ఐసీడీఎస్‌లో ‘ఎగ్’ యాప్
ఐసీడీఎస్‌లో ‘ఎగ్’ యాప్
Published Fri, Nov 11 2016 12:58 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM
ఎగ్ యాప్ ,ఐసీడీఎస్ , అంగన్‌వాడీ కేంద్రాలు
అంగన్‌వాడీ కేంద్రాలకు పారదర్శకంగా గుడ్ల పంపిణీ
అవకతవకలకు కళ్లెం వేసేలా సాంకేతిక పరిజ్ఞానం
డిమాండ్, సరఫరాపై నిరంతర నిఘా
కొత్త టెక్నాలజీ
ఈ నెల నుంచే వినియోగంలోకి..
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిఘా కట్టుదిట్టం చేసింది. పిల్లలకిచ్చే గుడ్లు కొన్నిచోట్ల దారిమళ్లుతున్నాయని భావించిన ఆ శాఖ... ప్రతి గుడ్డుకు లెక్కగట్టాలని నిర్ణరుుంచింది. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా తీరుతెన్నులను నిరంతరం పరిశీలించేలా సరికొత్తగా ‘ఎగ్’యాప్‌ను రూపొందించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో నిల్వల పరిస్థితి ఎప్పటికప్పుడు స్పష్టమవడంతో పాటు గుడ్ల డిమాండ్ సైతం తెరపై కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించిన యంత్రాంగం... తాజాగా సరఫరాదారులకు సైతం శిక్షణ ఇచ్చింది.
కేంద్రాలకు గుడ్ల సరఫరా ఇలా...
అంగన్‌వాడీ కేంద్రాల వారీగా పిల్లల సంఖ్య ఇప్పటికే ఆన్‌లైన్లో అప్‌డేట్ చేశారు. అంతేకాకుండా ఆయా సెంటర్ల పరిధిలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద పౌష్టికాహార పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. దీంతో ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించి గుడ్ల డిమాండ్ ఎప్పటికప్పుడు యాప్‌లో స్పష్టమవుతుంది. ఈ మేరకు సరఫరాదారులు గుడ్ల స్టాకును తన పరిధిలోని కేంద్రాలకు చేరవేయాలి. స్టాకును అంగన్‌వాడీ కేంద్రంలో అప్పగించిన వెంటనే సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్త నుంచి ఒన్‌టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ)ను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఇందుకు సంబంధించి అంగన్‌వాడీ కార్యకర్త మొబైల్ ఫోన్‌కు ఓటీపీని కేంద్ర సర్వర్ నుంచి సంక్షిప్త సమాచారం ద్వారా పంపిస్తారు. అలా ఓటీపీ నమోదు చేసిన వెంటనే స్టాకు సరఫరా చేసినట్లు యాప్‌లో తెలుస్తుంది. ఈ వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయంతో పాటు సీడీపీవోలకు సైతం అందుతాయి. సరఫరాను బట్టి డీలర్లకు బిల్లులు చెల్లించేందుకు అధికారులు ప్రొసీడింగ్‌లు తయారు చేస్తారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, సీడీపీవోలు, కాంట్రాక్టర్ల సెల్‌ఫోన్లలో ఇప్పటికే యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారు. సరికొత్తగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల గుడ్ల సరఫరాలో కొంత జాప్యం జరిగింది. మెజార్టీ కేంద్రాల్లో గతనెలకు సంబంధించి గుడ్ల నిల్వలుండటంతో వాటిని సర్దుబాటు చేశారు.
Advertisement
Advertisement