అడవి ‘తల్లి’కి ఆలంబన | Mother and infant mortality prevention is the target of state govt | Sakshi
Sakshi News home page

అడవి ‘తల్లి’కి ఆలంబన

Published Thu, Oct 31 2019 5:46 AM | Last Updated on Thu, Oct 31 2019 5:46 AM

Mother and infant mortality prevention is the target of state govt  - Sakshi

డోలిలో గర్భిణీని మోసుకోస్తున్న దృశ్యం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రజలు నిత్యం నరకం అనుభవించేవారు. గిరిజన స్త్రీలు గర్భందాల్చితే వారిని అత్యవసర వైద్యానికి ‘డోలీ’ కట్టి కొండలు, గుట్టల మీదుగా మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉండేది. జిల్లాలో గత మూడేళ్లలో 60 మంది తల్లులు, 673 మంది శిశువుల మరణాలు సంభవించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో గిరిశిఖర గర్భిణుల ప్రాణాలకు పూర్తి భరోసా లభిస్తోంది.  

పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పని చేసిన లక్ష్మీషా గతేడాది కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గిరిజన గర్భిణుల కోసం సాలూరులో ప్రత్యేక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణులను ఈ కేంద్రానికి తరలించి, అవసరమైన వైద్యం, పౌష్టికాహారం అందించటంతో పాటు ప్రసవం కూడా ఇక్కడే జరిగేలా వసతులు ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని మిగతా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల కోసం వసతి కేంద్రాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వసతి కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ సూచించడం గమనార్హం. 

అంకురార్పణ జరిగిందిలా.. 
సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధిలోని సిరివర గ్రామంలో కొండతామర గిందె అనే మహిళకు పుట్టిన బిడ్డ మరణించడం, ఆ బాలింతను డోలిలో గ్రామస్తులు తీసుకురావడంపై 2018 జూలై 31న ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘జోరువానలో 12 కిలోమీటర్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కథనంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. దీన్ని సుమోటో ఫిర్యాదుగా స్వీకరించి, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టర్‌ ఎం. హరిజవహర్‌లాల్‌ సూచనలతో అప్పటి పార్వతీపురం ఐటీ డీఏ పీఓ లక్ష్మీషా 2018 ఆగస్టు 2న కాలినడకన అటవీమార్గం గుండా సిరివర గ్రామానికి వెళ్లారు. మాతా, శిశుమరణాలు సంభవించకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
వసతి గృహంలో యోగా చేస్తున్న గర్భిణీలు   

ముఖ్యమంత్రి చొరవతో విస్తరిస్తున్న సేవలు 
ప్రసవ సమయానికి నెలన్నర, రెండు నెలలు ముందు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గర్భిణులకు తగిన రక్షణ, వైద్యం కల్పించాలని లక్ష్మీషా భావించారు. 2018 సెప్టెంబరు 17న సాలూరులో ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటిదాకా 291 మంది చేరారు. వీరిలో 250 మందికి సుఖ ప్రసవం జరిగింది. ప్రస్తుతం 41 మంది గర్భిణులు వసతి పొందుతున్నారు. సాలూరు వసతి కేంద్రం సత్ఫలితాలు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భం అరకులో మరో వసతి కేంద్రాన్ని ప్రారంభించారు. పాడేరు, చింతపల్లికి కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

నేడు వసతి కేంద్రాన్ని సందర్శించనున్న గవర్నర్‌ 
విజయనగరం జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా సాలూరులోని గర్భిణుల వసతి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక్కడ గర్భిణులకు అందుతున్న సేవలను గవర్నర్‌ స్వయంగా పరిశీలించనున్నారు.  

గర్భిణులకు సకల వసతులు 
గర్భిణులకు పురిటి నొప్పులు ప్రారంభం కాగానే సాలూరు సీహెచ్‌సీకి నిమిషాల వ్యవధిలోనే తరలించే ఏర్పాట్లు చేశారు. దీనికోసం అంబులెన్స్‌ ఉంది. వసతి కేంద్రంలో గర్భిణులకు సమయానికి పౌష్టికాహారం అందుతుంది. ఉదయం పాలు, గుడ్లు, కిచిడి, లెమన్‌ రైస్‌.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాగిజావ, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం (ఆదివారం, బుధవారం మాంసాహారం), సాయంత్రం వేరుశనగ చక్కిలు, నువ్వుల చక్కిలు, పండ్లు, రాత్రి భోజనం అందజేస్తున్నారు. పరీక్షల కోసం వైద్య సిబ్బందిని నియమించారు. ఉదయం గర్భిణులతో యోగా చేయిస్తున్నారు. వినోదం కోసం టీవీ ఉంది. చీరలపై ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్, కుట్లు, అల్లికలు వంటివి  నేర్పిస్తున్నారు. గర్భిణులకు ఇంతకుముందే పిల్లలు ఉంటే, వారిని వసతి కేంద్రంలో తమతో పాటే ఉండనివ్వొచ్చు. 

వసతి కేంద్రం చాలా సౌకర్యంగా ఉంది
‘‘నేను 13 రోజులుగా సాలూరు వసతి కేంద్రంలో ఉంటున్నాను. ఇంటి వద్ద కంటే ఇక్కడే చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ సమయానికి అన్ని రకాల పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు’’ 
– సీదరపు నర్సమ్మ, గర్భిణి, బొడ్డపాడు, జిల్లేడువలస గ్రామం, సాలూరు మండలం 

ఇక్కడ ఉంటే భయం లేదు 
‘‘మా గిరిజన గ్రామాల్లో పురుడు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరైన రోడ్డు లేకపోవడంతో, పురిటి నొప్పులు వస్తే  సమయానికి ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. వసతి కేంద్రంలో ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా పోయింది. తరచూ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయానికి మంచి ఆహారం అందిస్తూ గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నారు’’ 
– పేటూరి కాంతమ్మ, గర్భిణి, ఊబిగుడ్డి, కేసలి పంచాయతీ, పాచిపెంట మండలం 

తల్లీబిడ్డల ప్రాణాలు పోకూడదనే...  
‘‘గిరిజన గ్రామాల్లోని గర్భిణులు పురిటి సమయంలో తరుచూ ఇబ్బందులు పడడం, మాతా శిశుమరణాలు నమోదవుతుండడం చాలా భాద కలిగించేది.  ప్రసవ సమమంలో తల్లీ బిడ్డల ప్రాణాలు పోకూడదన్న లక్ష్యంతో గర్భిణుల కోసం సాలూరులో వసతి కేంద్రం ఏర్పాటు చేశాం’’ 
– డా.జి.లక్ష్మీషా, గిరిశిఖర గర్భిణుల వసతి కేంద్రం రూపకర్త 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement