ఇక రోజూ గుడ్డు
⇒ గర్భిణులు, బాలింతలు, శిశువులకు
⇒ 15 నుంచి అమలు కానున్న ‘వన్ ఫుల్ మీల్’ పథకం
⇒ మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
⇒ క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పని చేయాలి
⇒ ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట సూచన
ఇందూరు : మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం ద్వారా ‘వన్ ఫుల్ మీల్’ను ప్రవేశ పెడుతున్నా మని ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. నిర్లక్ష్యం చేయకుం డా క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని సీడీపీఓలు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. సోమవారం జడ్‌పీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు లక్షల, కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా ఐసీడీఎస్ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదన్నారు. మొన్నటి వరకు జిల్లాలోని పది ప్రాజెక్టులలో ఆరింట ‘అమృతహస్తం’ అమలైందని, ఇకపై అన్ని ప్రాజెక్టులలో అమలవుతుందన్నారు.
దీనిని పకడ్బందీగా చేపట్టేలా అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గతంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నెలలో 25 రోజులు మాత్రమే గుడ్లు అందజేసేవారని, ప్రస్తుతం పౌష్టికాహార పరిమాణం పెరిగిందన్నా రు. రోజూ గుడ్డుతోపాటు బాలింతలు, గర్భిణులకు 200 మిల్లీలీటర్ల పాలు కూడా ఇస్తామన్నారు. వీటికోసం అంగన్ వాడీ కార్యకర్తల ఖాతాలోకే నేరుగా ముందస్తు నిధులను జమచేస్తామని చెప్పారు.
శిశువులు మూడు కిలోల బరువుతో, రక్తహీనత లేకుం డా జన్మించేలా చూడాలని సూచించారు. సూపర్‌వైజర్లు గ్రామాలను సందర్శించి, కమిటీలను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త కార్యక్రమం అమలు తీరును నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఆర్‌జేడీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వన్ ఫుల్ మీల్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు.
గ్రేడింగ్ విధానంతో పని తీరు పరిశీలన
ఇక ముందు అంగన్‌వాడీల పనితీరును మెరుగు పరచడానికి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు, కార్యకర్తల పనితీరు మెరుగుపడటమే కాకుండా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందన్నారు. ప్రతీ కార్యకర్త అంగన్‌వాడీ కేంద్రంలో ఆరు నుంచి ఏడు గంటల సేపు పిల్లలతో గడపాలని, పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు.
గర్భిణులకు పౌష్టికాహారం సమృద్ధిగా అంది స్తే బిడ్డలు మూడు కిలోల బరువుకు తగ్గకుండా పుడతారన్నారు. ఈ నెల 15 నుంచి అమలయ్యే ‘వన్ ఫుల్ మీల్’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, స్వరూ పా న్ని హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు.