలుపు ముక్కలను బురదలోకి తొక్కి పెట్టి, కుళ్లేందుకు వీలుగా చేస్తుంది. నాటేసిన నెల రోజుల్లోనే రెండు సార్లు తన వీడర్‌తో కలుపు తీశానని భీమన్న తెలిపారు. 20 సెంట్లకు గత ఏడాది కలుపు తీత కూలి ఖర్చు రూ. వెయ్యి ఖర్చు అయితే, ఈ ఏడాది రూ. 400 కూలి అయ్యిందన్నారు. అంటే.. ఎకరానికి రూ. 3 వేలు ఖర్చు తగ్గిందన్న మాట. గత ఏడాది నాటేసిన నెలకు తమ పద్ధతిలో 15 పిలకలు వచ్చేవని, ఈ ఏడాది శ్రీవరిలో 35 పిలకల వరకు వచ్చాయని అంటూ.. దిగుబడి కూడా పెరుగుతుందను కుంటున్నానన్నారు. ఇదిలా ఉండగా.. తేలికగా ఉంటుంది కాబట్టి పనస దుంగను వీడర్ తయారీకి వాడానని, బరువైన తంగేడు, ఏగిశ దుంగలతో కూడా వీడర్‌ను తయారు చేస్తానని, ఏది బాగా పని చేస్తోందో చూస్తానని భీమన్న వివరించారు. రూ. 1,500లతో సుదూర మైదాన ప్రాంతంలో ఇనుముతో తయారయ్యే కలుపు తీత పరికరానికి ప్రత్యామ్నాయంగా.. భీమన్న తనకు అందుబాటులో ఉన్న వనరులతోనే ఎంచక్కా చెక్క వీడర్‌ను తయారు చేశారు. అన్నీ కలిపి మహా అయితే రూ. 400–500కు మించి ఖర్చు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరైనా, ఎక్కడైనా, ఒక్క పూటలో దీన్ని తయారు చేసుకోవచ్చు. నిరుపేద రైతుకూ ఇది ఆర్థిక భారం కాదు. ఇదీ భీమన్న ఆవిష్కరణ విశిష్టత. ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి భీమన్నను ఫోన్లో పలుకరించి అభినందించింది. అయితే, భీమన్న స్వరంలో మాత్రం తానేదో చాలా గొప్ప పని చేసేశానన్న భావం ఏ కోశానా ధ్వనించ లేదు! స్థిత ప్రజ్ఞత అంటే ఇదేనేమో!! (బోయి భీమన్న గ్రామంలో మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేదు. కోవెల్ ఫౌండేషన్ సీఈవో కృష్ణారావు ద్వారా భీమన్నను సంప్రదించవచ్చు. మొబైల్: 94409 76848. ఐదేళ్లుగా తాము పాడేరు ఏజన్సీలో ఆదివాసీ రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నామని, కంటెపురం గ్రామాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం బయో గ్రామంగా ప్రకటించిందని కృష్ణారావు తెలిపారు. శ్రీవరిలో దిగుబడి 30–50% పెరిగింది. ఎకరానికి రూ. 4 వేలు ఖర్చు తగ్గిందని ఆయన వివరించారు.) -
భూవివాదం: గిరిజన రైతు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం సూరప్పవారంగూడెలో ఓ భూవివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం తన పొలంలో దుక్కి దున్నుకుంటున్న గిరిజన రైతు దాది గోవింద్‌పై గిరిజనేతర రైతులు దాడి చేశారు. దీంతో వారి దాడిలో గిరిజనరైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడ్డ రైతును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా ఆతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాది గోవింద్ హత్యకు నిరసనగా సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రాస్తారోకో నిర్వహించారు. హత్యకు బాధ్యులైన గిరిజనేతర రైతులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
మన్య దీపిక!
రైతులు.. అందులోనూ గిరిజనులు.. ఇక చెప్పేదేముంది! దిగుబడులు వస్తున్నాయంటే.. దళారుల పంట పండినట్లే కదా!! కానీ, రోజులన్నీ ఒకేలా ఉండవు.. కాలంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంత అమాయక గిరిజన రైతులూ ఇప్పుడు తెలివి తెచ్చుకుంటున్నారు. రసాయనాల్లేకుండా ప్రాణానికి ప్రాణంగా సాగు చేసిన తమ పంటలకు ఇప్పుడు తామే ధర నిర్ణయించుకుంటున్నారు. ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రతి ఒక్కరి తలరాతను కలసికట్టుగా తిరగరాసుకుంటున్నారు. కల్లాకపటం లేని ఆ గిరిజన రైతు కలల కంపెనీకి వెలుగుబాట చూపుతున్న మార్గదర్శి.. పడాల భూదేవి! ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైతన్య దీప్తికి ‘సాగుబడి’ నుంచి జేజేలు! కొండకోనల్లో, ప్రకృతి ఒడిలో కపటం లేని జీవించే గిరిజన రైతులు అవగాహన లేక, దారిచూపేవారు లేక, ఐక్యత లేక, దళారుల దోపిడీ వల్ల అనాదిగా పేదరికంలో మగ్గిపోతున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని హిర, సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, వీరఘట్టం మండలాల్లో రైతుల సంగతి వేరు. ఈ మండలాల్లో చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది గిరిజన రైతులు సంఘటితమై భూమి హక్కులను సాధించుకోవడం ద్వారా పేదరికాన్ని అధిగమిస్తున్నారు. ఉమ్మడి భూమి హక్కులు సాధించుకున్నారు. మెరుగైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని, స్వల్ప ఖర్చుతోనే అధికోత్పత్తి సాధిస్తున్నారు. అంతేకాదు.. నాబార్డు సహాయంతో 10 నెలల క్రితం ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్’ను ఏర్పాటు చేసుకొని తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకొని పడాల భూదేవి నేతృత్వంలో అధిక నికరాదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన నేత, తన తండ్రి దివంగత చిన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ భూదేవి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆధునిక పోకడలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకుంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే పంటకు అధికాదాయం పొందవచ్చని గిరిజన రైతులను చైతన్య పరచి ఆమె ముందుకు నడిపిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తీరు.. భూదేవి మాటల్లోనే.. ఎకరానికి 13 క్వింటాళ్ల చిరుధాన్యాల దిగుబడి గత 13 సంవత్సరాలుగా సేంద్రియ సాగు విధానాన్ని మా గిరిజన రైతులకు అలవాటు చేశాం. ఇదే క్రమంలో చిరుధాన్యాలు సాగు ప్రారంభించాం. వ్యవసాయ యాంత్రీకరణ, సాగులో ఆధునిక విధానాలు అలవాటు చేస్తున్నాం. రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను పాత పద్ధతిలో కేవలం ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే సాధించేవారు. కొత్త పద్ధతులు అలవాటు చేసిన తరువాత మొక్కలు నాటే ‘గులి’ పద్ధతిలో సాగు చేసి, ఎకరానికి 13 క్వింటాళ్ల దిగుబడి సాధించే స్థాయికి చేరుకున్నారు. సీతంపేట ఐటీడీఏ, నాబార్డు, ఆత్మ, వ్యవసాయశాఖలతో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిరుధాన్యాలు, సేంద్రియ సాగుతో లాభాల బాట పడుతున్నాం.. దాదాపు 3 వేల ఎకరాల్లో రెండు వేల మంది గిరిజన రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. ఏటా రాగి వంద టన్నులు, కొర్రలు 50, జొన్న 35, సజ్జ 25 టన్నుల వరకూ దిగుబడి వస్తోంది. సొంత విత్తనాలనే వాడుకుంటున్నారు. ఈ సంవత్సరం ఏపీ సీడ్స్ సంస్థకు 9 టన్నుల రాగి విత్తనాలు కిలో రూ.36 చొప్పున పంపిణీ చేశాం. 11 మంది డైరెక్టర్లలో ఆరుగురు మహిళలు ఈ ప్రాంతంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలను, పప్పుధాన్యాలను సాగు చేస్తున్నారు. వారి ఉత్పత్తులను దళారులకు, లేదా స్థానిక సంతల్లో వచ్చిన ధరకు అమ్మేసుకుంటూ ఉండటం వల్ల ఎంతో ఆదాయాన్ని నష్టపోతుండేవారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఏర్పాటు చేసుకున్నాక తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. ఇందులోని 11 మంది డైరెక్టర్లలో నాతో పాటు ఆరుగురం మహిళా గిరిజన రైతులమే. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ ఉత్పత్తులకు మేమే ధర నిర్ణయిస్తున్నాం. ఐటీడీఏ సమకూర్చిన గోదాములో సుమారు రూ.5–6 లక్షల ఖరీదైన ప్రాసెసింగ్ యంత్రాలను నెలకొల్పాం. కంపెనీలో సీఈవోతోపాటు పార్ట్‌టైమ్ సిబ్బంది సహా 30 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. చిరుధాన్యాల నుంచి బిస్కెట్ల వరకు.. కొర్ర బియ్యం, సామ బియ్యం, ఊద బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు.. కంది పప్పు, మినప్పప్పు, ఉలవలు, చీపుర్లు, చింతపండు.. వంటి 25 రకాల సరుకులను శుద్ధి చేసి, చక్కగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాం. శ్రీకాకుళం రైతుబజారులో, సీతానగరం ఐటీడీఏ ఆవరణలో ప్రత్యేక స్టాల్స్‌ను నిర్వహించడంతోపాటు.. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంతోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు కూడా సరుకును నేరుగా వినియోగదారులకు, దుకాణదారులకు విక్రయిస్తున్నాం. అంతకుముందు కుంచం(3 కిలోలు) సేంద్రియ కందులు రూ.90లకు రైతులే స్థానికంగా అమ్ముకునేవాళ్లు. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా రూ. 120కు బయట మార్కెట్లలో అమ్మగలిగాం. కొర్ర ధాన్యాన్ని రైతు నుంచి కిలో రూ. 40కు కొనుగోలు చేసి, శుద్ధిచేసి ప్యాకెట్లలో నింపి రిటైల్‌గా కిలో రూ. 80కు విక్రయిస్తున్నాం. గత పది నెలల్లో 325 మంది రైతులు తమ ఉత్పత్తులను రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా విక్రయించారు. ఇప్పటికి నెలకు రూ. 4 లక్షల టర్నోవర్ జరుగుతున్నది. విదేశీ మార్కెట్ల కోసం అన్వేషణ.. మా సేంద్రియ ఉత్పత్తులను మొదట మేము తింటున్నాం. ఉత్పత్తులను మా ప్రాంత హాస్టల్ పిల్లలకు, వివిధ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నాం. ఇక్కడ మార్కెట్‌కు ఇవ్వగా మిగిలే ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో అమ్మేందుకు కూడా మార్గాలను అన్వేషిస్తున్నాం. పీజీఎస్ సర్టిఫికేషన్ పొందే దశలో ఉన్నాం. అడవి తల్లి ఒడిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన మా ఉత్పత్తులను వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా కొనుగోలు చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతాం. (వివరాలకు.. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ–హిరమండలం, శ్రీకాకుళం జిల్లా– డైరెక్టర్ పడాల భూదేవి: 73820 98533, సీఈఓ కైలాస్ సాహు: 88978 65521) హాస్టళ్లకు రాగి పిండి, చిరుధాన్యాల బిస్కెట్లు.. శ్రీకాకుళం జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ కోసం ఏడాది కాలంగా నెలకు 9 టన్నుల రాగి పిండిని అందిస్తున్నారు. గిరిజన కుటుంబాల్లో వివిధ కారణాల వల్ల అనేక మంది ఒంటరి మహిళలుగా మిగిలిపోతున్నారు. వీరిలో 15 మందికి ఉపాధి కల్పించేందుకు చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాల తయారీని ప్రారంభించాం. చిరుధాన్యాల పిండితో బిస్కెట్లు, కేక్, జంతికలు, మిక్చర్, పకోడి, రాగిపిండితో అంబలి, సంగటి, అట్లు, రొట్టెలు, లడ్డూలు తయారు చేస్తున్నాం. వాటిని రైతుబజార్లతో పాటు ప్రైవేట్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. వాసన్ స్వచ్ఛంద సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక సహకారంతో చిరుధాన్యాలతో నెలకు రూ. 5 లక్షల బిస్కెట్లను తయారు చేస్తున్నాం. ఐటీడీఏ సహకారంతో రోజుకు 11 వేల బిస్కెట్లు గిరిజన విద్యార్థులకు అందిస్తున్నాం. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఫొటోలు: కుప్పిలి జయశంకర్, సాక్షి ఫొటో జర్నలిస్టు. -
గల్ఫ్ గాయం.. సాగు భారం
ఎల్లారెడ్డిపేట: ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్ వెళ్లిన గిరిజన రైతుకు అక్కడ చుక్కెదురైంది. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది. అప్పుల భారం అధిక మైంది. దీంతో మనస్తాపం చెందిన రైతు తాను నమ్ముకున్న పొలంలోనే చెట్టుకు ఉరేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాశిగుట్ట తండాకు చెందిన రైతు మాలోతు గంగారాం(48) వ్యవసా యం కుంటుపడడంతో రూ.2 లక్షలు అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనులు లేకపోవడంతో వెళ్లిన ఏడాదికి.. అప్పులు తీర్చకుండానే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలో మూడె కరాల్లో పత్తి, వరిపంటలు సాగు చేశాడు. ఇటీవల కురి సిన వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు కుమార్తెల పెళ్లిళ్లు, కుమారుడి ఆపరేషన్ కోసం మరిన్ని అప్పులు చేశాడు. పంట దిగుబడి రాకపోవడం.. గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పులు తీరకపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో కుంగి పోయిన గంగారాం పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. -
జల‘భ్రమ’
కర్నూలు(అగ్రికల్చర్): అధికారుల అలసత్వం.. సమన్వయ లోపం నిరుపేద దళిత, గిరిజన రైతులకు శాపంగా మారింది. ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన జలప్రభ పథకం నీరుగారిపోయింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద జిల్లాలో రూ.11.62 కోట్లు వ్యయం చేశారు. వెయ్యి ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయారు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. ఇటీవల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ పథకం పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీని అమలుపై ఆసక్తి చూపడం లేదు. జరగాల్సింది ఇది.. ఇందిర జలప్రభను 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆర్ఐడీఎఫ్ నిధులు రూ. 100 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మూడేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 51 వేల ఎకరాల భూములకు నీటి వసతి కల్పించాలనేది ప్రధాన లక్ష్యం. తద్వారా 20 వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి చేకూర్చాలని నిర్దేశించారు. జిల్లాలోని 50 మండలాల్లో 608 గ్రామాలలో దీనిని అమలు చేయతలపెట్టారు. 51 వేల ఎకరాల భూములను 4159 బ్లాక్‌లుగా గుర్తించారు. వీటిల్లో భూగర్భ జలాల లభ్యతపై సర్వే చేసి నీళ్లు పడతాయి అని భూగర్భ జలశాఖ ఫీజుబులిటీ ఇచ్చిన బ్లాక్‌లలో బోర్లు వేసి వాటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, మోటరు బిగించడంతో పాటు పండ్ల తోటల సాగు వరకు పనులు చేపట్టాల్సి ఉంది. జరిగింది ఇది.. లక్ష్యాలు ఈ విధంగా ఉంటే అమలులో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం చోటు చేసుకుంది. మూడేళ్లు గడుస్తున్న ఇంతవరకు గ్రౌండ్ వాటర్ సర్వే పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 41737 ఎకరాల్లోని సర్వే చేశారు. మొత్తం 1377 బోర్లు వేయగా, ఇందులో 407 బోర్లు ఫెయిల్ అయ్యాయి. 156 బోర్లలో తక్కువగా నీళ్లు పడ్డాయి. 814 బోర్లలో మాత్రం సమృద్ధిగా నీరు పడింది. ఇందులో 716 బోర్లకు ఎల్టీ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ అధికారులకు డ్వామా అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. విద్యుత్ కనెక్షన్ల కోసం గ్రామీణాభివృద్ధి శాఖ విద్యుత్ శాఖ వద్ద రూ.2.84 కోట్లు డిపాజిట్ చేసింది. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో పురోగతి లేకుండా పోయింది. ఇప్పటి వరకు కేవలం 294 బోర్లకు మాత్రమే ఇచ్చారు. ఇంకా 520 బోర్లకు ఇవ్వాల్సి ఉంది. వీటికి కనెక్షన్లు ఎప్పటికి ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. 49 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి అయ్యే వ్యయం రూ.3 లక్షలపైనే ఉండటంతో సోలార్ విద్యుత్ కోసం ప్రతిపాదనలు పంపారు. ఇవి మరుగున పడిపోయాయి. మొత్తంగా 569 బోర్ల భవితవ్యం ప్రశ్నార్థకం అయింది. ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన 294 బోర్ల కింద 14 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు డ్వామా అధికారులు లెక్కలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం. వెయ్యి ఎకరాలకు కూడా నీరు ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్న జిల్లా సదరం పవర్ గ్రిడ్ కంట్రోల్లోకి వెళ్లడంతో ఇందిర జలప్రభ పరిస్థితి, బోర్ల భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది. విద్యుత్ అధికారులు సకాలంలో సక్సెస్ అయిన బోర్లకు కనెక్షన్లు ఇచ్చి ఉంటే కొంత పురోగతి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవినీతి ఎక్కువే.. ఇందిర జలప్రభలో అవినీతి పాళ్లు కూడా ఎక్కువే. బోర్లలో నాసిరకం కేసింగ్ పైపులు వేసి నిధులను కొల్లగొట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి కేసింగ్ పైపులు వాడాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్న నాసిరకం పైపులు వాడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో బోర్లు పూడిపోయే ప్రమాదం ఉంది. బోర్ల తవ్వకంలోను తప్పుడు లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. భూగర్భ జలశాఖ అధికారులు ఎన్ని మీటర్ల లోతు బోరు వేస్తే నీరు పడుతుందో సూచిస్తారు. ఇందుకు అనుగుణంగా బోర్లు వేస్తారు. కొన్ని చోట్ల 50 నుంచి 75 మీటర్ల లోతులో నీళ్లు పడగా 120 మీటర్ల వరకు బోర్లు వేసినట్లు తప్పుడు కొలతలు సృష్టించారు. అధికారులు రిగ్ ఓనర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం.. ఇందిర జలప్రభ ఫలితాలపై విచారణ జరిపించిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
‘కాఫీ’అక్రమాలపై విచారణ
పాడేరు, న్యూస్‌లైన్: కాఫీ ప్రాజెక్టు అమలులో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి గిరిజన రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాఫీ ప్రోత్సాహక నిధులు చెల్లింపుల్లో అవినీతి ఆరోపణలపై దృష్టిసారించామన్నారు. సామాజిక తనిఖీల బృందంతో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో విచారణ పూర్తయిందన్నారు. అరకులోయలోని పద్మాపురం గార్డెన్, ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఐటీడీఏ కార్యాలయంలో వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ గిరిజనుల సంక్షేమానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖల అమలు తీరుపై ఆరా తీశారు. కాఫీ, జీసీసీ. గిరిజన విద్య, ఉపాధి హమీలో చెల్లింపులు, ప్రత్యేక చిన్ననీటి పారుదల శాఖ ద్వారా అమలవుతున్న అన్ని కార్యక్రమాలపై సమీక్షించారు. గిరిజనులకు వైద్యసేవలపై డీఎంహెచ్‌వో శ్యామల, ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారి, జిల్లా మలేరియా అధికారి ప్రసాద్రావులతో మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణకు ఏజెన్సీ వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల వివరాలను సేకరించారు. ఎపిడమిక్ దృష్ట్యా అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. రెండేళ్లుగా మలేరియా తగ్గుముఖంపై సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల తండాల్లోనూ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితులున్నందున ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. దోమల నివారణ మందు రెండో విడత పిచికారీ వేగవంతం చేయాలన్నారు. మాతశిశు ఆరోగ్య కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. కాఫీ సాగు లక్ష్యాలను అధిగమించాలి ఏజెన్సీలో కాఫీ సాగు లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సిల్వర్‌ఓక్, కాఫీ నర్సరీల వివరాలను తెలుసుకున్నారు. మన్యంలో సాగవుతున్న కాఫీ పంటల రకాలు, అంతరపంటలు,దిగుబడులు,అమ్మకాలతో రైతులకు వచ్చే గిట్టుబాటు ధరలపై సమీక్షించారు. గత రెండేళ్లలో అమలు చేసిన కాఫీ ప్రాజెక్టు ప్రగతి నివేదికలను తనకు వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఏజెన్సీలోని కాఫీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, సామాజిక తనిఖీల వివరాలను సమీక్షించారు. ఏజెన్సీలోని ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఉపాధిహామీలో నిర్మించిన రోడ్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామాల్లో రహదారుల తీరును సమీక్షించారు. గిరిజన విద్యా కార్యక్రమాలను కూడా తెలుసుకున్నారు. హాస్టళ్లలో సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, అమలవుతున్న మెనూపై గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డిని ఆరా తీశారు. మన్యంలోని అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పాడేరు ఆర్డీవో ఎం. గణపతిరావు, ఐటీడీఏ ఏపీవో పీవీఎస్నాయుడు, గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, టీడబ్ల్యూ, పీఆర్ ఈఈలు ఎం.ఆర్.జె. నాయుడు, బి అప్పలనాయుడు, ఎస్ఎంఐ ఈఈ మల్లికార్జున రావు, పాడేరు క్లస్టర్ ఎస్పీహెచ్వో డాక్టర్ లీలాప్రసాద్, కాఫీ ఏడీ జి.రామ్మోహన్రావు పాల్గొన్నారు. పాడేరు వచ్చి పదేళ్లు.. తాను పాడేరు వచ్చి పదేళ్లు అయిందని, మరోసారి గిరిజనసంక్షేమానికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. అప్పటి రోజులతో పోల్చుకుంటే గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అధికమయ్యాయన్నారు. మారుమూల ప్రాంతాలకు రోడ్లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కమ్యూనికేషన్ పరంగా కూడా ఏజెన్సీలో మార్పు వచ్చిందన్నారు.