నిజామాబాద్ అర్బన్ : వ్యాధి నిరోధక శక్తి పెంచి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా శిశువులకు అందించే టీకాల పట్టికలో మరో కొత్త వ్యాక్సిన్ చేరనుంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి బుధ, శనివారాల్లో సుమారు ఎనిమిదిన్నర వేల మంది చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నారు. ఇందులో ఇందులో భాగంగానే మరో కొత్త టీకా అందుబాటులోకి రానుంది.
శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల చిన్నారి వరకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. బీసీజీ మొదలుకుని పోలియో చుక్కల వరకు క్రమం తప్పకుండా ఇస్తున్నారు. వీటి కోసం కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కార్డు రూపొందించి, బీసీ జీ, ఓపీవీ, హైపటైసిస్ బి, డీపీటీ, మీసిల్స్, పోలియో, విటమిన్-ఎ వంటి వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు.
తాజాగా నెలన్నర, రెండున్నర, మూడున్నర నెలల చొప్పున వేసే డీపీటీ, హైపటైటిస్-బి , హిబ్ అనే మూడు రకాల టీకాలకు బదులుగా పెంటావాలెంట్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇప్పటికే ప్రైవేటులో లభిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ టీకాలను అక్టోబర్ నుంచి పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అందిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే ఈ వ్యాక్సిన్ ప్రవేశ పెట్టాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ వ్యాక్సిన్‌ను కూడా మూడుసార్లు వాయిదాల పద్ధతిలో ఒకటిన్నర, రెండు న్నర, మూడున్నర నెలల చొప్పున వేస్తారు.
ప్రయోజనాలు ఇవీ...
ఈ వ్యాక్సిన్ వయసుకు తగిన బరువు లేకపోవడం, వాంతులు, విరేచనాలతో బాధపడటం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో ఊపిరితిత్తుల వ్యాధిసోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. దీని ధర ప్రస్తుతం *600 చొప్పున మూడు డోసులకు * 1800 ఉంది. మెరుగైన వైద్య సేవలతో పాటు సులభంగా వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో ధర ఎక్కువైనా ఈ వ్యాక్సిన్‌ను అందరికి అందుబాటులో తెస్తున్నట్లు ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు.
ప్రజలకు అవగాహన
పెంటావాలెంట్ వ్యాక్సిన్ ప్రజలకు అందించేందుకు జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో సౌకర్యాలపై ప్రభుత్వం ఇప్పటికే వివరాలు సేకరించింది. వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి కావాల్సిన వసతులు, రవాణా సౌకర్యం, సిబ్బంది కొరత , గతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన తీరుపై ప్రభుత్వం నివేదికలు సేకరించింది. వ్యాక్సిన్ గురించి ప్రజల్లో వీలైనంత త్వరగా అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెలాఖరులోగా జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చేదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. అనంతరం డివిజన్, మండల స్థాయిల్లో ఆశ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది.
చిన్నారులకు కొత్త టీకా
Published Wed, Jul 2 2014 5:40 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement