విధానాలు మారకపోతే అధోగతే | Economic Studies Institute Studied conditions of people in 2015 in AP | Sakshi
Sakshi News home page

విధానాలు మారకపోతే అధోగతే

Published Sat, Feb 4 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

విధానాలు మారకపోతే అధోగతే

విధానాలు మారకపోతే అధోగతే

రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారుతుండటంపై సెస్‌ ఆందోళన

♦ ఇప్పటికీ వెనుకబాటులోనే పలు జిల్లాలు
♦ వేధిస్తున్న విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కొరత
♦ నిధుల కేటాయింపులో వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యత లేదు
♦ ప్రభుత్వం ఇప్పటి విధానాలను మారిస్తేనే మెరుగైన ఫలితాలు
♦ ఏపీలో 2015లో ప్రజల స్థితిగతులపై ‘సెస్‌’ అధ్యయనం
♦ మానవాభివృద్ధి సూచిలో అట్టడుగు స్థానాల్లో విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం, అనంతపురం
♦ వైఎస్‌ హయాంలో చేపట్టిన చర్యలవల్ల ప్రమాణాలు మెరుగుపడ్డాయి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారుతుండటం పట్ల సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ(సెస్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలను ఇలాగే కొనసాగిస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో ఏమాత్రం మార్పు వచ్చే అవకాశాలు లేవని తేల్చిచెప్పింది. పాత విధానాలను సమూలంగా మార్చుకొని, నూతన విధానాలను చిత్తశుద్ధితో అమలు చేస్తేనే పరిస్థితులు మెరుగవు తాయని స్పష్టం చేసింది. విద్య, వైద్యంతోపాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలని సూచించింది. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వారి జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో మెరుగు పడతాయని పేర్కొంది. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల స్థితిగతులపై ‘సెస్‌’ అధ్యయనం చేసింది.

ఈ అధ్యయనం ఫలితాలతో ఒక నివేదికను రూపొందించింది. జాతీయ మానవాభివృద్ధి సూచి(హెచ్‌డీఐ)లో ఆంధ్రప్రదేశ్‌ స్థానం దిగజారిందని తేల్చింది. రాష్ట్రంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు మినహా మిగతా జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని ‘సెస్‌’ నివేదిక తేల్చి చెప్పింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? వాటిని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సెస్‌’ అధ్యయనం చేసింది. నిధుల కేటాయింపులో వెనుకబడిన జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని సూచించింది. మెరుగ్గా ఉన్న జిల్లాలకు కేటాయించిన నిధులను ప్రాధాన్యత రంగాల్లో ఖర్చు చేసి, దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలపాలని పేర్కొంది.

నెల్లూరు.. ఐదు నుంచి మూడోస్థానానికి..
నెలవారీగా తలసరి వ్యయం, శిశు మరణాలు, 15 ఏళ్లలోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాఠశాలల్లో ఉండటం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని మానవాభివృద్ధి సూచిని ‘సెస్‌’ లెక్కగట్టింది. విద్య, వైద్యం, తలసరి వ్యయం, కనీస మౌలిక సదుపాయాలు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెరుగ్గా ఉన్నట్లు తేల్చింది. 2015లో మానవాభివృద్ధి సూచిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు వెల్లడించింది. గతంలో ఐదో స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లాలో పరిస్థితులు మెరుగుపడి, మూడో స్థానానికి చేరడం ఒక్కటే సానుకూలమైన అంశమని పేర్కొంది. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరిస్థితులు మరింత దిగజారడం.. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారడం ప్రతికూలమని తేల్చిచెప్పింది.

‘సెస్‌’ సూచనలు  
మానవాభివృద్ధి సూచిలో కాస్త మెరుగ్గా ఉన్న ఆరు జిల్లాల్లో పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జిల్లాలను దేశంలో అగ్రగామిగా నిలపడానికి చర్యలు తీసుకోవాలని ‘సెస్‌’ సూచించింది. సెస్‌ సూచనలు..
► అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయాలి.
► తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు నిధుల కేటాయింపులో ప్రాధన్యం ఇచ్చి.. వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి.
► మానవాభివృద్ధి సూచిలో మెరుగ్గా ఉన్న కృష్ణ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలను దేశంలో అగ్రగామి జిల్లాల సరసన చేర్చడానికి ప్రణాళికలు రచించాలి.
► ఆర్థిక అసమానతలు తగ్గించేలా నిధులను ఖర్చు చేయాలి.
► ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడే పథకాలను రూపొందించి, అమలు చేయాలి.
► పౌష్టికాహారం, మెరుగైన వైద్య సహాయం, కనీస మౌలిక సదుపాయాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.
► విద్యా రంగాన్ని మెరుగుపర్చాలి. 15 ఏళ్లలోపు పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకునేలా చర్యలు తీసుకోవాలి.

టాప్‌ 10 నుంచి ఏపీ గల్లంతు
ఉమ్మడి రాష్ట్రంలో 1995 ఆగస్టు నుంచి నుంచి 2004 మే వరకూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పట్లో రాష్ట్రంలోని పరిస్థితులపై సెస్‌ అధ్యయనం చేసి 2005లో నివేదిక ఇచ్చింది. దేశంలో 2004–05లో మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి పరిమితమైనట్లు పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన చర్యల వల్ల 2005–10 మధ్య కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దేశంలో 2011–12 మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదో స్థానానికి చేరినట్లు ‘సెస్‌’ తన నివేదికలో పేర్కొంది. మానవాభివృద్ధి సూచిలో టాప్‌ 10లో ఆంధ్రప్రదేశ్‌ చేరడం అదే ప్రథమం. 2015లో ‘సెస్‌’ అధ్యయనంలో దేశంలో మానవాభివృద్ధి సూచిలో కేరళ, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. కానీ, ఏపీ స్థానం టాప్‌ 10 నుంచి గల్లంతైంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీ ఏ స్థానంలో నిలిచిందన్నది సెస్‌ నివేదికలో వెల్లడించకపోవడం గమనార్హం.

పౌష్టికాహార లోపం తీవ్రం
అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉన్నట్లు ‘సెస్‌’ తేల్చింది. ఎక్కువ శాతం మంది పిల్లలు ఎనీమియా(రక్తహీనత)తో బాధపడుతున్నారని వెల్లడించింది. మాతా, శిశు మరణాల రేటు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. పరిశుభ్రమైన తాగునీరు ప్రజలకు అందుబాటులో లేదని తెలిపింది. అవసరమైన మేరకు వైద్య సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు అధిక శాతం ఖర్చును వైద్యం కోసమే చేస్తున్నారని వివరించింది.

విద్యారంగం తీసికట్టు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏమాత్రం మెరుగ్గా లేవని ‘సెస్‌’ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపుతూ విద్య కోసం అధికంగా సొమ్మును ఖర్చు చేస్తున్నారని తెలిపింది. అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు వైఎస్సార్, ప్రకాశం, విశాఖ, గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ విద్య కోసం నిధులను ఎక్కువగా ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని వెల్లడించింది.

ఇప్పటికీ బాల్య వివాహాలు
మానవాభివృద్ధి సూచిలో అగ్రభాగాన నిలిచిన కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని సెస్‌ గుర్తించింది. అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ బాల్య వివాహాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. తక్కువ తలసరి ఆదాయం, అక్షరాస్యత మెరుగుపడక పోవడమే బాల్య వివాహాలకు కారణమని తెలియజేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగతున్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement