కర్నూలు(అగ్రికల్చర్): అధికారుల అలసత్వం.. సమన్వయ లోపం నిరుపేద దళిత, గిరిజన రైతులకు శాపంగా మారింది. ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన జలప్రభ పథకం నీరుగారిపోయింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద జిల్లాలో రూ.11.62 కోట్లు వ్యయం చేశారు. వెయ్యి ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయారు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. ఇటీవల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ పథకం పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీని అమలుపై ఆసక్తి చూపడం లేదు.
జరగాల్సింది ఇది.. ఇందిర జలప్రభను 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆర్‌ఐడీఎఫ్ నిధులు రూ. 100 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మూడేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 51 వేల ఎకరాల భూములకు నీటి వసతి కల్పించాలనేది ప్రధాన లక్ష్యం. తద్వారా 20 వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి చేకూర్చాలని నిర్దేశించారు. జిల్లాలోని 50 మండలాల్లో 608 గ్రామాలలో దీనిని అమలు చేయతలపెట్టారు. 51 వేల ఎకరాల భూములను 4159 బ్లాక్‌లుగా గుర్తించారు. వీటిల్లో భూగర్భ జలాల లభ్యతపై సర్వే చేసి నీళ్లు పడతాయి అని భూగర్భ జలశాఖ ఫీజుబులిటీ ఇచ్చిన బ్లాక్‌లలో బోర్లు వేసి వాటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, మోటరు బిగించడంతో పాటు పండ్ల తోటల సాగు వరకు పనులు చేపట్టాల్సి ఉంది.
జరిగింది ఇది..
లక్ష్యాలు ఈ విధంగా ఉంటే అమలులో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం చోటు చేసుకుంది. మూడేళ్లు గడుస్తున్న ఇంతవరకు గ్రౌండ్ వాటర్ సర్వే పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 41737 ఎకరాల్లోని సర్వే చేశారు. మొత్తం 1377 బోర్లు వేయగా, ఇందులో 407 బోర్లు ఫెయిల్ అయ్యాయి. 156 బోర్లలో తక్కువగా నీళ్లు పడ్డాయి. 814 బోర్లలో మాత్రం సమృద్ధిగా నీరు పడింది. ఇందులో 716 బోర్లకు ఎల్‌టీ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ అధికారులకు డ్వామా అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. విద్యుత్ కనెక్షన్ల కోసం గ్రామీణాభివృద్ధి శాఖ విద్యుత్ శాఖ వద్ద రూ.2.84 కోట్లు డిపాజిట్ చేసింది. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో పురోగతి లేకుండా పోయింది. ఇప్పటి వరకు కేవలం 294 బోర్లకు మాత్రమే ఇచ్చారు.
ఇంకా 520 బోర్లకు ఇవ్వాల్సి ఉంది. వీటికి కనెక్షన్లు ఎప్పటికి ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. 49 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి అయ్యే వ్యయం రూ.3 లక్షలపైనే ఉండటంతో సోలార్ విద్యుత్ కోసం ప్రతిపాదనలు పంపారు. ఇవి మరుగున పడిపోయాయి. మొత్తంగా 569 బోర్ల భవితవ్యం ప్రశ్నార్థకం అయింది. ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన 294 బోర్ల కింద 14 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు డ్వామా అధికారులు లెక్కలు చెబుతున్నారు.
వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం. వెయ్యి ఎకరాలకు కూడా నీరు ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్న జిల్లా సదరం పవర్ గ్రిడ్ కంట్రోల్‌లోకి వెళ్లడంతో ఇందిర జలప్రభ పరిస్థితి, బోర్ల భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది. విద్యుత్ అధికారులు సకాలంలో సక్సెస్ అయిన బోర్లకు కనెక్షన్లు ఇచ్చి ఉంటే కొంత పురోగతి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అవినీతి ఎక్కువే..
ఇందిర జలప్రభలో అవినీతి పాళ్లు కూడా ఎక్కువే. బోర్లలో నాసిరకం కేసింగ్ పైపులు వేసి నిధులను కొల్లగొట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి కేసింగ్ పైపులు వాడాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్న నాసిరకం పైపులు వాడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో బోర్లు పూడిపోయే ప్రమాదం ఉంది. బోర్ల తవ్వకంలోను తప్పుడు లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. భూగర్భ జలశాఖ అధికారులు ఎన్ని మీటర్ల లోతు బోరు వేస్తే నీరు పడుతుందో సూచిస్తారు.
ఇందుకు అనుగుణంగా బోర్లు వేస్తారు. కొన్ని చోట్ల 50 నుంచి 75 మీటర్ల లోతులో నీళ్లు పడగా 120 మీటర్ల వరకు బోర్లు వేసినట్లు తప్పుడు కొలతలు సృష్టించారు. అధికారులు రిగ్ ఓనర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం.. ఇందిర జలప్రభ ఫలితాలపై విచారణ జరిపించిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జల‘భ్రమ’
Published Fri, Aug 22 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement