మన్యంలో మాతృవేదన | Mother's agony in manyam | Sakshi
Sakshi News home page

మన్యంలో మాతృవేదన

Published Sun, Jul 5 2015 11:22 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

మన్యంలో  మాతృవేదన - Sakshi

మన్యంలో మాతృవేదన

మాతా, శిశువుల ప్రాణాలకు గ్యారంటీ లేదు
కాన్పు కష్టమైతే అంతే సంగతి
ఏజెన్సీలో కుంటుపడిన గైనిక్ సేవలు

 
 
శై‘శవ’ గీతి మన్యంలో మార్మోగుతోంది. మాతాశిశు మరణాలకు అంతులేకుండా పోతోంది. పోషకాహార లోపాలకు రక్తహీనత తోడై మారుమూల గూడేల్లో చావుడప్పు ఆగకుండా మోగుతోంది. పిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం ఐసీడీఎస్ ఉండీ ఉద్ధరించిందేమన్న వాదన వ్యక్తమవుతోంది. ఏటా మాతాశిశు  మరణాలు వందల్లో ఉంటే అధికారులు మాత్రం వీటిని తగ్గించి  చూపిస్తున్నారు. అంతా బాగానే ఉందని బాకా ఊదేస్తున్నారు.  ఇలా తక్కువ చేసి చూపించడంతో ఉన్నతస్థాయి వర్గాల్లో   అంతా బాగానే ఉందనిపిస్తోంది. పరోక్షంగా గిరిజనుల ఆరోగ్యం   ప్రమాదంలో పడుతోంది. చింతపల్లి, పాడేరుల్లో ఉన్న న్యూబార్న్   స్టెబిలైజేషన్ యూనిట్లతో ఒరిగిందేమీ లేకుండాపోతోంది.
 
పాడేరు :  ఏజెన్సీలోని  ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలు మృగ్యమయ్యాయి. కాన్పు కష్టమైతే పూర్తి స్థాయిలో వైద్య సేవలు వీటిల్లో అందడం లేదు. ఇలాంటప్పుడే మాతా, శిశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏజెన్సీ ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్‌లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి సమావేశంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు మాతా,శిశు మరణాలను నిరోధించాలని పేర్కొంటున్నారు. అది కంఠశోషగానే మిగులుతోంది. గతేడాది ఏజెన్సీలో ప్రవస సమయంలో 34 మంది తల్లులు, 472 మంది శిశువులు చనిపోయినట్టు అధికారుల రికార్డులే పేర్కొంటున్నాయి. ఈ ఏడాది 9 మంది తల్లులు, 104 మంది శిశువులు చనిపోయారు. పాడేరు, చింతపల్లి, అరకు ఏరియా  ఆస్పత్రులకు మాత్రమే గైనకాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఏళ్లతరబడి అవి భర్తీకావడం లేదు. ఎప్పుడైనా ప్రసూతి సమస్యలు తీవ్రమైనప్పుడు తాత్కాలికంగా గైనకాలజిస్ట్‌ను నియమిస్తున్నారు. వారి సేవలు కొన్ని రోజులకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం పాడేర ఆస్పత్రిలో పీజీ గైనకాలజిస్ట్‌గా ఉన్నారు. సుఖ ప్రసవం అయితే ఫర్వాలేదు. లేదంటే అత్యవసర సమయాల్లో ఉన్నత వైద్యసేవల కోసం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించాల్సిన దుస్థితి. ఆదివాసీలకు రోగాలతోపాటు తిండి కూడా ప్రధాన సమస్య.

ఏజెన్సీలో ఇది ఎక్కువ. వ్యవసాయంలో ఎంతో కొంత ప్రవేశం ఉన్న తెగల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా..పూర్తిగా ఆహారం సేకరణపై ఆధారపడే భగత, కోందు, గదబ, కోయ జాతుల పరిస్థితి దయనీయం. చిన్న వయస్సుల్లో పెళ్లిల్ల వల్ల మన్యంలో మాతృమూర్తులు అంత్యంత బలహీనంగా ఉంటున్నారు. శారీరక ఎదుగుదల లేకుండానే యువతులు ప్రసవిస్తున్నారు. ఫలితంగా తల్లీబిడ్డల ఆరోగ్యం కొడిగట్టిన దీపమవుతోంది. పౌష్టికాహారం నివారణకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.
 
 
హెల్త్ ఎమర్జెన్సీ  ప్రకటించాలి
 మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీ  ప్రకటించాలని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  డిమాండ్ చేశారు. ఏజెన్సీ 11 మండలాల్లోనూ గిరిజనులు వ్యాధుల బారినపడి అల్లాడిపోతున్నారన్నారు. దీనిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నదని ఆరోపించారు. ఎక్కడా పూర్తి స్థాయిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదన్నారు. వైద్య,ఆరోగ్యశాఖ మాతాశిశు మరణాలను నియంత్రించలేకపోతోందన్నారు. మలేరియా విజృభింస్తున్నదని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement