మన చిన్నారులు హెల్దీయే
షరతులు వర్తిస్తాయి..!
దశాబ్దం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో చిన్నారులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారట. కానీ ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం ఇప్పటికీ మనదేశం వెనుకబడే ఉందట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–2015–16 పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2005–06 తర్వాత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదికను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం.. దేశంలో శిశు మరణాల రేటు గత దశాబ్ద కాలంలో 16 పాయింట్లు తగ్గింది. దశాబ్దం క్రితం ప్రతి వెయ్యి జననాల్లో ఏడాదిలోపు శిశు మరణాల సంఖ్య 57గా నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 41కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గింది.
2005–06 మధ్య కాలంలో ప్రతి వెయ్యి జననాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు 74 మంది మరణించగా.. ప్రస్తుతం అది 24 పాయింట్లు తగ్గి 50కి దిగివచ్చింది. ఇంకా అనేక అంశాల్లో మనదేశ చిన్నారులు గతంతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అయితే శిశు మరణాల రేటు విషయంలో పొరుగునే ఉన్న పేద దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌తో పోలిస్తే మనం ఇంకా చాలా వెనుకబడే ఉన్నామని పేర్కొంది. మనదేశంలో ఏడాదిలోపు శిశు మరణాల రేటు 41 కాగా.. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌లో 31, నేపాల్‌లో 29, ఆఫ్రికా దేశాలైన రువాండా 31, బోత్సవానా 35 పాయింట్లతో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్(66) మాత్రం మనకంటే వెనుక ఉంది. ఇక ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు మన దేశంలో 50 అయితే నేపాల్(36), బంగ్లాదేశ్(38), భూటాన్(33) మనకంటే చాలా ముందున్నాయి. కాగా, 23 ఏళ్ల క్రితంతో పోలిస్తే దేశంలో శిశు మరణాల రేటు 48 శాతం తగ్గింది. 1992–93లో శిశు మరణాల రేటు 79 కాగా, 2015–16 నాటికి అది 41కి తగ్గింది. అయితే ఐక్య రాజ్యసమితి 2015లో శిశు మరణాల రేటుపై నిర్ధేశించిన మిలీనియం డెవలప్‌మెంట్ గోల్ 27 పాయింట్ల కంటే ఇది చాలా దూరంలో ఉండటం గమనార్హం.
రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు
శిశు మరణాల రేటులో రాష్ట్రాల మధ్య కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్టు తేలింది. ఛత్తీస్‌గఢ్(54)లో అత్యధికంగా ఏడాదిలోపు శిశు మరణాల రేటు నమోదు కాగా.. మధ్యప్రదేశ్(65) ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటుతో ముందుంది. ఇదే సమయంలో ఏడాదిలోపు, ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు కేరళలో తక్కువగా నమోదయ్యింది. మిజోరాంలో మాత్రం 2005–06లో ఏడాదిలోపు చిన్నారుల్లో వెయ్యి జననాలకు 34 మరణాలు నమోదు కాగా.. 2015–16 నాటికి అది 40గా రికార్డయ్యింది.